‘స్మార్ట్ సిటీ’లకు సహకరించండి
ఏడీబీకి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి
బకూ/న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్లు, రైల్వేలు, మౌలిక రంగాల అభివృద్ధికి తద్వారా ఉపాధి కల్పనకు సన్నిహిత సహకారం అందించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)కు విజ్ఞప్తి చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కార్యక్రమాల ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి భారత్ గట్టి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా అన్నా రు. అజర్‌బైజాన్ రాజధాని బకూలో శనివారం ప్రారంభమైన నాలుగు రోజుల 48వ ఏడీబీ వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్న జైట్లీ, ఈ సందర్భంగా ‘ఫస్ట్ బిజినెస్ సెషన్’లో మాట్లాడారు. ముఖ్యాంశాలు...
⇒ 2015, 2016ల్లో 7.5 శాతం నుంచి 8 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందని భారత్ భావిస్తోంది. భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోందనడానికి ఇది సంకేతం. అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సరం లోపే ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
⇒ భారత్ వృద్ధి రేటును పటిష్టంగా, స్థిరంగా కొనసాగించడం మా ప్రధాన లక్ష్యం. మౌలిక వృద్ధి, నైపుణ్యం పెంపుదల, వ్యాపార అవకాశాల మెరుగుదలకు చర్యలు, ఆర్థిక సంస్కరణల ద్వారా పటిష్ట వృద్ధి లక్ష్యాన్ని భారత్ కోరుకుంటోంది.
⇒ 2020 నాటికి ఏడీబీ వార్షిక వ్యాపారం 20 బిలియన్ డాలర్లకు పెరగాలి. ఇది ఏడీబీకి ఒక కార్పొరేట్ లక్ష్యం కావాలి. ఏడీబీ కార్యకలాపాలు పెరగడమేకాదు, ఆయా కార్యకలాపాల ద్వారా ఒనగూడే ప్రయోజనాలు సైతం పెరగాలి. 2014లో ఏడీబీ మొత్తం రుణాలు, గ్రాంట్స్ విలువ 13.5 బిలియన్లు. ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌ను చూస్తే... ఈ పరిమాణం 9 బిలియన్ డాలర్లు.
⇒ ఏడీబీకి భారత్ అతిపెద్ద భాగస్వామి. ఈ భాగస్వామ్యం మరింత ముందుకు సాగాలి.