రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో స్థిరంగా అభివృద్ధి
భారీగా పెరుగుతున్న తలసరి ఆదాయం
వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి ఉన్నా అస్థిరత
ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 16వ ఆర్థిక సంఘానికి సర్కారు నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో సేవల రంగం కీలకపాత్ర పోషిస్తోందని, కరోనా విపత్తు తర్వాత కోలుకున్న ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో అభి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ అస్థిరత, మందగమనం కూడా నమోదవు తున్నా యని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందుంచింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావే శంలో, ఈ నివేదికలోని అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆర్థిక శాఖ వివరించింది.
⇒ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో స్థిరంగా అభివృద్ధి కనిపిస్తోంది. జీఎస్‌డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు 10.1 శాతం కాగా, తెలంగాణ 12.8% వృద్ధి నమోదు చేసుకుంటోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% కాగా, జీడీపీలో తెలంగాణ వాటా 5.1%.
⇒ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఏటా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ. 1.84 లక్షలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.57 లక్షలు.
⇒ 2014–15 నుంచి 2022–23 వరకు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే కేవలం 81 శాతం మాత్రమే ఖర్చు నమోదయింది. అంటే రూ.100 బడ్జెట్‌లో ప్రతిపాదిస్తే రూ.81 మాత్రమే ఖర్చు చేయగలిగాం.
⇒ రెవెన్యూ ఆదాయంలో అస్థిరత ఆర్థిక ప్రగతిలో హెచ్చుతగ్గులు, ద్రవ్యలోటుకు దారితీస్తోంది. జీఎస్‌డీపీతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల రెవెన్యూ ఆదాయం 14.6 శాతం కాగా, తెలంగాణ ఆదాయం 12.2 శాతం మాత్రమే.
⇒ జీఎస్‌డీపీతో పోలిస్తే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. పంజాబ్ (4.5 శాతం), కేరళ (4.90 శాతం) తర్వాతి స్థానంలో రాష్ట్రం ఉంది.
⇒జీఎస్‌డీపీతో పోలిస్తే అప్పులు 2014–15లో 18.1 శాతం ఉంటే, 2023–24 నాటికి 27.4 శాతానికి చేరాయి.
రూ.5 వేల కోట్లు ఇప్పించండి
కేంద్ర ప్రభుత్వం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)లోని సెక్షన్ 94(2) ప్రకారం రూ.1,800 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,188.88 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.408.49 కోట్లు, 2014–15 సంవత్సరంలో లెవీ కింద ఎక్కువగా తీసుకున్న రూ.1,468 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాలకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇవ్వాల్సిన రూ.323.73 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రజెంటేషన్‌లో రంగాల వారీగా పేర్కొన్న గణాంకాలివే..
వ్యవసాయ అనుబంధ రంగాలు (ప్రైమరీ సెక్టార్)
సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ప్రకారం ఈ రంగంలో దేశ సగటు 3.5 శాతంతో పోలిస్తే తెలంగాణ సగటు 5.4 శాతంగా నమోదయింది. ఈ మేరకు ప్రగతి శాతం ఎక్కువగానే ఉన్నా ఈ రంగంలో అస్థిర పురోగతి నమోదవుతోంది. జీఎస్‌డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే పశువులు, జీవాలు 7.7 శాతం, మైనింగ్ 7.4 శాతం, మత్స్య పరిశ్రమ 6.4 శాతంగా నమోదయ్యాయి.
పారిశ్రామిక రంగం (సెకండరీ సెక్టార్): ఈ రంగంలో ప్రగతి అస్థిరంగా ఉంది. దేశ సగటు 5.9 శాతంతో పోలిస్తే మందగమనం కనిపిస్తోంది. ఈ రంగంలో తెలంగాణ సగటు కేవలం 5.7శాతం మాత్రమే. జీఎస్‌డీపీలో ఈ రంగం వాటా కింద నిర్మాణ రంగం 7.6 శాతం, తయారీ రంగ పరిశ్రమలు 5.4 శాతం నమోదు చేస్తున్నాయి.
సేవల రంగం (టెరిటరీ సెక్టార్): ఈ రంగంలో మాత్రం అభివృద్ధి సుస్థిరంగా కనిపిస్తోంది. దేశ సగటు 6.5 శాతంగా ఉంటే తెలంగాణ సగటు 8.1 శాతంగా నమోదవుతోంది. జీఎస్‌డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే వాణిజ్య సేవలు 12.4 శాతం, స్టోరేజీ 12, వాయు రవాణా 10.9 శాతం, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు 8.9 శాతంగా నమోదు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment