సీమాంతర పన్ను ఎగవేతలపై పోరు
• పరస్పర ఆర్థిక సహకారం
• భారత్, బ్రిటన్ అంగీకారం
న్యూఢిల్లీ: సీమాంతర పన్ను ఎగవేతలపై పోరు కొనసాగించాలని, ఆర్థిక సేవల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని భారత్, బ్రిటన్ నిర్ణయించాయి. మరిన్ని భారత కంపెనీలు మసాలా బాండ్ల ద్వారా నిధులు సమీకరించేలా ప్రోత్సహించి.. పెట్టుబడులకు ఊతమివ్వాలని తీర్మానించాయి. తొమ్మిదో విడత భారత్–బ్రిటన్ ఆర్థిక చర్చల్లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బ్రిటన్ ఆర్థిక మంత్రి ఫిలిప్ హామండ్ ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్‌సీఏ) నియంత్రణ సంస్థల స్థాయిలో పరస్పరం సహకరించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందం సాధ్యాసాధ్యాలని కూడా పరిశీలించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఎన్‌హెచ్‌ఏఐ లండన్‌లో త్వరలో తలపెట్టిన మసాలా బాండ్ల జారీ ప్రతిపాదన, లండన్ స్టాక్ ఎక్సే్చంజీలో ఐఆర్‌ఈడీఏ గ్రీన్ బాండ్ల జారీ తదితర అంశాలను బ్రిటన్ స్వాగతించింది. మరోవైపు, రుణ ఎగవేత ఆరోపణల ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంపై స్పందించడానికి హామండ్ నిరాకరించారు. ఇది కోర్టు పరిధిలో ఉందని వివరించారు.