కొత్త ఆశల వైపు..
సాగర సోయగాలను అణువణువునా సింగారించుకున్న సుందర నగరం మనది. ఉజ్వల భవిష్యత్తు దిశగా పరుగులు
తీసే అద్భుత ప్రదేశం మనది. అయితే అనుకోని విపత్తు ఈ సౌందర్యాన్ని చిందరవందర చేసింది. అనూహ్యంగా ఎదురైన అవాంతరం ఈ ప్రయాణానికి అవరోధం సృష్టించింది. నిజమే.. ప్రకృతి మునుపెన్నడూ లేని రీతిలో విశాఖపై పగబట్టింది. అంతమాత్రాన ఈ పయనం ఆగదు కదా.. ఉరకలేసే జలపాతాన్ని గండశిల అడ్డుకుంటే ప్రవాహం దానిపై నుంచి పొంగిపొర్లక తప్పదు కదా! దీపశిఖ వంటి విశాఖను సుడిగాలి చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన వెలుగుల వెల్లువ నిలిచిపోదుగా! సంకల్పబలం ముందు ప్రకృతి సైతం తలదించక తప్పదని విశాఖ ఇప్పటికే నిరూపించింది.
ఆ మనోబలంతోనే ఈ మహానగరం పురోగమిస్తుంది. రాష్ట్ర ముఖచిత్రం మారిన నేపథ్యంలో విశాఖ ప్రాధాన్యం ఇంతింతై పెరుగుతోంది. స్మార్ట్ సిటీ చాన్స్, ఐటీఐఆర్ ఇంపార్టెన్స్ విశాఖ భవిష్యత్తుకు ఆలంబనగా నిలిస్తే, సహజసిద్ధమైన సౌందర్యం కారణంగా లభించబోయే పర్యాటక మహర్దశ విశాఖ స్వరూపాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది. అందుకు ఈ కొత్త సంవత్సరమే ఆలంబన కానుంది. విశాఖ వాకిట మళ్లీ కళకళలాడనున్న మామిడాకుల తోరణం ఉజ్వల భవితకు సంకేతం కాకుంది. నేటి సూరీడి సాక్షిగా రేపటి వెలుగు కాంతులీనబోతోంది.