టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం
గతేడాది రూ.9,540 కోట్లు..
ఈ ఏడాది ఇప్పటికి రూ.5,500 కోట్లే
జూన్ నుంచి తగ్గుతూ వచ్చిన రిజిస్ట్రేషన్లు.. ఇక మిగిలింది 4 నెలలే
అనకాపల్లి, అల్లూరి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 40 శాతానికి
పైగా డౌన్.. హడావుడి మినహా కొనుగోళ్లు లేవని రియల్టర్ల ఆందోళన
మార్కెట్ విలువ పెంచితే కానీ లక్ష్యాన్ని సాధించలేమంటున్న అధికారులు
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా ప్రతి నెలా సగటున వెయ్యి నుంచి 1,200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు 800 రిజిస్ట్రేషన్లు జరగడం కూడా గగనంగా ఉంది. గత మూడేళ్లూ స్థిరాస్తిలో దూసుకెళ్లిన విశాఖలో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. తిరుపతిలోనూ భారీగా జరిగే రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా తగ్గిపోయాయి.
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు చూస్తోంది. స్థిరాస్థులరిజిస్ట్రేషన్లు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలతో కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద అసలు సందడే కనిపించడంలేదు. ఈ ఏడాది జూన్ నుంచిరిజిస్ట్రేషన్లు తగ్గిపోవడంతో ఆ శాఖ ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత సంవత్సరం వచ్చినంత ఆదాయం ఈసారి వచ్చే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు గద్దెనెక్కితే రియల్ బూమ్ వస్తుందంటూ ప్రచారం చేసిన వారంతా ఈ పరిస్థితి చూసి నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.
భారీగా తగ్గినరిజిస్ట్రేషన్లు..
2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 21.91 లక్షల స్థిరాస్తులరిజిస్ట్రేషన్లు జరగగా అంతకుముందు రెండేళ్లు కూడారిజిస్ట్రేషన్ల సంఖ్య 26 లక్షలకుపైనే ఉంది. ఈ ఏడాది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగినరిజిస్ట్రేషన్లు సుమారు 12 లక్షలు మాత్రమే. ఆరి్థక సంవత్సరం ముగియడానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలింది. కనీసం గతేడాది తరహాలోరిజిస్ట్రేషన్లు జరగాలన్నా సుమారు మరో 10 లక్షలరిజిస్ట్రేషన్లు జరగాలి. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు గమనిస్తుంటే అది కష్టమేనని చెబుతున్నారు. సాధారణంగా ఏటారిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుంది. ఈదఫా అదనంగా పెరగకపోగా గతంలో ఉన్న సంఖ్యను కూడా చేరుకునే అవకాశం కనిపించడంలేదు.
లక్ష్యంలో సగం కూడా చేరుకోలేదు..
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,500 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలనిరిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు రూ.5,500 కోట్ల లోపే సమకూరింది. అలాంటప్పుడు మరో నాలుగు నెలల్లో రూ.8 వేల కోట్ల ఆదాయాన్ని సాధించడం ఎలా సాధ్యమని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత సంవత్సరం (2023–24)లో రూ.9,546 కోట్ల ఆదాయం రాగా అంతకుముందు సంవత్సరం (2022–23)లో రూ.8,064 కోట్ల రాబడి వచ్చింది.రిజిస్ట్రేషన్ల ఆదాయం గతంలో టీడీపీ హయాంలో రూ.5 వేల కోట్ల లోపే ఉండగా వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా సుమారు రూ.10 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం.
ప్రధాన జిల్లాల్లో నిరాశే..
ఈ ఆరి్థక సంవత్సరంలో విశాఖ జిల్లాలో లక్ష్యం రూ.1,526 కోట్లు కాగా దాని ప్రకారం అక్టోబర్ నాటికి రూ.862 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.561 కోట్లు మాత్రమే వచ్చాయి. అక్టోబర్ నాటికి కాకినాడ జిల్లా రూ.347 కోట్ల ఆదాయాన్ని రాబట్టాల్సి ఉండగా రూ.196 కోట్లే సాధించగలిగారు. ఎనీ్టఆర్ జిల్లాలో అక్టోబర్ వరకు రూ.695 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.398 కోట్లే వచ్చాయి. గుంటూరు జిల్లాలో రూ.659 కోట్లకుగానూ రూ.483 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. తిరుపతి జిల్లాలో రూ.442 కోట్లకుగానూ రూ.252 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. నంద్యాలలో అయితే 50 శాతం తగ్గుదల నమోదు కాగా అనకాపల్లి, కర్నూలు, పుట్టపర్తి జిల్లాల్లో తగ్గుదల 40 శాతం కంటే అధికంగా ఉంది.
త్వరలో మార్కెట్ విలువ పెంపు!
ఆదాయ లక్ష్యాన్ని సాధించాలంటే భూముల మార్కెట్ విలువలు పెంచడం మినహా మరో మార్గం లేదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో మార్కెట్ విలువను 50 శాతం వరకు పెంచి ఆదాయం పెరిగినట్లు చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కొనుగోలుదారులపై ఆ మేరకు భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment