శిఖరాలను అధిరోహించాలంటే పర్వతాల దగ్గరకే చేరుకోనక్కర్లేదు. ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడం కూడా అధిరోహణే. ప్రతి అధిరోహణలోనూ సవాళ్లు ఉంటాయి. సానుకూలంగా గమనిస్తూ అధిగమిస్తేనే దారి సుగమమం అవుతుంది. ఢిల్లీలో ఉంటున్న 30 ఏళ్ల భవ్నా ఖన్నా పురుషుల ప్రపంచమైన భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి ‘శభాష్’ అనిపించుకుంటోంది. తనే శిఖరమంతగా ఎదిగి మరికొందరికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
ఆర్కిటెక్చర్ రంగం దాదాపు పురుషులదే అయి ఉంటుంది. అలాంటి రంగంలో మూడు వేల రూపాయల నుంచి వర్క్ మొదలుపెట్టిన భవ్నా ఖన్నా నేడు మూడు కోట్ల ప్రాజెక్ట్‌లను కూడా అందిపుచ్చుకుంటోంది. ఢిల్లీవాసి అయిన భవ్నా పెద్ద పెద్ద భవనాలను, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్, రిసార్ట్స్‌నూ డిజైన్ చేస్తోంది. 30 ఏళ్ల భవ్నా భవన నిర్మాణ రంగంలో ఎదుగుతున్న తీరు, సమస్యలను అధిగమిస్తున్న విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం.
‘‘ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్తైన భవనాలను చూసి, ఎంతో ఇష్టపడేదాన్ని. కొన్నాళ్లకు నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న నా 13వ పుట్టిన రోజున బిల్డింగ్ గేమ్ కానుకగా ఇచ్చారు. ఆ గేమ్‌లో బ్లాకులను కలుపుతూ ఏదైనా భవనాన్ని కట్టచ్చు. ఆ ఆటలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. కట్టిన వాటిని పడేస్తూ, తిరిగి కడుతూ చాలా సమయం గడిపేసేదాన్ని. పన్నెండవ తరగతి తర్వాత, ఐదేళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ కోర్సు చేశాను. ఏడాది పాటు ఉద్యోగం చేశాను. తర్వాత ఉద్యోగంలో నాకోసం నేనేదీ చేయలేనని అర్థం చేసుకున్నాను. నా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాను. ఎవరి సూచనలతోనో పనిచేయలేకపోయాను. నాకు నా సొంత ఆలోచనలు ఉన్నాయి. భవనం లేదా ఫామ్ హౌజ్ లేదా కోట దేనిని నిర్మించాలన్నా ముందగా నా ఆలోచనలను కాగితంమీద పెట్టేదాన్ని.
ఒక్కో ఇటుక పేర్చుకుంటూ..
భవనాన్ని నిర్మించాలంటే ఒక్కో ఇటుకను పేర్చాలి. అలాగే, సిమెంట్, స్టీల్, స్టోన్.. ప్రతీ పనిలో నైపుణ్యం చూపాలి. అందుకు తగిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నా నైపుణ్యాలు నాకు అర్థమయిన తర్వాత నా ఉద్యోగం వదిలి, ఆపై నా పనిని ప్రారంభించాను. స్టూడియో ఆస్ట్రిడ్ ఇండియా పేరుతో కంపెనీని ప్రారంభించాను. ఈ రంగంలో నాకు గాడ్‌ఫాదర్ లేకపోవడంతో నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం సవాళ్లతో కూడుకున్నది. ప్రతీ పని స్వయంగా తెలుసుకుంటూ చేయాలి. ముందు ఎవ్వరూ టీమ్‌గా చేరలేదు. నెమ్మదిగా కలిశారు.
చిన్న పుస్తకాల షెల్ఫ్‌తో మొదలు..
కొన్ని రోజుల వరకు నా కంపెనీ పనిలో నేనున్నాను. 2016లో ఒకరోజు త్రీ బై త్రీ బుక్ షెల్ఫ్ చేసివ్వమని ఒక ఆర్డర్ వచ్చింది. మూడు వేల రూపాయలతో వచ్చిన చిన్న ప్రాజెక్ట్ అది. నా కలలు పెద్దవే. కానీ, మొదటి ప్రాజెక్ట్, అందుకే కష్టపడ్డాను. ఆ చిన్న బుక్ షెల్ఫ్ నుంచి ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు, రిసార్టులు డిజైన్ చేస్తున్నాను. 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎల్తైన భవనాలు, మెరిసే అద్దాల గోడలు నా కళ్లలో కలల ఇంటిని కట్టుకునేవి. చిన్నతనంలో నా అరచేతిలో రూపుదిద్దుకున్న చిట్టి చిట్టి భవనాలపైనే నాకు అంత ఆకర్షణ ఉందని అప్పట్లో తెలియదు. పెద్దయ్యాక ఆ కలే నన్ను ఆర్కిటెక్ట్‌గా ఎదిగేందుకు ప్రోత్సాహమిచ్చింది. క్లయింట్ అవసరాలు వినడం నుంచి అమలు చేయడం వరకు అన్ని పనులు స్వయంగా చూస్తుంటాను.
సవాళ్లను ఎదుర్కొంటేనే సరైన దారి
ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నాలో మార్పు స్పష్టంగా చూశాను. నామీద నాకు చాలా నమ్మకం వచ్చింది. అనుభవం పెరిగింది. ఎక్స్‌పోజర్ పెరిగింది. ఆరు సంవత్సరాలలో నైపుణ్యం కలిగిన క్రియేటివ్ డైరెక్టర్‌గా నన్ను నేను చూసుకుంటున్నాను. ఆడపిల్లలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు చేసే రోజులు పోయాయి అని నన్ను నేను చూసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించింది. నా స్నేహితుల జాబితాలో కూడా నలుగురిలో మాట్లాడటానికి సిగ్గుపడే అమ్మాయిలు ఇప్పుడు మంచి వక్తలుగా మారారు.
శిల్పకళ లేదా వ్యాపార రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు పదే పదే చెప్పే మాట ‘ప్రతి రంగానికి దానికి తగిన సవాళ్లు ఉంటాయి. వాటిని వదులుకోవద్దు. మార్గం ధైర్యంతోనే వేయబడుతుంది. మీరు వృద్ధిలోకి వస్తున్నప్పుడు మరికొన్ని మార్గాలను కనుక్కుంటారు’ అని వివరిస్తారు భవ్నా ఖన్నా.
ఈ ఆరేళ్లలో స్పార్క్ ఎక్సలెన్స్ అవార్డు, యువ పారిశ్రామికవేత్త బిరుదును అందుకున్న భవ్నాఖన్నా గురించి ప్రముఖ జాతీయ మ్యాగజైన్లు కవర్‌పేజీ కథనాలతో ఆమె ఘనతను చాటాయి. విజయం ఒక్కరోజులోనే అందకపోవచ్చు. ప్రతీరోజు ప్రయత్నంతోనే మొదలవ్వాలి. ప్రతీ ప్రయత్నం విజయంవైపుగా కృషి చేయాలి. సవాళ్లను స్థైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ ఆర్కిటెక్చర్ జీవనం ఎంతోమందికి ప్రేరణనిస్తోంది.
అధిరోహణ: బుక్ షెల్ఫ్ నుంచి భవనం దాకా!
Published Sun, Mar 13 2022 12:35 AM | Last Updated on Sun, Mar 13 2022 12:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment