విశాఖ ‘స్మార్ట్’ పట్నం
- స్మార్ట్ సిటీపై అమెరికాతో ఏపీ ఎంవోయూ
- ఒప్పందంపై ఏపీ, అమెరికా అధికారుల సంతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చే కార్యాచరణలో సాధ్యాసాధ్యాల అధ్యయనం, సలహా సంప్రదింపులు, వనరుల సమీకరణ అంశాల్లో ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. విశాఖపట్నం(ఏపీ), అలహాబాద్(యూపీ), అజ్మీర్(రాజస్థాన్)లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై ఆయా రాష్ట్రాలు, అమెరికా మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది.
గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో జరిపిన చర్చల్లో ఈ సిటీల అభివృద్ధిపై కుదిరిన అవగాహన మేరకు.. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఒబామా కార్యరూపం ఇచ్చారు. దీని ప్రకారం స్థానిక ప్రభుత్వాలు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ(యూఎస్‌టీడీఏ)కు అవసరమైన సమన్వయం, సాంకేతిక సమాచారం, పథక రచన సమాచారం, సిబ్బందిని, పరికరాలను సమకూర్చాల్సి ఉంటుంది.
ఆదివారం ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అమెరికా, భారత అధికారుల సమక్షంలో యూఎస్‌టీడీఏ డెరైక్టర్ లియోకాడియా ఐజ్యాక్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరస్పరం విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు యూఎస్‌టీడీఏ.. స్మార్ట్‌సిటీ సాధ్యాసాధ్యాల అధ్యయనం, స్టడీ టూర్స్, వర్క్‌షాపులు, శిక్షణ నిర్వహించేందుకు ఆర్థిక వనరులను ఏపీకి అందజేస్తుంది. అమెరికా ప్రభుత్వ వాణిజ్య శాఖ, యూఎస్ ఎగ్జిమ్ బ్యాంక్, ట్రేడ్ అండ్ ఎకనమిక్ సంస్థలు సైతం ఈ ఒప్పందం బలోపేతం చేయడానికి సహకరిస్తాయి.
యూఎస్ పారిశ్రామిక సంస్థ కూడా..
ఈ సందర్భంగా.. వైజాగ్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అమెరికా పారిశ్రామిక సంస్థ కూడా ముందుకు వచ్చింది.
ఇది.. కొత్త మలుపు: వెంకయ్యనాయుడు
భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కొత్త మలుపని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
అభివృద్ధి సూచిక: మంత్రి నారాయణ
విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థతో కుదిరిన ఒప్పందం ఏపీ అభివృద్ధికి సూచికని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.