ఇక రిజిస్ట్రేషన్ల వంతు
రాష్ట్రంలో నేటి నుంచి 40–50 శాతం పైనే పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
ఏకంగా 40–50% పైనే పెరగనున్న చార్జీలు
రూ.13 వేల కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు
ఇళ్లు, ఇళ్ల స్థలాలు, మొండి గోడలున్న ఇళ్లు, షెడ్లనూ వదల్లేదు
ఆందోళనతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టిన ప్రజలు..
ఆ గడువులోగా క్రయ విక్రయాలు పూర్తి చేసుకోవాలని ఆరాటం
గతంలో రోజుకు 10 వేల రిజిస్ట్రేషన్లు.. కొద్ది రోజులుగా 15 వేలు
కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా బావుంటుందేమోనని ఓట్లేసి గెలిపించినందుకు తమకు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ సహా ఒక్క హామీ నెరవేర్చకుండానే వరుస బాదుళ్లతో నడ్డి విరుస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల బాదుడు చాలదన్నట్లు ఇప్పుడు రూ.13 వేల కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ల చార్జీల వడ్డింపే లక్ష్యంగా ముందుకెళ్తుండటం దారుణమంటున్నారు. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను పెంచడం.. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లనూ వదలకుండా ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు మొదలవ్వనుంది. ఒక్క అమరావతి ప్రాంతంలో మినహా అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపుపై తీవ్రంగా కసరత్తు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆస్తుల విలువ పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ ప్రతిపాదనలకు జిల్లాల్లోని జేసీ కమిటీలు సైతం తాజాగా గురువారం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి రానున్నాయి. ఇప్పుడున్న దానికంటే 40–50 శాతంపైగానే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రజలపై భారం మోపుతోంది. మరోవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపేసింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
విద్యుత్ చార్జీల పెంపు, మద్యం దందాతో ప్రజల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు జన జీవితాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో సామాన్యుల్లో కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ప్రజలను బాదేందుకు సిద్ధమైంది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలను భారీగా పెంచేసింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను సైతం వదిలి పెట్టకుండా ఆదాయం కోసం వాటి విలువలను పెంచేసింది.
పర్యవసానంగా నగరాల్లో అపార్టుమెంట్లు, ప్లాట్లు కొనుగోలు చేసే వారిపై ఏకంగా రూ.లక్షల్లో భారం పడనుంది. ప్రాంతాలను బట్టి భూముల క్లాసిఫికేషన్ చేసి రేట్లు నిర్ధారించింది. గతానికి భిన్నంగా ప్రాంతాన్ని బట్టి కాకుండా, స్థలాన్ని బట్టి రేటు నిర్ణయించడం గమనార్హం. ఇకపై ఒకే ప్రాంతంలో రోడ్డుకు పక్కన స్థలం ఒకరేటు.. దానికి పక్కనున్న స్థలానికి ఇంకో రేటు, కాస్త లోపల ఉన్న స్థలానికి మరో రేటు ఉంటుంది.
రాత్రి వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రకటనతో ప్రజల నెత్తిన పిడుగు పడినట్టయింది. ఈ క్రమంలో గత పది రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయ విక్రయదారులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగితే.. కొద్ది రోజులుగా ఆ సంఖ్య రోజుకు 15 వేల వరకు ఉన్నట్లు సమాచారం. గురు, శుక్రవారం చివరి రోజులు కావడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లను చేసుకునేందుకు క్యూకట్టారు.
ఉదయం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చిన క్రయ విక్రయదారులు గంటల కొద్దీ క్యూ లైన్లలోనే పడిగాపులు పడ్డారు. విజయవాడలోని పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతంలో రోజుకు 60–70 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు ఏకంగా 180కిపైగానే జరుగుతున్నాయి. విశాఖపట్నంలోని మధురవాడలో ఒకప్పుడు 100–150 రిజిస్ట్రేషన్లు చేసే వారు. ఇప్పుడు 200కుపైగా ఉన్నాయి. రాజమహేంద్రవరంలో రోజుకు సగటున 50 వరకు రిజిస్ట్రేషన్లు అవ్వాల్సి ఉండగా.. సర్వీర్లు మొరాయించడంతో తీవ్ర జాప్యం జరిగింది.
తిరుపతిలోని రేణిగుంట, కర్నూలు, గుంటూరు వంటి ప్రాధాన కేంద్రాల్లో ఎప్పుడూ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరిగిపోతాయనే భయంతో క్రయవిక్రయదారులు కార్యాలయాలకు ముందుగానే క్యూ కట్టారు. శుక్రవారం పాత చార్జీలకు చివరి రోజు కావడంతో ఎక్కువ మంది స్లాట్ బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాత్రి వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి.
అమరావతి రూటు సపరేటు!
రాష్ట్రమంతా భూముల విలువలను పెంచేసిన ప్రభుత్వం ఒక్క అమరావతిలో మాత్రం పెంచకుండా కుట్ర పూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమరావతిలో భూముల విలువలను టీడీపీ నేతలు కృత్రిమంగా పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచేసి హైప్ తేవాలని యత్నిస్తున్నారు. దీన్ని మరింత పెంచేందుకు అక్కడ మాత్రమే భూముల విలువలను పెంచకుండా మినహాయించారు. కేవలం రాజధాని ప్రాంతంలో మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోంది.
రూ.13 వేల కోట్ల ఆదాయం లక్ష్యం
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరించింది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచేసింది. వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు నాలుగైదు రకాలుగా మార్చింది. దీంతో ఒకే ప్రాంతంలోని భూమి విలువ రెండు మూడు రకాలుగా పెరగనుంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. తద్వారా అపార్ట్‌మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment