6 లక్షల కోట్లకు వీడియో విశ్లేషణ రంగం | Video analysis sector to 6 lakh Crore's | Sakshi
Sakshi News home page

6 లక్షల కోట్లకు వీడియో విశ్లేషణ రంగం

Published Thu, Jan 1 2015 2:38 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

6 లక్షల కోట్లకు వీడియో విశ్లేషణ రంగం - Sakshi

6 లక్షల కోట్లకు వీడియో విశ్లేషణ రంగం

స్మార్ట్‌సిటీలంటే వైఫై, 3జీ,4జీ నెట్‌వర్క్‌లు, సైబర్‌హైవేలు, కంప్యూటర్ ఆధారిత అధునాతన వసతుల కల్పనే కాదు.

‘సాక్షి’ ఇంటర్వ్యూ: వీడియోనెటిక్స్ సీఎండీ టింకూ ఆచార్య
2025 నాటికి అంచనా...
* వచ్చే మూడేళ్లలో వీడియోట్రాఫిక్‌దే పైచేయి
* రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడుల దన్ను

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్మార్ట్‌సిటీలంటే వైఫై, 3జీ,4జీ నెట్‌వర్క్‌లు, సైబర్‌హైవేలు,  కంప్యూటర్ ఆధారిత  అధునాతన వసతుల కల్పనే కాదు. కంప్యూటర్ సిస్టమ్‌ల ద్వారా ఉత్పిత్తి అయిన డేటాను  విశ్లేషించి, అర్థవంతమైన పరిష్కారాలను సూచించినప్పుడే ఆయా నగరాల్లో జీవించే పౌరులకు ఉత్తమమైన సేవలందుతాయంటున్నారు వీడియోనెటిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ టింకూ ఆచార్య.  

స్మార్ట్‌సిటీల నిర్మాణాలతో వీడియో విశ్లేషణ  పరిశ్రమ స్థాయిని అందుకుంటోంది. 2025 నాటికి 100 బిలియన్ డాలర్ల  (రూ.6 లక్షల కోట్లు) స్థాయికి వీడియో విశ్లేషణ పరిశ్రమ చేరుకోనుందని ఆచార్య తెలిపారు. 2017 నాటికి  మొబైల్ డేటా ట్రాఫిక్‌లో రెండింట మూడొంతులు వీడియోల కేంద్రంగానే జరగనుందంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జెన్‌నెక్ట్స్ వెంచర్స్ పెట్టుబడులతో వీడియో పర్యవేక్షణ టెక్నాలజీ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఈ సంస్థకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,రైల్వేలు, రక్షణశాఖ, పలు రాష్ర్టల్లోని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లు,  కువాయిత్ ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ, అబుధాబీలోని ముష్రిఫ్‌మాల్, క్యాపిటల్ ప్లాజా మాల్ లాంటి సంస్థలు క్లయింట్లుగా ఉన్నారు.

బహుళ ప్రజాదరణ పొందిన  వెబ్‌క్యామ్ టెక్నాలజీ (ఇంటెల్ సంస్థ) రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ ఆచార్య సాక్షి ప్రతినిధికిచ్చిన ఇం టర్వ్యూలో స్మార్ట్‌సిటీల కోసం తమ సంస్థ అభివృద్ధిచేస్తున్న పలు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల గురించి తెలిపారు. ఆ వివరాలు ఇవీ...
 
స్మార్ట్‌సిటీ అంటే...
స్మార్ట్‌సిటీ అంటే భౌతికంగా అందమైన కట్టడాలను, రోడ్లను నిర్మించడం మాత్రమే కాదు. టెక్నాలజీ పరంగా ఆయా నగరాల్లో జీవించే పౌరులకు సురక్షితమైన, బాదరబందీలేని జీవన విధానాన్ని అందించేవిధంగా సౌకర్యాలను  రూపొందించాలి. కంప్యూటింగ్,వీడియోగ్రఫీ ఆధారంగా నిర్మితమయ్యే స్మార్ట్‌సిటీలలో  రక్షణలేకపోతే అర్ధం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఇంటెలిజంట్ వీడియో ద్వారా సాధ్యమవుతోంది.
 
ఇంటెలిజెంట్ వీడియో అంటే...
దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ,రోడ్డు సేవలకై లక్షలాది కెమెరాలను వినియోగిస్తున్నారని, అయితే అవి ఉత్పత్తి చేసే దృశ్యాలను విశ్లేషించి చర్యలు తీసుకునే వ్యవస్థ లేకపోవడంతో అక్కడ ఇంకా క్రైమ్ రేటు అధికంగానే ఉంటోందన్నారు. వీడియో దృశ్యాలను ఆటోమేటిక్‌గా  విశ్లేషించి నియంత్రణ సంస్థలు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేందుకు వీలుగా వీడియోనెటిక్స్ సంస్థ 70కిపైగా పేటెంట్ కలిగిన సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి పరిచిందని ఆయన చెప్పారు.
 
ఉత్పత్తుల వివరాలు...
ఆటోమేటెడ్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్, రెడ్‌లైట్ అతిక్రమణ గుర్తింపు, వ్యక్తుల ముఖాలను గుర్తించే ఉత్పత్తులు ప్రస్తుతం హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రిటైల్ బిజినెస్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ వీడియో అనలిటిక్స్, స్మార్ట్‌వ్యాన్,వీడియో మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లు మా ప్రధానమైన ఉత్పత్తులు. ఇండియా కోసం ప్రత్యేకంగా 20 పేటెంట్లను పొందాం.
 
మార్కెట్‌పై అంచనాలు?
భవిష్యత్తు ఇంటెలిజెంట్ వీడియోదే. మా పరిశోధన, అభివృద్ధి అంతా కొత్త కొత్త సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల కేంద్రంగానే కొనసాగుతోంది. దేశంలో 100 స్మార్ట్‌సిటీలు ఏర్పాటుకానున్నాయి. పూర్తి స్థాయిలో ఈ మార్కెట్‌పైనే దృష్టి పెడుతున్నాం. కొన్ని విదేశీ సంస్థలు ముఖ్యంగా మైల్‌స్టోన్ సిస్టమ్స్, ఏజెంట్6 లాంటివి ఈ రంగంలో మాతో పోటీకి రాగలవు. అయితే స్మార్ట్‌సిటీల సెక్యూరిటీ దృష్ట్యా దేశీయ సంస్థలనే ఈ రంగంలో ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరాం.
 
పెట్టుబడుల సేకరణ...
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జెన్‌నెక్స్ట్ వెంచర్స్ రెండు రౌండ్లలో పెట్టుబడులు పెట్టింది. అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది మా టర్నోవర్ రూ. 25 కోట్లు దాటనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement