ఢిల్లీలోనే మొదటి స్మార్ట్‌సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దేశంలోనే మొదటి స్మార్ట్‌సిటీని ఏర్పాటుచేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. లండన్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి గ్లోబల్ సిటీల్లో ఉన్న అన్ని అత్యాధునిక సదుపాయాలతో ఢిల్లీని నిజమైన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని తాము ఆశిస్తున్నట్లు వెంయ్యనాయుడు చెప్పారు. డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటి ప్రపంచస్థాయి వినోదప్రదేశాలు ఢిల్లీలోనూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఏర్పాటుచేయాలని ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని అందులో మొట్టమొదటి స్మార్ట్ సిటీ ఢిల్లీలోనే ఏర్పాటుచేస్తామని నాయుడు తెలిపారు. ఢిల్లీ దేశానికి గుండెకాయవంటిదని, అందుకే మొట్టమొదటి స్మార్ట్ సిటీ కూడా ఇక్కడే ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. ఈ దిశలో భారత్‌కు సాంకేతిక సహాయమందిస్తానని స్పెయిన్‌లోని బార్సిలోనా నగర అధికారులు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
తాను ఇటీవల బార్సిలోనా నగరాన్నిసందర్శించానని, ఆధునిక భవనాలను కలిగి ఉన్న ఆ నగరం పురాతన భవనాలను కూడా పరిరక్షించుకుంటోందన్నారు. ఘనమైన సంప్రదాయ నిర్మాణాలు కలిగిన మనదేశంలో కూడా అటువంటి వాతావరణాన్ని కొనసాగించేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. స్మార్ట్ సిటీ ఏర్పాటు కోసం ‘లాండ్ పూలింగ్’ విధానం ద్వారా భూసేకరణ జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రస్తుతం పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, డీడీఏ పరిశీలిస్తున్నాయని వివరించారు. ఢిల్లీలో జనాభాతో వాహనాల సంఖ్య కూడా ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు.
నగరంలో ప్రస్తుతం 85 లక్షల వాహనాలు ఉన్నాయని, రద్దీని త్గగించడం కోసం సర్క్యులర్ రైల్వే, మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలను తేవడంతో పాటు బీఆర్‌టీ కారిడార్‌ను పునరుద్ధరించడం, మెట్రో నెట్‌వ ర్క్‌ను విస్తరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో స్మార్ట్ సిటీ ఏర్పాటుచేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు డీడీఏ వైస్‌చైర్మన్ బల్విందర్ కుమార్ తెలిపారు. స్మార్ట్ సిటీని పూర్తి ఉపనగరంగా నిర్మించనున్నట్లు ఆయన వివరించారు. ద్వారకా, రోహిణీ, నరేలాలకు చెందిన 20 -24 ఎకరాల్లో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారని ఆయన చెప్పారు. పూర్తి వైఫై కనెక్టివిటీ కలిగిన ఈ స్మార్ట్ సిటీ హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని, వర్షపునీటి సేకరణ, వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం వంటి సదుపాయాలతో పాటు ఇతర అత్యాధునిక సదుపాయాలను కలిగి ఉంటుందని ఆయన చెప్పారు.
ప్లాట్ల అలాట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి
డీడీఏ హౌజింగ్ స్కీమ్- 2014 కింద ఫ్లాట్లు అలాట్ అయినవారికి వాటిని లాంఛనంగా అందించే ప్రక్రియను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. డీడీఏ ప్రధాన కార్యాలయం వికాస్ సదన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన లక్కీ డ్రాలో ఫ్లాట్లు గెలుచుకున్న కొంతమంది దరఖాస్తుదారులకు అలాట్‌మెంట్ లెటర్లను అందచేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరళీకరించనుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. పారిశ్రామిక ప్రదేశంలో ఫ్యాక్టరీలతో పాటు షోరూములు కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పరిశీలించడం కోసం త్వరలో ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు.