స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో బలవంతపు బదిలీలు
ఆదాయం ఎక్కువ ఉండే పోస్టులకు వేలంపాట!?
విజయవాడ గాంధీనగర్, గన్నవరం, కంకిపాడు, మంగళగిరి, గుంటూరు తదితర సబ్‌రిజిస్ట్రార్ పోస్టుల రేటు రూ.కోటికి పైగానే..
విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ఇప్పటికే లోపాయికారిగా వేలం
లావాదేవీల ఆధారంగా ధర ఫిక్స్
అందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రైవేట్ మెసెంజర్‌లో అనధికారిక ఆదేశాలు
భారీగా దండుకునేందుకు చిన్నబాబు పెద్ద పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న వివాదాస్పద ఉత్తర్వులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. లావాదేవీలు, ఆదాయం ఎక్కువగా వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పోస్టులపైన అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. ఆ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్‌గా వచ్చేందుకు ధర నిర్ణయించి వేలం పాట పెట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈ పాటలో ఎవరెక్కువ మొత్తం చెల్లిస్తారో వారిని ఆయా పోస్టుల్లో కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగా.. నిబంధనలతో సంబంధం లేకుండా సబ్ రిజిస్ట్రార్లంతా బదిలీలకు ఆప్షన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనధికారిక ఆదేశాలు అందడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెసెంజరు ద్వారా ఉత్తర్వులు అందించి, రిక్వెస్ట్ ఫారాలను వాట్సప్‌లో పంపారు. బదిలీ అభ్యర్థనలను శుక్రవారం మధ్యాహ్నంలోపు పూర్తిచేసి పంపాలని షరతు విధించారు.
వారు బదిలీ కోరుకుంటున్న స్థానాల ఆప్షన్లతోపాటు గతంలో వారు పనిచేసిన సెంటర్లు, వారిపై ఉన్న కేసులు, సర్వీసు తదితర వివరాలన్నింటినీ ఫామ్‌లో పూర్తిచేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బంది ఇది తప్పక పాటించాలని ఆదేశించారు. అయితే, ఇది ఎవరు జారీచేశారో ఆ ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్హం. అసలు బదిలీ స్థానాలు గుర్తించకుండా, ఎవరు బదిలీలకు అర్హులో తేల్చకుండా ఆప్షన్లు ఇవ్వాలని సూచించడం బలవంతపు బదిలీలకు ఒత్తిడి చేయడమేనని ఆ శాఖలో గగ్గోలు మొదలైంది.
డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ..
ఎక్కువ రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు, అధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ
ఏర్పడింది. దీనిని అసరాగా చేసుకుని, చినబాబు కనుసన్నల్లోనే నడిచే టీం ఈ పోస్టులకు «ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది.
» ఇందులో మొదటి స్థానంలో విజయవాడ పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు స్టాండర్డ్ ధర
రూ.2 కోట్లుగా నిర్ణయించి, అంతకంటే ఎక్కువ ఇచ్చుకునే వారికే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఈ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పోస్టుకోసం గుణదల, కంకిపాడు, రావులపాలెం సబ్‌రిజిస్ట్రార్లతో పాటు, ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్, ఐజీకి సన్నిహితంగా ఉండే వారూ పోటీపడుతున్నట్లు సమాచారం.
» ఇక రెండవ వరుసలో గాంధీనగర్, గన్నవరం, కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు రూ.కోటికి పైగా ధర పలుకుతున్నాయి. ఈ జాబితాలో గుంటూరు జిల్లా మంగళగిరి, నల్లపాడు, గుంటూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి.
» అలాగే, విజయవాడ పరిధిలోని నున్న, గుణదల, ఇబ్రహీంపట్నం, నందిగామ, బాపులపాడు సబ్ రిజిస్ట్రార్ పోస్టులూ రూ.70 లక్షల వరకు పలుకుతున్నాయి.
» విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఇప్పటికే లోపాయకారీగా వేలం పాట జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
.. ఇలా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా ధరలు ఫిక్స్ చేసి బదిలీల బేరసారాలకు తెరలేపారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రిని కూడా డమ్మీచేసి, ఈ బదిలీల వ్యవహారాలను చినబాబే నేరుగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మార్గదర్శకాలకు భిన్నంగా ‘చిన్నబాబు’ పెద్ద స్కెచ్..
నిజానికి.. ఉద్యోగుల సాధారణ బదిలీలకు వీలుగా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకనుగుణంగా ఆయా శాఖలు మళ్లీ ప్రత్యేకంగా మార్గదర్శకాలిచ్చి బదిలీలు జరపాల్సి వుంది. కానీ, రిజస్ట్రేషన్ల శాఖలో ఈ మార్గదర్శకాలు ఇంకా జారీకాలేదు. అయినా, సబ్ రిజిస్ట్రార్లు తాము బదిలీ కోరుకునే స్థానాలకు సంబంధించిన ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి సందేశాలు వచ్చాయి. వీటిని అడ్డంపెట్టుకుని ‘చినబాబు’ టీం పెద్ద స్కెచ్ వేస్తోంది.
డిమాండ్ ఉన్న పోస్టుల పేరుతో భారీగా దండుకునేందుకే అందరినీ దరఖాస్తు చేసుకోవాలని అనధికారికంగా ఆదేశాలిచ్చింది. తద్వారా తమకు కావల్సిన వారిని ఎంపిక చేసుకోవడం, కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఎవరు రేసులో ఉన్నారో తెలుసుకోవడానికే కౌన్సిలింగ్ ముందు ఈ సందేశాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా ఆప్షన్లు అడగలేదని, కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరిపేటప్పుడు ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని అధికారులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment