architectures
-
అధిరోహణ: బుక్ షెల్ఫ్ నుంచి భవనం దాకా!
శిఖరాలను అధిరోహించాలంటే పర్వతాల దగ్గరకే చేరుకోనక్కర్లేదు. ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడం కూడా అధిరోహణే. ప్రతి అధిరోహణలోనూ సవాళ్లు ఉంటాయి. సానుకూలంగా గమనిస్తూ అధిగమిస్తేనే దారి సుగమమం అవుతుంది. ఢిల్లీలో ఉంటున్న 30 ఏళ్ల భవ్నా ఖన్నా పురుషుల ప్రపంచమైన భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి ‘శభాష్’ అనిపించుకుంటోంది. తనే శిఖరమంతగా ఎదిగి మరికొందరికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఆర్కిటెక్చర్ రంగం దాదాపు పురుషులదే అయి ఉంటుంది. అలాంటి రంగంలో మూడు వేల రూపాయల నుంచి వర్క్ మొదలుపెట్టిన భవ్నా ఖన్నా నేడు మూడు కోట్ల ప్రాజెక్ట్‌లను కూడా అందిపుచ్చుకుంటోంది. ఢిల్లీవాసి అయిన భవ్నా పెద్ద పెద్ద భవనాలను, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్, రిసార్ట్స్నూ డిజైన్ చేస్తోంది. 30 ఏళ్ల భవ్నా భవన నిర్మాణ రంగంలో ఎదుగుతున్న తీరు, సమస్యలను అధిగమిస్తున్న విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం. ‘‘ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్తైన భవనాలను చూసి, ఎంతో ఇష్టపడేదాన్ని. కొన్నాళ్లకు నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న నా 13వ పుట్టిన రోజున బిల్డింగ్ గేమ్ కానుకగా ఇచ్చారు. ఆ గేమ్‌లో బ్లాకులను కలుపుతూ ఏదైనా భవనాన్ని కట్టచ్చు. ఆ ఆటలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. కట్టిన వాటిని పడేస్తూ, తిరిగి కడుతూ చాలా సమయం గడిపేసేదాన్ని. పన్నెండవ తరగతి తర్వాత, ఐదేళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ కోర్సు చేశాను. ఏడాది పాటు ఉద్యోగం చేశాను. తర్వాత ఉద్యోగంలో నాకోసం నేనేదీ చేయలేనని అర్థం చేసుకున్నాను. నా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాను. ఎవరి సూచనలతోనో పనిచేయలేకపోయాను. నాకు నా సొంత ఆలోచనలు ఉన్నాయి. భవనం లేదా ఫామ్ హౌజ్ లేదా కోట దేనిని నిర్మించాలన్నా ముందగా నా ఆలోచనలను కాగితంమీద పెట్టేదాన్ని. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ.. భవనాన్ని నిర్మించాలంటే ఒక్కో ఇటుకను పేర్చాలి. అలాగే, సిమెంట్, స్టీల్, స్టోన్.. ప్రతీ పనిలో నైపుణ్యం చూపాలి. అందుకు తగిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నా నైపుణ్యాలు నాకు అర్థమయిన తర్వాత నా ఉద్యోగం వదిలి, ఆపై నా పనిని ప్రారంభించాను. స్టూడియో ఆస్ట్రిడ్ ఇండియా పేరుతో కంపెనీని ప్రారంభించాను. ఈ రంగంలో నాకు గాడ్‌ఫాదర్ లేకపోవడంతో నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం సవాళ్లతో కూడుకున్నది. ప్రతీ పని స్వయంగా తెలుసుకుంటూ చేయాలి. ముందు ఎవ్వరూ టీమ్‌గా చేరలేదు. నెమ్మదిగా కలిశారు. చిన్న పుస్తకాల షెల్ఫ్‌తో మొదలు.. కొన్ని రోజుల వరకు నా కంపెనీ పనిలో నేనున్నాను. 2016లో ఒకరోజు త్రీ బై త్రీ బుక్ షెల్ఫ్ చేసివ్వమని ఒక ఆర్డర్ వచ్చింది. మూడు వేల రూపాయలతో వచ్చిన చిన్న ప్రాజెక్ట్ అది. నా కలలు పెద్దవే. కానీ, మొదటి ప్రాజెక్ట్, అందుకే కష్టపడ్డాను. ఆ చిన్న బుక్ షెల్ఫ్ నుంచి ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు, రిసార్టులు డిజైన్ చేస్తున్నాను. 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎల్తైన భవనాలు, మెరిసే అద్దాల గోడలు నా కళ్లలో కలల ఇంటిని కట్టుకునేవి. చిన్నతనంలో నా అరచేతిలో రూపుదిద్దుకున్న చిట్టి చిట్టి భవనాలపైనే నాకు అంత ఆకర్షణ ఉందని అప్పట్లో తెలియదు. పెద్దయ్యాక ఆ కలే నన్ను ఆర్కిటెక్ట్‌గా ఎదిగేందుకు ప్రోత్సాహమిచ్చింది. క్లయింట్ అవసరాలు వినడం నుంచి అమలు చేయడం వరకు అన్ని పనులు స్వయంగా చూస్తుంటాను. సవాళ్లను ఎదుర్కొంటేనే సరైన దారి ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నాలో మార్పు స్పష్టంగా చూశాను. నామీద నాకు చాలా నమ్మకం వచ్చింది. అనుభవం పెరిగింది. ఎక్స్పోజర్ పెరిగింది. ఆరు సంవత్సరాలలో నైపుణ్యం కలిగిన క్రియేటివ్ డైరెక్టర్‌గా నన్ను నేను చూసుకుంటున్నాను. ఆడపిల్లలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు చేసే రోజులు పోయాయి అని నన్ను నేను చూసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించింది. నా స్నేహితుల జాబితాలో కూడా నలుగురిలో మాట్లాడటానికి సిగ్గుపడే అమ్మాయిలు ఇప్పుడు మంచి వక్తలుగా మారారు. శిల్పకళ లేదా వ్యాపార రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు పదే పదే చెప్పే మాట ‘ప్రతి రంగానికి దానికి తగిన సవాళ్లు ఉంటాయి. వాటిని వదులుకోవద్దు. మార్గం ధైర్యంతోనే వేయబడుతుంది. మీరు వృద్ధిలోకి వస్తున్నప్పుడు మరికొన్ని మార్గాలను కనుక్కుంటారు’ అని వివరిస్తారు భవ్నా ఖన్నా. ఈ ఆరేళ్లలో స్పార్క్ ఎక్సలెన్స్ అవార్డు, యువ పారిశ్రామికవేత్త బిరుదును అందుకున్న భవ్నాఖన్నా గురించి ప్రముఖ జాతీయ మ్యాగజైన్లు కవర్‌పేజీ కథనాలతో ఆమె ఘనతను చాటాయి. విజయం ఒక్కరోజులోనే అందకపోవచ్చు. ప్రతీరోజు ప్రయత్నంతోనే మొదలవ్వాలి. ప్రతీ ప్రయత్నం విజయంవైపుగా కృషి చేయాలి. సవాళ్లను స్థైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ ఆర్కిటెక్చర్ జీవనం ఎంతోమందికి ప్రేరణనిస్తోంది. -
వావ్..ఆ పల్లెటూరు బ్యూటిఫుల్
పచ్చని పంటలు, పాడి పశువులు, కల్మషమెరుగని మనుషులతో ఉండే పల్లెటూళ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పట్నవాసాల్లో బిజీబిజీగా జీవితాలు గడిపేవారు పచ్చని పరిసరాలను చూసి మనసుపారేసుకోకుండా ఉండరు. అసలు ఇండోనేసియాలోని ఓ పల్లెటూరును, డెన్మార్క్‌లోని మరో పట్నాన్ని చూస్తే వావ్.. వాట్ ఏ బ్యూటిఫుల్ అనకుండా ఎవరూ ఉండలేరేమో.! అచ్చం బండి చక్రంలా.. డెన్మార్క్ రాజధాని కొపెన్‌హెగాన్ ఆనుకుని ఉన్న బ్రాండ్బీ హేవ్‌బీ నగరంలోని ప్లాట్ల లేఅవుట్ చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. చక్రం ఆకారంలోని లేఅవుట్లో, ఆకుపచ్చని పరిసరాల మధ్య ఉన్న ఇళ్లను చూసి భలే ముచ్చటపడిపోతారు. పురాతన డానిష్ గ్రామాల నమూనాతో ఈ ప్రాంతాన్ని 1964లో ఎరిక్ మైగిండ్ అనే ఆర్కిటెక్ట్ అభివృద్ధి చేశాడు. అచ్చం ఎడ్లబండి చక్రంలా ఉండే లేఅవుట్లో ఇళ్లను నిర్మించారు. ఇలాంటి పలు చక్రాలతో ఓ పట్టణాన్నే సృష్టించారు. చక్రం లేఅవుట్ చుట్టూ పచ్చని మొక్కలు ఉంటాయి. మధ్యలో ఇరుసులాంటి ప్రాంతం అంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని ఆర్కిటెక్టులు చెబుతున్నారు. ఇళ్ల మధ్య కాంపౌండ్ వాల్‌ను కూడా మొక్కలతోనే నిర్మించారు. ఈ లేఅవుట్‌ను ఇటీవల హెండ్రీ డో అనే ఫొటోగ్రాఫర్ డ్రోన్ సాయంతో ఫొటోలు తీసి ఇన్‌స్టా గ్రాంలో ఉంచాడు. దీంతో ఈ ఇళ్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయల ఊరు ఇండోనేసియా, బాలి దీవుల్లో ఉన్న పెంగ్లిపురన్ గ్రామంలో పురాతన సంప్రదాయాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చుట్టూ కొండలు, మధ్యలో ఇళ్ల సముదాయం, వ్యవసాయ ఆధారిత గ్రామం. ఆధునికతకు దూరంగా.. ప్రకృతి ఒడిలో ఆ ఊరు విలసిల్లుతోంది. అసలు ఆ ఊరిలోకి మోటార్ సైకిల్‌కు కూడా అనుమతి ఉండదు అంటే నమ్మలేం కదా?. అందమైన రహదారులు, వాటిని ఆనుకుని వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు, రోడ్డుకు ఆనుకుని అందమైన పూల మొక్కలు, పురాతన సంప్రదాయ రీతిలో పెంకులతో నిర్మితమైన ఇళ్లు.. ఆ వీధుల్లో నుంచి నడుచుకుంటూ వెళితే, అసలు మనం ఈ లోకంలోనే ఉన్నామా అనే భావన కలుగుతుంది. ప్రపంచంలో క్లీన్ విలేజ్‌గా ఈ ఊరికి పేరుంది. పెంగ్లిపురన్ అంటే పూర్వీకులను గుర్తు చేసే ఊరు అని అర్థమట. చాలా మంది ఇక్కడికి వచ్చి తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బాలి ప్రాంతంలోని హిందూ సంప్రదాయం ప్రకారం గ్రామ నిర్మాణం ఉంటుంది. పర్యాంగన్ (పుణ్యకార్యక్రమాలు జరిగే ప్రాంతం), పవోంగన్ (నివేశన స్థలం), పాలేమహన్ (శ్మశానం, సాగుభూమి తదితర కార్యకలాపాలు) ప్రాంతాలుగా గ్రామ నిర్మాణం జరిగింది. గ్రామంలో లభించే వెదురు, కలప, రాళ్లతోనే ఇళ్లను నిర్మించారు. ఏడు వందల మంది జనాభా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో ఏటా వేల సంఖ్యలో వస్తారు. -
సౌకర్యాలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జిల్లాలో దూసుకువస్తున్న స్థిరాస్తి వెంచర్లలో వ్యాపారులు ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరుకు రహదారులు, కాలుష్యం, ఇతర అసౌక్యాలకు నిలయంగా ఉన్న నగర జీవితాన్ని మరిచిపోయేలా మదిని మైమరిపించే అనేక అత్యాధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందమైన ప్రకృతిని వెంచర్లలో నెలకొల్పి కలల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. 40 అడుగుల రోడ్లు, ఫైవ్ స్టార్ సౌకర్యాలు, అందమైన ఆర్కిటెక్చర్ డిజైన్లకు ప్రాధాన్యం ఇచ్చేలా వెలుస్తున్న ఈ వెంచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థలం ఎంపిక నుంచి లే అవుట్ డిజైన్, మౌలిక వసతుల రూపకల్పన, పర్యావరణానికి నేడు అందరూ ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థిరాస్తి వ్యాపారులు కూడా ఆ మేరకు కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త వెంచర్లను వేస్తున్నారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి అధిక విలువ తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పచ్చని మొక్కలతో.. నగర జీవితమంటే ప్రధానంగా కాలుష్యం చెంతనే అనేది నానుడి. జగమెరిగిన ఈ సత్యాన్ని కలలో సైతం రానీయకుండా నగర శివారు ప్రాంతాల్లో కాలుష్యానికి చెక్ పెడుతూ సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన రోడ్లపై ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచటమే కాకుండా వాటి పర్యవేక్షణకు సంస్థలే ప్రాధాన్యం ఇస్తున్నాయి. పచ్చని పార్కులు ఆపై అందమైన డిజైన్లతో కొనుగోలుదారులకు సౌకర్యాల కల్పనలో పోటీపడుతున్నాయి. అతి తక్కువ ధరలో వాయిదాల పద్ధతిలో సైతం ఇళ్ల స్థలాలు లభ్యం కావటంతో మధ్య తరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. వెంచర్ల ఏర్పాటులో రక్షణకు కూడా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆకర్షణీయమైన ముఖ ద్వారంతో స్వాగతం పలుకుతూ 60, 40, 40 ఫీట్ల రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ ఇబ్బంది లేకుండా భూగర్భ కేబుల్స్ వేయటంతో పాటూ కొన్ని సంస్థలు ప్రహారీ గోడ మీద సౌర విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నాయి. 24 గంటల పాటు సెక్యూరిటీ ఏర్పాటుతో కొనుగోలుదారులు ప్రశంసలు పొందుతున్నారు. స్టార్ హోటల్ వసతులు.. నేటి యువత అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇంటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ ఒత్తిడి నుంచి సాంత్వన పొందే ఇంటి నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తోంది నేటి యువత. దీనికి తగ్గట్టుగానే కొంత మంది వ్యక్తిగత గృహాలు ఇష్టపడుతుంటే, మరికొంత మంది అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గ ట్టుగానే వ్యాపారులు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. త్రిబుల్ బెడ్‌కు డిమాండ్ వ్యక్తిగత గృహాలైనా సరే త్రిబుల్ బెడ్రూమ్ నిర్మాణం వైపు నేటి యువత ఆసక్తి చూపిస్తుంది. పార్కింగ్, పచ్చని ఆవరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు 300–500 చదరపు గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను వేస్తున్నారు. అందమైన డిజైన్లతో విల్లాలతో పోటీ పడే ఇటువంటి నిర్మాణాలు నేటి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఉడెన్ ఫ్లోరింగ్ అందానికి, హోదాకి చిహ్నం ఉడెన్ ఫ్లోరింగ్. దీని నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదు. దుమ్ము, ధూళి, ఇసుక, మట్టి వంటివి ఉడెన్ ఫ్లోర్‌కు శత్రువులు. ఇవి గీతలను సృష్టించడమే కాకుండా కాంతి విహీనం చేస్తాయి. అందుకే అవి దరిచేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచుగా మెత్తటి గుడ్డతో శుభ్రం చేస్తుండాలి. ఫ్లోర్‌ను వ్యాక్స్, వార్నిష్, పాలియుథరిన్తో ఫినిషింగ్ చేయించుకుంటే.. ఆ నేల మీద ఆహారపదార్థాలు, ద్రవాలు పడకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే గచ్చు కాంతి మాయం అవుతుంది. పొరపాటున సిరా లేదా నీళ్లు ఒలికితే ముందుగా ఉడెన్ ఫ్లోర్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. తర్వాత వెనిగర్ కలిపిన నీటిలో ముంచిన మెత్తటి గుడ్డతో తుడిచేయాలి. అనంతరం పొడి బట్టతో తుడిస్తే సరిపోతుంది. -
సొంతింటి రాజసం!
‘‘యద్భావం.. తద్భవతి’’ అన్నది ఉపనిషత్తు. ‘నీ ఆలోచనలే నీవు’ అని దానర్థం. అంటే సానుకూల ఆలోచనలు, ఆచరణ మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే గొప్ప వ్యక్తులు, మహనీయుల జీవిత చరిత్ర, సూక్తులను అనుసరిస్తుంటాం. స్ఫూర్తిని పొందుతుంటాం! మరి, అనునిత్యం గొప్పవాళ్ల అడుగుజాడలను ఫాలో కావాలంటే? మన చుట్టూ ఉండే వాతావరణం ప్రేరేపితంగా ఉండాలి. అంటే ఇల్లన్నమాట. దీనర్థం ఇంటి నిర్మాణంలోనే రాజసం ఉట్టిపడాలి. గతంలో ప్యాలెస్‌లు, ప్రీమియం రెస్టారెంట్లకు మాత్రమే పరిమితమైన సబ్లిమినల్ ఆర్కిటెక్చర్స్ తాజాగా నివాస సముదాయాలకూ విస్తరించాయి. సాక్షి, హైదరాబాద్ : మానసిక చైతన్యాన్ని, ప్రేరణను కలిగించడం, అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయడం సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత. ఈ తరహా నిర్మాణాలు ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కోరికను, ప్రోత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తాయన్నమాట. ఇందుకోసం ప్రాజెక్ట్లల్లో మహనీయులు, గొప్ప నాయకుల చిత్ర పటాలు, జీవిత చరిత్రలు, బొమ్మ లు, గుర్తులను పెడతారు. అనునిత్యం ఆయా వ్యక్తుల అడుగుజాడలు కళ్లముందు కదలాడుతుంటూ మన మెదడు పాజిటివ్ ఆలోచనలు చేస్తుంది. దీంతో మాటల్లో, చేతల్లోనూ ఉన్నతమైన భావాలు బహిర్గతమవుతాయి. మొత్తంగా మనిషి ఆరోగ్యకరమైన ఉన్నతికి తొలి అడుగుపడేది సొంతింటి నుంచే! సొంతిల్లే ప్రేరణ.. మనిషి ఎదుగుదలకు చుట్టూ ఉండే వాతావరణం, నివాస పరిసరాలు, భావోద్వేగాలకు సంబంధం ఉం టుందని విశ్లేష కుల మాట. ఉదాహరణకు మనం ఆసుపత్రికి వెళ్లినప్పుడు దయా గుణంతో, గుడికి వెళ్లినప్పుడు భక్తి భావంతో ఉంటాం. అదే ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు రాజసంగా ఉంటాం. ఎందుకంటే? ప్యాలెస్‌లో మనం ఎటు చూసిన రాజుల చిత్ర పటాలు, జీవిత ^è రిత్రలు, గుర్తులు కనిపిస్తుంటాయి గనక! ప్యాలెస్ తరహా వాతావరణాన్ని నివాస సముదాయాల్లోనూ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి హైదరాబాద్ నిర్మాణ సంస్థలు. కామన్ ఏరియాల వినియోగం.. సబ్లిమినల్ ఆర్కిటెక్చర్లో ఇంట్లో కాకుండా ప్రాజెక్ట్ కామన్ ఏరియా, ఓపెన్ స్పేస్, క్లబ్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల బొమ్మలు, జీవిత చరిత్రలు, గుర్తులుంటాయని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. ఉదాహరణకు అప్పా జంక్షన్లో బ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ రాజక్షేత్రలో ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ మేగజైన్లో ప్రచురితమైన గొప్ప వ్యక్తుల కవర్ పేజీలను ఒకదగ్గర ఉంచుతాం. మధ్యలో అద్దాన్ని పెడతాం.అద్దంలో కవర్పేజీను పోల్చుకుంటూ మనమూ ఫోర్బ్స్ మేగజైన్‌ను చేరాలనే ప్రేరణ కలుగుతుందని’’ వివరించారు. సంపదకు, భౌగోళికతకు మధ్య సంబంధం ఉంటుందని విశ్లేషకుల మాట. ఉదాహరణకు ప్రపంచ బిలియనీర్లలో చాలా మంది మన్హటన్, న్యూయార్క్, సిలికాన్‌వ్యాలీలో ఉంటారు. మన దేశంలో అయితే ముంబైలో.. తెలుగు రాష్ట్రాల్లో అయితే బంజారాహిల్స్ లేదా జూబ్లిహిల్స్‌లోనే ఉంటారు. కారణం మనిషి ఉన్నతికి అదొక చిరునామా. పైగా మరింత ఎదుగుదలకు మార్గదర్శి కూడా అదే. రోజూ తిరిగే పరిసరాలు, మాట్లాడే వ్యక్తులు ఉన్నతంగా ఉంటే మనలోనూ ఉన్నతమైన భావాలు, ఆలోచనలు కలుగుతాయి. అప్పా జంక్షన్లో రాజక్షేత్ర... అప్పా జంక్షన్లో 1.8 ఎకరాల్లో రాజక్షేత్ర పేరిట సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. మొత్తం 120 ఫ్లాట్లు. 1,180 నుంచి 1,850 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. రాజక్షేత్రలో మహనీయులు చిత్ర పటాలు, గుర్రం, ఏనుగు, రథం వంటి చిత్రాలను గోడల మీద (మ్యూరల్ ఆర్ట్) చిత్రీకరిస్తాం. నివాసితులకు ప్యాలెస్ తరహా వాతావరణాన్ని కలిగించేందుకు ఫాల్స్ సీలింగ్‌ను కంపెనీయే చేపడుతుంది. 7 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్‌తో పాటూ గ్రాండ్ ప్రివ్యూ థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
అహో టీ హబ్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. భాగ్యనగరానికి తలమానికంగా, దేశంలోనే వినూత్న నిర్మాణ శైలిలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. స్టార్టప్స్‌కు (అంకుర పరిశ్రమలు) కొంగు బంగారంగా మారిన రాయదుర్గం ప్రాంతంలో టీహబ్ రెండో దశ భవనం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ నిర్మాణ శైలిని పోలిన రీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం జరుగుతోంది. సుమారు 10(9+1) అంతస్తులు.. 60 మీటర్ల ఎత్తు.. 90 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణం పనులు వడివడిగా జరుగుతున్నాయి. 3 లక్షల చదరపు అడుగుల వైశాల్యం.. 2 లక్షల చదరపు అడుగుల సువిశాలమైన పార్కింగ్ సదుపాయంతో దాదాపు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో కేపీసీ సంస్థ ఈ పనులు చేపట్టింది. గత ఆరు నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో స్టార్టప్స్‌తోపాటు ఇంక్యుబేషన్ ల్యాబ్ ఉపాధి కల్పన వంటి అంశాల్లో 3 వేల మంది పనిచేసేందుకు వీలుగా అంతస్తులు నిర్మించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ పనులను వచ్చేఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయనునున్నారు. బుర్జ్ ఖలీఫా తరహాలో.. దుబాయ్‌లో 163 అంతస్తుల ఎత్తున నిర్మించిన బుర్జ్ ఖలీఫా టవర్స్ నిర్మాణ శైలి తరహాలో ఈ భవంతి నిర్మాణం ఉంటుంది. బుర్జ్ దుబాయ్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న తిరుచ్చి(కేరళ)కి చెందిన ఎవర్సాండై కంపెనీ ప్రతినిధులే టీహబ్ రెండో దశ భవన నిర్మాణంలోనూ పాలుపంచుకుంటుండటం విశేషం. 3ఈ నిర్మాణ శైలి.. నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలు ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనవి కావడంతో ఈ భవనాన్ని 3డీ నిర్మాణంగా భావిస్తున్నారు. భవన రూపకల్పన, నిర్మాణ విశ్లేషణను ‘ఈటీఏబీఎస్ వి 15.2.2’ అనే నూతన సాఫ్ట్వేర్ ప్రోగ్రాం ద్వారా రూపొందించారు. నిర్మాణ ప్రమాణాల విషయానికి వస్తే ఐఎస్ 456–2000 ప్రకారం బీములు, ఆర్సీసీ గోడలు, స్తంభాలను రూపకల్పన చేశారు. భూకంపాలను తట్టుకునే స్థాయిలో ఐఎస్ 1893–2002 ప్రమాణాల ప్రకారం నిర్మించారు. ఈ టవర్ల నిర్మాణ పనితీరుకు రెస్పాన్స్ స్పెక్ట్రం విశ్లేషణ నిర్వహిస్తుండటం విశేషం. ప్రామాణిక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి గోడలు, శ్లాబులు, మెట్లు, పునాదులను డిజైన్ చేశారు. అధిక ఒత్తిడిని తట్టుకునేలా.. రీ ఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీటు మిశ్రమంతో ఏర్పాటు చేసిన బీం శ్లాబ్ పద్ధతిన పునాది నుంచి రెండో అంతస్తు వరకు నిర్మిస్తున్నారు. మూడో అంతస్తు నుంచి టెర్రస్ వరకు అధిక ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా స్టీలు ఫ్రేం(వీరెండిల్ గర్డర్స్) ఏర్పాటు చేస్తారు. ప్రతి అంతస్తుకు సంబంధించిన శ్లాబ్‌ను డెక్శ్లాబ్ విధానంలో పటిష్టంగా నిర్మించనున్నారు. 9,000 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ ఈ భవంతిని అత్యాధునిక ఇంజనీరింగ్ డిజైన్లు, సాంకేతికత ఆధారంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ శైలి ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. భవన నిర్మాణంలో నాలుగు పిల్లర్ల ఆధారంగా రెండు పునాదులు.. గ్రౌండ్‌ఫ్లోర్.. దానిపై పలు అంతస్తులతో స్టీలు భవంతిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో 9 వేల టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, మరో 2500 టన్నుల రీఇన్ఫోర్స్ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో కాంక్రీటు నిర్మాణం 25 వేల క్యూబిక్ మీటర్లు కావడం విశేషం. 7 వేల క్యూబిక్ మీటర్ల మేర పునాదిని 26 గంటల సమయంలో పూర్తి చేయడం ఇంజనీరింగ్ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో 25 మంది ఇంజనీర్లు.. 200 మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఒక్కో అంతస్తు.. ఒక్కో ప్రత్యేకత గ్రౌండ్‌ఫ్లోర్: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది. చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట సేదదీరేందుకు విశాలమైన పచ్చిక బయలు, వివిధ సౌకర్యాలు ఈ ఫ్లోర్ సొంతం. 1 అంతస్తు విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ ఫ్లోర్ నిర్మాణ శైలి ఉంటుంది. ఇంక్యుబేషన్ కేంద్రంతోపాటు భవనంలో జరిగే రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. 2 అంతస్తు విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ ఫ్లోర్ నిర్మాణ శైలి ఉంటుంది. ఇంక్యుబేషన్ కేంద్రంతోపాటు భవనంలో జరిగే రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. 3,4 అంతస్తులు అంకుర పరిశ్రమలు, ఐటీ, బీపీవో, కేపీవో, సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాల ఏర్పాటు, సమావేశాలు, చర్చల నిర్వహణకు అవసరమైన హంగులుంటాయి. ఆకుపచ్చని మొక్కలు, హరితతోరణంతో అలరారే ఈ ఫ్లోర్లలో వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అనువైన పరిస్థితులుంటాయి. 5 అంతస్తు ప్రశాంతతకు చిహ్నంగా నిలిచే అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నచిన్న కాలిబాటలు.. నీటి సెలయేర్లు.. అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తుంది ఈ అంతస్తు. 6,7 8,9 అంతస్తులు ఇందులో వివిధ కార్యాలయాలు, స్టార్టప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగులకు ఆనందం, ఆహ్లాదం ఇచ్చేలా వసతులుంటాయి. ఉద్యోగులకు ఆటవిడుపు.. ఇన్డోర్ గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్లు, ఫుడ్ కోర్టులు, కెఫిటేరియాలు ఇందులో ఉంటాయి. -
మెట్ల దారులు.. మహా‘బావులు’
విశాలమైన ప్రాంగణం.. చుట్టూ శిల్ప సౌందర్యంతో కొలువు దీరిన నాలుగు మంటపాలు.. ఒక్కో మంటపం పక్కనుంచి దిగువకు రెండేసి మెట్ల దారులు.. మధ్యలో మళ్లీ మంటపం.. దాని పక్కన నాలుగు చొప్పున గదులు.. ఒకవైపు లోనికి చొచ్చుకొచ్చిన భారీ అరుగు.. దానిపై నుంచుని చూస్తే నిర్మాణం మొత్తం కనిపించే ఏర్పాటు.. తిరగేసిన పిరమిడ్ ఆకృతిలో దిగువకు మెట్ల నిర్మాణం..! ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ సమీపంలోని కిచ్చనపల్లిలోని మెట్లబావి ఇది!! అసలు దీన్ని ఎవరు నిర్మించారు.. ఎందుకు నిర్మించారన్న విషయం అధికారికంగా ఇప్పటి వరకు వెలుగుచూడలేదు.. పురావస్తుశాఖ రక్షిత కట్టడాల జాబితాలో కూడా అది లేదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఇలాంటి బావులెన్నో. దేవాలయాలకు అనుబంధంగా కోనేరు, పుష్కరిణులుగా కొన్ని ఉండగా మరికొన్ని విడిగా ఉన్నాయి. అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు అధికారికంగా లెక్క లేదు. ఆలనాపాలనా లేకపోవటంతో వాటిలో కొన్ని రూపుకోల్పోగా, మరికొన్ని కనుమరుగయ్యాయి. ఇప్పటికీ దాదాపు వంద వరకు భద్రంగానే ఉన్నట్టు అంచనా. వాటికి మరమ్మతు చేస్తే మరికొన్ని వందల ఏళ్ల వరకు ఠీవిగా నిలిచి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాణీ కీ వావ్.. ఎనిమిది అంతస్తులు, చూడచక్కని శిల్పాలతో తీర్చిదిద్దిన అద్భుత నిర్మాణం.. ఓ ప్యాలెస్ నిర్మాణంలో ఉండే పనితనం దాని సొంతం.. ఇంతా చేస్తే అదో దిగుడు మెట్ల బావి! కానీ ప్రపంచఖ్యాతి దాని సొంతం. గుజరాత్లో కొలువుదీరిన ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు క్యూ కడతారు. పురాతన మెట్ల బావులనగానే మనకు టక్కున గుర్తొచ్చే ప్రాంతాలు గుజరాత్, రాజస్తాన్. మరి అలాంటి అద్భుత బావులు ఆ రాష్ట్రాలకే పరిమితమా?కానే కాదు.. అందమైన, అంతకుమించి అద్భుతమైన మెట్ల బావులు మనకూ సొంతమే. ఒకటి కాదు రెండు కాదు.. వందకు పైగా చారిత్రక మెట్ల బావులు తెలంగాణలో అలరారుతున్నాయన్న సంగతి మీకు తెలుసా? వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ అరుదైన, అబ్బురపరిచే బావుల గురించి చాలామందికి తెలియదు. వీటిపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘పురాతన మెట్ల బావుల విషయంలో తీసుకుంటున్న చర్యలేంటి’అన్నది ఆ లేఖ సారాంశం. నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరాన్ని ఉటంకిస్తూ పీఎంవో రాష్ట్రానికి లేఖ రాయడంతో ప్రభుత్వం తొలిసారి ఈ చారిత్రక మెట్లబావులపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బావులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చబోతోంది. ఓ ఆర్కిటెక్ట్ చొరవతో.. రాష్ట్రంలో మెట్లబావుల లెక్కతీసి వాటి వివరాలను జనం ముందుంచేందుకు 15 మంది ఆర్కిటెక్టులు ఓ బృందంగా పనిచేస్తున్నారు. ‘ది హైదరాబాద్ డిజైన్ ఫోరం’అధ్యక్షుడు యశ్వంత్ రామమూర్తి ఆధ్వర్యంలో ఈ బృందం పనిచేస్తోంది. ఓ పనిపై యశ్వంత్ రామమూర్తి ఆందోల్ సమీపంలోని కిచ్చనపల్లికి వెళ్లగా అక్కడి మెట్ల బావి చూసి అబ్బురపడ్డారు. తర్వాత వరంగల్ శివారులో కూడా ఇలాంటి బావి చూసి ఆలోచనలో పడ్డారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి బావులు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు మరికొందరు ఔత్సాహిక ఆర్కిటెక్టులు జత కలిశారు. అలా 15 మంది బృందంగా ఏర్పడి మొదట్లో జేఎన్టీయూ విద్యార్థుల సాయంతో సర్వే మొదలుపెట్టారు. ఇప్పుడు వారే సొంతంగా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 70 బావులను స్వయంగా చూసి డాక్యుమెంటేషన్ చేశారు. మరో 30 బావులున్నట్టు గుర్తించి వాటి అన్వేషణలో ఉన్నారు. వీటిల్లో ప్రధానమైన 30 బావుల్ని ఎంపిక చేసి కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా అవి ఏ కాలానికి చెందినవో శాస్త్రీయ పద్ధతిలో రూఢీ చేయబోతున్నారు. ఈ మొత్తం వివరాలతో ఓ పుస్తకం రూపొందించి ప్రజల ముందుంచాలన్నది ఈ బృందం ప్రయత్నం. గుజరాత్, రాజస్తాన్‌లలోనే కాదు.. తెలంగాణలోనూ గొప్ప మెట్ల బావులున్నాయని తేల్చబోతున్నారు. పురావస్తు శాఖ కూడా వీరికి సహకరిస్తోంది. సామాన్యుడి లేఖతో.. నిధులు, సిబ్బంది లేక కునారిల్లుతున్న పురావస్తు శాఖ.. తాను గుర్తించిన రక్షిత కట్టడాలను కూడా పరిరక్షించే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటంతో ఆ శాఖ ఇప్పటికే చాలా విషయాల్లో చేతులెత్తేసింది. ఆర్కిటెక్ట్‌ల బృందం చేస్తున్న సర్వే గురించి తెలుసుకున్న ఎన్.సాయికుమార్ అనే సామాజిక కార్యకర్త ఇటీవల నేరుగా ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.‘తెలంగాణలో వంద వరకు పురాతన మెట్లబావులున్నట్టు తెలుస్తోంది. నిర్వహణ లేక కనుమరుగవుతున్నాయి. వాటిని సంరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి’అని అందులో కోరారు. దాన్ని పరిశీలించిన ప్రధాని కార్యాలయం.. ఆ బావుల సంరక్షణ, కార్యాచరణ వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం వెంటనే పురావస్తు శాఖను ఆదేశించటంతో ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికీ ఉపయోగమే.. ఈ బావులన్నీ ఊట ఆధారంగా నిర్మితమైనవే. వాటిని పునరుద్ధరిస్తే జల సంపదకు కేంద్రాలుగా మారతాయి. వరంగల్ శివారులోని పెద్ద మెట్లబావిని ఇటీవల బాగుచేసేందుకు నీటిని తోడటం పెద్ద సమస్యగా మారింది. తోడిన కొద్దీ ఊటతో నిండిపోయింది. ఊటలను పునరుద్ధరిస్తే ఇవి ఆ ప్రాంతంలోని వారికి తాగునీటిని సరఫరా చేయగలుగుతాయని నిపుణులంటున్నారు. ఒక్కోటి ఓ అద్భుతం గొప్ప ఇంజనీరింగ్ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఆ బావులు చూస్తే అబ్బురమనిపిస్తుంది. వందల ఏళ్ల క్రితం నిర్మించినా కొన్ని ఇప్పటికీ గొప్పగానే నిలిచి ఉన్నాయి. కొన్ని కబ్జా అయి రూపుకోల్పోయాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకు సహకారంగా ఉండేలా మేం డాక్యుమెంటేషన్ చేస్తున్నాం –రామమూర్తి ‘ది హైదరాబాద్ డిజైన్ ఫోరమ్’అధ్యక్షుడు -
స్మార్ట్‌సిటీల్లో ఆర్కిటెక్చర్లదే కీలకపాత్ర
– కేంద్రమంత్రి సుజన పిలుపు – దేశానికి ప్రపంచస్థాయి నగరాలు కావాలి – ఘనంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ స్నాతకోత్సవం పెనమలూరు: అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో స్మార్ట్ సిటీలు నిర్మించటానికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని కేంద్ర సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రి వై.సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం కానూరు అన్నే కల్యాణమండపంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ విద్యార్థుల 2వ స్నాత్సకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాలు, పట్టణాల రూపకల్పన జరిగి నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. స్మార్టు సిటీలతో మెరుగైన మౌలిక సదుసాయాలు, చెత్త నిర్వహణ, ఆరోగ్య భద్రత కల్పించవచ్చని అన్నారు. చెన్నై నగరం గత ఏడాది విపరీతమైన వర్షాల వల్ల మునిగిపోయిందని అన్నారు. భవిష్యత్తులో విపత్తులు ఎదురైనప్పుడు నగరాల్లో, పట్టణాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది రాకుండా నగరాలకు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. అర్బన్ గ్రోత్ సెంటర్లుగా ఆ నగరాలు అమరావతి గ్రీన్ ఫీల్డు రాజధాని నిర్మాణంలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించి సత్తాచాటాలని సుజన అన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హిందూపురంలను అర్బన్ గ్రోత్ సెంటర్లుగా అభివృద్ది చేయనున్నామన్నారు. నగరాల అభివృద్దిలో విద్యార్థులు భవిష్యత్తులో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. 138 మంది విద్యార్థులకు పట్టాలు స్నాత్సకోత్సవంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆండ్ ఆర్క్టెక్చర్లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పొందిన 138 మంది విద్యార్థులకు మంత్రి సుజనాచౌదరి పట్టాలు ప్రధానం చేశారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎన్ఎస్.గాయత్రీ,ఎం.మిచలీ, ఎస్.గణేష్, ఆశనా జైన్, గరీమాలకు బంగరు పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడెప్రసాద్, స్కూల్ డెరెక్టర్లు రాజీవ్‌మిశ్రా, డాక్టర్ రమేష్, రోహిత్‌జైన్ తదితరులు పాల్గొన్నారు. మిన్నంటిన సందోహం ఈ సందర్భంగా విద్యార్థుల సందడి మిన్నంటింది. తలపై ఉన్న టోపీలు గాలిలోకి ఎగురవేసి కేరింతలు కొట్టారు. ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు గ్రూప్ ఫోటోలు దిగారు.