భూములు, ఆస్తులకు పాత మార్కెట్ ధరలే కొనసాగింపు
ధరలు అప్‌డేట్ చేయని రిజిస్ట్రేషన్ల శాఖ
అయోమయంలో రియల్ వ్యాపారులు
స్మార్ట్ వార్డు, స్మార్ట్ సిటీ.. స్మార్ట్ పాలన.. అంతా స్మార్ట్. పాలకులు ఏమి మాట్లాడినా స్మార్ట్ గురించే. ఈ-ఆఫీస్, ఈ-పోస్, ట్యాబ్లెట్ల వాడకం ఇలా పాలన అంతా ఆన్‌లైన్‌లోనే. మరి ఎంతో ముఖ్యమైన సమాచారం మాత్రం సంబంధిత వెబ్‌సైట్లలో అప్‌డేట్ కావడం లేదు. ఇదీ మన స్మార్ట్ సార్‌ల తీరు.
గాంధీనగర్: ప్రభుత్వం స్మార్ట్‌పాలనకు తెరతీసింది. ఈ- ఆఫీస్ పేరుతో ఓ వైపు పేపర్ వాడకానికి స్వస్తి పలుకుతున్నారు. వీఆర్వో స్థాయినుంచి ఉన్నతాధికారుల వరకు ట్యాబ్‌లు అందిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేసి మొబైల్‌లోనే భూముల వివరాలు తెలుసుకునే విధంగా ‘మీ భూమి పోర్టల్‌ను రూపొందించింది. చివరికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంట్ రైటర్స్‌పై ఆధారపడకుండా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంటి వద్దనుంచే ప్రభుత్వ సేవలన్నీ పొందవచ్చని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేదని ప్రజలు సంబరపడ్డారు. కాని కొన్ని వెబ్‌సైట్లలో సమాచారం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. నిరంతరం మార్పులు జరుగుతున్నప్పటికీ పాత డేటా ఆప్‌డేట్ చేయకుండా అలానే కొనసాగిస్తున్నారు. ఆ కోవకు చెందిందే రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్. ప్రభుత్వం భూములు, ఆస్తుల మార్కెట్ ధరలను అమాంతం పెంచేసింది. రాజధాని నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో అరవై నుంచి వంద శాతం వరకూ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ధరలను పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం అధికారక వెబ్‌సైట్‌లో మాత్రం పాత మార్కెట్ ధరలను కొనసాగిస్తోంది. వెబ్‌సైట్‌లో భూ ముల మార్కెట్ ధరలు అప్‌డేట్ చేయలేదు. 1 ఏప్రిల్, 2013న పెంచిన ధరలే ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, డాక్యుమెంట్ రైటర్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.
భూముల కొనుగోలుదారులు మండలాలు,గ్రామాల వారి మార్కెట్ ధరలు, సర్వే నంబర్‌వారీ మార్కెట్ ధర ఎంత? అనే వివరాలను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌పై ఆధారపడతారు. ఉదాహరణకు వీరులుపాడు మండలంలోని జయంతి గ్రామంలో గతంలో ఎకరం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగా ఉంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మార్కెట్ ధర రూ. 5లక్షలు అయింది. వైబ్‌సైట్‌లో మాత్రం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగానే ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, స్టాంప్‌డ్యూటీ ఎంత చెల్లించాలో వెబ్‌సైట్‌లోని మార్కెట్ ధరల క్యాలిక్యులేటర్ వినియోగిస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు వస్తాయి. ధరలు మార్చకపోవడం క్యాలిక్యులేటర్ వినియోగించిన వారికి పాత ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. వైబ్‌సైట్‌ను నేషనల్ ఇన్‌ఫార్మటిక్ సెంటర్ వారు డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ధరలు పెరిగి పదిరోజులు కావస్తున్నా కొత్త ధరలు అందుబాటులోకి రాలేదు.
పట్టణాల్లో సమస్య తీవ్రం
పట్టణ ప్రాంత వ్యాపారులు వైబ్‌సైట్ అప్‌డేట్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాల్లో వీధి వీధికి మార్కెట్ ధరలలో వ్యత్యాసం ఉం టుంది. ఒకే వీధిలో డోర్ నంబర్ల వారీగా ధరల్లో తేడాలున్నాయి. పెరిగిన మార్కెట్ ధరల వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయకపోవడంతో వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసి సమాచారం అందించాలని వ్యాపారులు కోరుతున్నారు.
అంతా టూ లేట్... ఇదేనా స్మార్ట్
Published Tue, Aug 11 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement