స్మార్ట్‌సిటీల్లో ఆర్కిటెక్చర్లదే కీలకపాత్ర
– కేంద్రమంత్రి సుజన పిలుపు
– దేశానికి ప్రపంచస్థాయి నగరాలు కావాలి
– ఘనంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ స్నాతకోత్సవం
పెనమలూరు:
అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో స్మార్ట్ సిటీలు నిర్మించటానికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని కేంద్ర సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రి వై.సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం కానూరు అన్నే కల్యాణమండపంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ విద్యార్థుల 2వ స్నాత్సకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాలు, పట్టణాల రూపకల్పన జరిగి నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. స్మార్టు సిటీలతో మెరుగైన మౌలిక సదుసాయాలు, చెత్త నిర్వహణ, ఆరోగ్య భద్రత కల్పించవచ్చని అన్నారు. చెన్నై నగరం గత ఏడాది విపరీతమైన వర్షాల వల్ల మునిగిపోయిందని అన్నారు. భవిష్యత్తులో విపత్తులు ఎదురైనప్పుడు నగరాల్లో, పట్టణాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది రాకుండా నగరాలకు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు.
అర్బన్ గ్రోత్ సెంటర్లుగా ఆ నగరాలు
అమరావతి గ్రీన్ ఫీల్డు రాజధాని నిర్మాణంలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించి సత్తాచాటాలని సుజన అన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హిందూపురంలను అర్బన్ గ్రోత్ సెంటర్లుగా అభివృద్ది చేయనున్నామన్నారు. నగరాల అభివృద్దిలో విద్యార్థులు భవిష్యత్తులో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు.
138 మంది విద్యార్థులకు పట్టాలు
స్నాత్సకోత్సవంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆండ్ ఆర్క్‌టెక్చర్‌లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పొందిన 138 మంది విద్యార్థులకు మంత్రి సుజనాచౌదరి పట్టాలు ప్రధానం చేశారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎన్‌ఎస్.గాయత్రీ,ఎం.మిచలీ, ఎస్.గణేష్, ఆశనా జైన్, గరీమాలకు బంగరు పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడెప్రసాద్, స్కూల్ డెరెక్టర్లు రాజీవ్‌మిశ్రా, డాక్టర్ రమేష్, రోహిత్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
మిన్నంటిన సందోహం
ఈ సందర్భంగా విద్యార్థుల సందడి మిన్నంటింది. తలపై ఉన్న టోపీలు గాలిలోకి ఎగురవేసి కేరింతలు కొట్టారు. ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు గ్రూప్ ఫోటోలు దిగారు.