Revenue income
-
సేవల రంగం.. సుస్థిర ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో సేవల రంగం కీలకపాత్ర పోషిస్తోందని, కరోనా విపత్తు తర్వాత కోలుకున్న ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో అభి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ అస్థిరత, మందగమనం కూడా నమోదవు తున్నా యని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందుంచింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావే శంలో, ఈ నివేదికలోని అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆర్థిక శాఖ వివరించింది. ⇒ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో స్థిరంగా అభివృద్ధి కనిపిస్తోంది. జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు 10.1 శాతం కాగా, తెలంగాణ 12.8% వృద్ధి నమోదు చేసుకుంటోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% కాగా, జీడీపీలో తెలంగాణ వాటా 5.1%. ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఏటా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ. 1.84 లక్షలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.57 లక్షలు. ⇒ 2014–15 నుంచి 2022–23 వరకు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే కేవలం 81 శాతం మాత్రమే ఖర్చు నమోదయింది. అంటే రూ.100 బడ్జెట్లో ప్రతిపాదిస్తే రూ.81 మాత్రమే ఖర్చు చేయగలిగాం. ⇒ రెవెన్యూ ఆదాయంలో అస్థిరత ఆర్థిక ప్రగతిలో హెచ్చుతగ్గులు, ద్రవ్యలోటుకు దారితీస్తోంది. జీఎస్డీపీతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల రెవెన్యూ ఆదాయం 14.6 శాతం కాగా, తెలంగాణ ఆదాయం 12.2 శాతం మాత్రమే. ⇒ జీఎస్డీపీతో పోలిస్తే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. పంజాబ్ (4.5 శాతం), కేరళ (4.90 శాతం) తర్వాతి స్థానంలో రాష్ట్రం ఉంది. ⇒జీఎస్డీపీతో పోలిస్తే అప్పులు 2014–15లో 18.1 శాతం ఉంటే, 2023–24 నాటికి 27.4 శాతానికి చేరాయి. రూ.5 వేల కోట్లు ఇప్పించండికేంద్ర ప్రభుత్వం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)లోని సెక్షన్ 94(2) ప్రకారం రూ.1,800 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,188.88 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.408.49 కోట్లు, 2014–15 సంవత్సరంలో లెవీ కింద ఎక్కువగా తీసుకున్న రూ.1,468 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాలకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇవ్వాల్సిన రూ.323.73 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజెంటేషన్‌లో రంగాల వారీగా పేర్కొన్న గణాంకాలివే..వ్యవసాయ అనుబంధ రంగాలు (ప్రైమరీ సెక్టార్)సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ప్రకారం ఈ రంగంలో దేశ సగటు 3.5 శాతంతో పోలిస్తే తెలంగాణ సగటు 5.4 శాతంగా నమోదయింది. ఈ మేరకు ప్రగతి శాతం ఎక్కువగానే ఉన్నా ఈ రంగంలో అస్థిర పురోగతి నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే పశువులు, జీవాలు 7.7 శాతం, మైనింగ్ 7.4 శాతం, మత్స్య పరిశ్రమ 6.4 శాతంగా నమోదయ్యాయి. పారిశ్రామిక రంగం (సెకండరీ సెక్టార్): ఈ రంగంలో ప్రగతి అస్థిరంగా ఉంది. దేశ సగటు 5.9 శాతంతో పోలిస్తే మందగమనం కనిపిస్తోంది. ఈ రంగంలో తెలంగాణ సగటు కేవలం 5.7శాతం మాత్రమే. జీఎస్డీపీలో ఈ రంగం వాటా కింద నిర్మాణ రంగం 7.6 శాతం, తయారీ రంగ పరిశ్రమలు 5.4 శాతం నమోదు చేస్తున్నాయి. సేవల రంగం (టెరిటరీ సెక్టార్): ఈ రంగంలో మాత్రం అభివృద్ధి సుస్థిరంగా కనిపిస్తోంది. దేశ సగటు 6.5 శాతంగా ఉంటే తెలంగాణ సగటు 8.1 శాతంగా నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే వాణిజ్య సేవలు 12.4 శాతం, స్టోరేజీ 12, వాయు రవాణా 10.9 శాతం, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు 8.9 శాతంగా నమోదు చేసుకున్నాయి. -
ప్రీమియం హోటళ్లకు డిమాండ్
ముంబై: ప్రీమియం హోటళ్లకు డిమాండ్ సానుకూలంగా ఉన్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదా యం 80 శాతం పెరుగుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15–20 శాతం మేర ఆదాయం పెరగొచ్చని అంచనా వేసింది. విహార, కార్పొరేట్, సమావేశాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ ప్రయాణాలతో హోటళ్ల బుకింగ్‌లు అధికంగా ఉన్నాయని, ప్రమీఇయం హోటళ్లకు దశాబ్దంలోనే గరిష్ట అక్యుపెన్సీకి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అధిక డిమాండ్, రూమ్ రేట్లు పెరగడం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇవన్నీ కలసి, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధిని నడిపిస్తాయని తెలిపింది. సగటు రూమ్ ధరలు కరోనా ముందు నాటి స్థాయికి చేరాయని, ఆపరేటింగ్ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, రూమ్‌ల వారీ ఉద్యోగుల రేషియో తగ్గ డం ఇందుకు మద్దతుగా నిలుస్తోందని వివరించింది. రూమ్ ధరల పెరుగుదల ‘‘ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏపీఆర్) 2021–22లో 13 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19–21 శాతం మేర పెరిగి దశాబ్ద గరిష్ట స్థాయి అయిన రూ.7,500– 10,000కు చేరాయి. అక్యుపెన్సీ (రూముల భర్తీ) 2021–22లో 50 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశాబ్ద గరిష్టమైన 67–72 శాతానికి ఎగిసింది’’అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పుషన్ శర్మ తెలిపారు. అయితే, ప్రీమియం హోటళ్లకు డిమాండ్ పెరిగినప్పటికీ, విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి ఇంకా చేరుకోలేదని ఈ నివేదిక పేర్కొంది. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 54 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించడం గమనార్హం. కరోనా ముందున్న సంఖ్యతో పోలిస్తే ఇది 70 శాతమే. బడ్జెట్ హోటళ్లు.. బడ్జెట్ హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏఆర్ఆర్) కరోనా ముందున్న నాటి కంటే 20 శాతం పెరిగినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. ప్రీమియం హోటళ్ల వ్యాప్తంగా వృద్ధి రేటు ఒకే మాదిరిగా లేదని, విహార పర్యటనలకు సంబంధించి అక్యుపెన్సీ 70–75 శాతంగా ఉందని, అలా కాకుండా వ్యాపార పర్యటనల అక్యుపెన్సీ 65–70గా ఉన్నట్టు తెలిపింది. 2020–22 మధ్య హోటళ్లలో రూమ్ వారీ ఉద్యోగుల రేషియో 20–30 శాతానికి తగ్గినట్టు, డిమాండ్ పెరిగినప్పటికీ వ్యయాల సర్దుబాటును హోటళ్లు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. -
ఆదాయం లాక్‘డౌన్’: రాబడి తగ్గి.. అప్పులు పెరిగి
సాక్షి, హైదరాబాద్: ఖజానాపై కరోనా దెబ్బ పడింది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఆదాయానికి గండికొట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి మాసమైన ఏప్రిల్‌లో ఆశించినంత ఆదాయం వచ్చినా, లాక్డౌన్ ప్రభావానికి గురైన మే నెలలో మాత్రం రాబడులు గణనీయంగా తగ్గిపోయాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ఆదాయాలు తగ్గిపోగా, అమ్మకపు పన్ను రాబడి మాత్రమే ఏప్రిల్ నెలతో పోలిస్తే కొంచెం అటూ ఇటూగా వచ్చింది. అప్పులు అనివార్యం కావడంతో ఒక్క మే నెలలోనే రూ.6,600 కోట్లకు పైగా నిధులను రుణాల రూపంలో సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఇక జూన్ నెలలో కూడా 20 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉన్నందున, ఆ నెలలో కూడా ప్రభుత్వ రాబడులపై ప్రభావం ఉంటుందని, మే నెలలో రూ.2 వేల కోట్ల వరకు తగ్గిన ఆదాయం.. జూన్‌లో రూ.1,500 కోట్ల వరకు తగ్గవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద 2021-22 తొలి త్రైమాసికం నిరాశాజనకంగానే ముగియనుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కేంద్రం నుంచి ఊరట కరోనా తీవ్రత నేపథ్యంలో లాక్డౌన్ మే మాసమంతా అమల్లో ఉంది. ఉదయం 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ఆదాయ శాఖలు పని చేయలేదు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం తగ్గడంతో పాటు జన సంచారం లేని కారణంగా వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పన్ను రాబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.3,019 కోట్లు వస్తే, మే నెలలో అది రూ.1,737 కోట్లకు తగ్గిపోయింది. అంటే దాదాపు రూ.1,300 కోట్లు తగ్గుదల కనిపించింది. ఇక, మద్యం షాపులు కూడా ఉదయం 10 గంటల వరకే ఉండడంతో ఏప్రిల్‌తో పోలిస్తే రూ.250 కోట్ల వరకు తక్కువ విక్రయాలు జరిగాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం అయితే ఏకంగా రూ.500 కోట్లు తగ్గిపోయింది. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, జీఎస్టీ పరిధిలోనికి రాని ఇతర వస్తువుల విక్రయాలపై వచ్చే అమ్మకపు పన్ను మాత్రం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు సమానంగా వచ్చింది. దీంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.500 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.500 కోట్ల రాబడి వచ్చింది. అయినప్పటికీ అప్పులు అనివార్యమై మే నెలలో రూ.6,600 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోవడంతో, ఈ ఏడాది రెండు నెలల్లోనే అప్పుల చిట్టా రూ.8 వేల కోట్లు దాటింది. -
తెలంగాణకు భారీ మిగులు
* కేంద్ర పన్నుల వాటా లేకున్నా ఢోకా లేదు * కేంద్రం వాటా చేరితే 4 రెట్ల మిగులు * 2020 నాటికి రూ.34,252 కోట్ల మిగులు ఆదాయం * 14వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మిగులు ఆదాయానికి ఢోకా లేదు. రెవెన్యూ ఆదాయం... వ్యయాల ఆధారంగా అయిదేళ్ల తర్వాత తెలంగాణలో రూ. 34,252 కోట్ల మిగులు ఆదాయం ఉంటుందని ఆర్థిక సంఘం లెక్కగట్టింది. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.15,003 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసింది. ఏటేటా మిగులు ఆదాయం దాదాపు 20 శాతం చొప్పున పెరుగుతుందని లెక్కలేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా రాకున్నా తెలంగాణలో మిగులు ఆదాయమే ఉంటుందని.. రెవెన్యూ ఆదాయం సమృద్ధిగా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం నివేదిక తేటతెల్లం చేసింది. ఈ నివేదికలో రాష్ట్రాల వారీగా రాబోయే అయిదేళ్లకు సంబంధించిన రెవెన్యూ ఆదాయ, వ్యయాల వివరాలను పొందుపరిచింది. దీని ప్రకారం కేంద్రం ఇచ్చే పన్నుల వాటా లేకుండానే... తెలంగాణ రాష్ట్రానికి 2015-16 సంవత్సరంలో రూ. 818 కోట్ల మిగులు ఆదాయం ఉంటుంది. అయిదేళ్ల తర్వాత రూ. 8,902 కోట్లకు చేరుతుంది. రూ. 3.9 లక్షల కోట్లకు పైగా ఆదాయం.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పన్నులు... పన్నేతర రాబడుల ద్వారా రాబోయే అయిదేళ్లలో తెలంగాణకు రూ. 3,91,256 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ.3,69,284 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం పన్నుల వాటాతో సంబంధం లేకుండా సొంతంగా రాష్ట్రంలో సమకూరే రాబడి.. ఖర్చుల వివరాలను అందులో పొందుపరిచింది. అధిక మొత్తం వడ్డీలకే.. ఇదిలా ఉండగా, ఏళ్లకేళ్లుగా ఉన్న అప్పుల భారం తెలంగాణను వెంటాడుతోంది. గతంలో ఉన్న అప్పులకు చెల్లించే వడ్డీలకే ప్రభుత్వం ఏటా వేలాది కోట్లు కుమ్మరించక తప్పని పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.7,057 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2019-20 నాటికి ఈ వడ్డీల భారం రూ.12,869 కోట్లకు చేరనుంది. దీంతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు భారీగానే ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.8,686 కోట్లు చెల్లించాల్సి వస్తుందని.. 2019-20 నాటికి పెన్షన్ల భారం రూ.12,969 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.