నగర అభివృద్ధిలో కేంద్ర పథకాల సమ్మిళితం
పీపీపీ పద్ధతి ద్వారా పెట్టుబడుల సేకరణ
రాష్ట్ర ప్రభుత్వానికీ భాగస్వామ్యం
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ
హన్మకొండ : స్మార్ట్‌సిటీ ద్వారా రాబోయే ఐదేళ్లలో వరంగల్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సేకరణకు సంబంధించి ప్రాథమిక అంచనాలను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు రూపొందిం చారు. మొత్తంగా రూ.3025 కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ నివేదికను కేంద్రానికి పంపడం ద్వారా స్మార్ట్‌సిటీ పథకం రెండో అంచెలో పోటీ పడేందుకు గ్రేటర్ వరంగల్ రంగం సిద్ధం చేసుకున్నట్లరుుంది.
ఎస్‌పీవీ ఆధ్వర్యంలో
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ పథకంలో వరంగల్ నగరం ఎంపికైంది. అంతకుముందే అమృత్, హృదయ్ పథకాలకు సైతం అర్హత సాధించింది. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో నేరుగా రూ.500 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులకు తోడు వివిధ మార్గాల ద్వారా మరిన్ని నిధులను జత చేసి నగరంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహరాలన్నీ నిర్వర్తించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేసే ఎస్‌పీవీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పోరేషన్ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టు/పథకాలకు సంబంధించిన ప్రణాళిక, అనుమతులు, నిధులు, రుణసేకరణ, నిధులను ఖర్చుచేయడం తదితర వ్యవహారాలను ఎస్‌పీవీ చేపడుతుంది.
రూ. 3025 కోట్లతో..
వరంగల్ స్మార్ట్‌సిటీ ప్రణాళికకు సంబంధించి ఎస్‌పీవీ ద్వారా రూ.2022 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఇందులో స్మార్ట్‌సిటీ పథకం నుంచి రూ.500 కోట్లు, అమృత్ పథకం నుంచి రూ.41 కోట్లు, హృదయ్ నుంచి రూ.39 కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.104 కోట్లు, రహదారులు, భవనాల శాఖ నుంచి రూ.774 కోట్లు, రైల్వేశాఖ నుంచి రూ.47 కోట్లు ప్రధానంగా సేకరిస్తారు. మిగిలిన నిధులను పధ్నాలుగో ప్రణాళిక సంఘం నిధులతో పాటు, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సేకరిస్తారు. ఇవి కాకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో రూ.1003 కోట్లు సేకరిస్తారు. ఇలా ఎస్‌పీవీ, పీపీపీ పద్దతిలో సమకూరిన రూ.3025 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. స్మార్ట్‌సిటీ ద్వారా చేపట్టబోయే పనుల్లో రూ.1772 కోట్లను రెట్రో ఫిట్టింగ్(పూర్తిగా కొత్త ప్రాజెక్టు) పనులకు కేటాయిస్తారు. మిగిలిన రూ. 1253 కోట్లను ప్రస్తుతం నగరంలో ఉన్న వనరులు మరింత మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక ఆదాయ వనరులకు సంబంధించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామని కేంద్రానికి పంపిన నివేదికలో గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు.
స్మార్ట్ ప్రణాళిక రూ. 3025 కోట్లు
Published Tue, Dec 1 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM
Advertisement