సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులకు నిరాశ కలిగించింది. సాధారణ ఎన్నికలకుముందు ఈ దఫా చివరి బడ్జెట్‌గా జనరంజకంగా ఉంటుందని, జిల్లాలవారీగా కూ డా ప్రాధాన్యత దక్కుతుందని ఆందరూ ఆశించినా.. ఆ మేరకు కేటా యింపులు జరగలేదన్న అభిప్రాయం అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులపై వరాల జల్లు... ఉద్యోగాలు, ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి పేద్దపీట వేసినట్లు కనిస్తుండగా.. అత్యధిక శాతం ప్రజలకు లాభం చేకూరే ఆదాయ పరిమితి పెంపును విస్మరించడంపై పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక సాగునీటి వనరు.. తెలంగాణలోని ఏడు జిల్లాలకు ప్రయోజనం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈసారి కూడా జాతీయ హోదా దక్కలేదు. మెడికల్ కాలేజ్‌తోపాటు జిల్లాలో రైల్వేస్టేషన్లు, రైల్వేలైన్లకు అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించ లేదు. గత బడ్జెట్‌లో పేర్కొన్న బల్లార్షా – కాజీపేట మార్గంలో మూడో రైల్వేలైన్‌కు మాత్రం రూ.100 కోట్లు అదనంగా కేటాయించారు. కొత్తపల్లి–మనోహర్‌బాద్ రైల్వేలైన్‌ను గత బడ్జెట్‌లోనే ఆమోదించగా.. నిధులు వెచ్చించి శరవేగంగా పనులు పూర్తి చేస్తామంటూ.. పెద్దపల్లి–నిజామాబాద్ రైలుమార్గంలో పెద్దపల్లి నుంచి లింగంపేట వరకు 83 కిలోమీటర్లు రైల్వేలైన్‌ను విద్యుద్దీకరించనున్నట్లు ప్రకటించారు.
‘స్మార్ట్ సిటీ’గా కరీంనగర్‌కు నిధులు
రైతుల సంక్షేమం, వ్యవసాయానికి ఎన్నడూ లేనివిధంగా ఈసారి రూ.11లక్షల కోట్లు కేటాయించారు. నాబార్డుతో సహకార బ్యాంకులను అనుసంధానం చేసి రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 12,00,781 కుటుంబాలు ఉంటే 4,32,189 రైతు కుటుంబాలు ఉన్నాయి. పంటల బీమా లెక్కల ప్రకారం 7.33 లక్షల మంది రైతులుండగా వీరికి రుణ సౌకర్యం కలిగే అవకాశం ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా భారీ నిధులు కేటాయించిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాబ్‌కార్డులు పొందిన 6,59,173 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇదివరకే దేశంలోని 99 నగరాలను స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఈబడ్జెట్‌లో రూ.2.04 లక్షల కోట్లు కేటాయించింది. దీంతో స్మార్ట్‌సిటీ జాబితాలో ఉన్న కరీంనగర్ నగర అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు విడుదల కానున్నాయి. సుమారు 3.50 లక్షల మంది నివసించే నగరానికి మహర్దశ రానుంది.
పరిశ్రమలకు దక్కని ప్రోత్సాహం.. రైల్వే కేటాయింపులు పాతవే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం చేసిన సాయం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, జగి త్యాల, తిమ్మాపూర్ ప్రాంతాల్లో గతంలో చేసిన ప్రతిపాదనల ఊసే లేదు. మెగా ఫుడ్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సుముఖత తెలిపిన కేంద్రం.. ఈసారి కూడా మొండిచేయి చూపింది. ఇవేకాక ఇతర ఏ ఒక్క కొత్త పరిశ్రమ జిల్లాలో ఏర్పాటుకు కేంద్రం మొగ్గుచూపలేదు. దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా రూ.2500కోట్ల పన్నులు కేంద్రానికి చెల్లిస్తుండగా.. ఈ బడ్జెట్‌లో రూ.2000కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో పనిచేస్తున్న వేలాది మంది సింగరేణి సంస్థ కార్మికులకు ఆదాయపన్ను మినహాయిస్తారని భావించినా కేంద్రం దానిపై దృష్టి సారించలేదు. ఈ బడ్జెట్‌లో రైల్వేకోసం రూ.1,74,000 కోట్లు కేటాయించగా.. స్టేషన్ల పునరుద్ధరణ, హైటెక్ హంగులు కల్పించడం కోసం పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్‌కు స్థానం దక్కనుంది. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ వేగం పెంచడంతోపా టు పెద్దపల్లి–లింగంపేట మధ్య 83 కిలోమీటర్ల రైల్వేలైన్ విద్యుద్ధీకరణ, కాజీపేట–బల్లార్షా మధ్య మూడో రైల్వేలైన్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో పూర్తిగా భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల నిఘాకు నిధులు కేటాయించగా పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, జగిత్యాల తదితర రైల్వేస్టేషన్లకు స్థానం దక్కనుంది.
బడ్జెట్ నేపథ్యంలో జిల్లా గణాంకాలు
ఉమ్మడి జిల్లాలో కుటుంబాలు 927865
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు 751791
నగర/పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు 176074
భూమిలేని నిరుపేద కుటుంబాలు 468950
ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు 31531
రోజుకూలీపై ఆధారపడుతున్న కుటుంబాలు 467959
మొబైల్‌ఫోన్లు వాడుతున్న కుటుంబాలు 630619
ల్యాండ్‌లైన్ ఫోన్ వాడుతున్న కుటుంబాలు 6476
మొబైల్ ఫోన్లు లేని కుటుంబాల సంఖ్య 108451
వాహనాలు వాడుతున్న కుటుంబాలు 177052
ధూమపానం, సెల్‌ఫోన్లు ప్రియం
బడ్జెట్‌లో ఆదాయ పరిమితిని పెంచుతారని ఆందరూ భావించినా.. ప్రభుత్వం ఆ అంశాన్నే ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంచుతారని ఆశించిన వారికి ఆశాభంగం కలగింది. నిరుద్యోగులను ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లలో పెరిగిన వేతనాలను పరిశీ లిస్తే అంతకంటే ఎక్కువగా ధరలు పెరిగాయి. పరోక్షపన్నులు భారీగానే చెల్లిస్తున్న ఉద్యోగులపై ప్రత్యక్ష పన్ను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆదాయం రూ.5 లక్షల వర కు పన్ను పూర్తిగా మినహాయించాలన్న వాదన వేతనజీవుల నుంచి వినిపిస్తోంది. రూ.5లక్షలు పైబడి రూ.10 లక్షల వరకు 10 శాతం పన్నురేటు నిర్ణయించాలని, పొదుపు మొత్తాలపై పన్నురాయితీని రూ.3 లక్షలకు పెంచాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బడ్జెట్ ధూమపానప్రియులు, సెల్‌ఫోన్ వాడకందారులకు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, పాదరక్షలు, పాన్‌మసాల, టూత్‌పేస్టులు, బంగా>రం, వెండి, సిల్క్‌వస్త్రాలు సహా దిగుమతి చేసుకున్న కూరగాయలపైనా పన్నులు విధించారు. దేశీయ కంపెనీలు మినహా ఇతర కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్‌లపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతో మొబైల్ ఫోన్ల కొనుగోలుదార్లపై భారం పడనుంది. కార్లు, బైక్‌లతోపాటు టైర్లపైనా ధరలు పెరిగాయి.
ఆశించిన రీతిలో లేదు
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం మిగతా విషయాల్లో ఆశించిన రీతిలో మోడీ ప్రభుత్వం స్పందించలేదు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో ఆర్థిక కేటాయింపులు చేయకపోవడం బాధాకరం. ఎలక్షన్‌కు పోయేముందు అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ జనరంజకంగా లేదు. మోడీకేర్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఆరోగ్యభద్రతను 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తామని చెప్పి రూ.2 లక్షల కోట్లు ఖర్చయ్యే స్కీంకు, రూ.20 వేల కోట్లు కేటాయించడం చూస్తే అమలు ప్రశ్నార్థకంగా ఉంది. రైల్వేలు, భారత్‌మాల జాతీయ రహదారులపై దష్టిపెట్టలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలను డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.– బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీ
పేదల పక్షం ఉంటే బాగుండేది
బడ్జెట్‌లో కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరం. కనీస మద్దతు ధరలను 50 శాతం పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. బడ్జెట్ పేదల పక్షాన ఉండి ఉంటే బాగుండేది. గ్రామీణ ప్రజల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టామని చెప్పినా పెద్దగా కేటాయింపులు లేవు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ వైఖరి విచిత్రంగా ఉంది. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరం. పెద్దపెద్ద కంపెనీలను వదిలి, మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై ట్యాక్స్ వేయడం సరికాదు.– కల్వకుంట్ల కవిత, ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment