Smart City scheme
-
కోటకు ‘స్మార్ట్'లుక్
వరంగల్ అర్బన్: స్మార్ట్‌సిటీ నిధులతో చారిత్రక ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ కమిషనర్ వీపీ.గౌతమ్ ఆదేశించారు. రెండో రోజు గురువారం మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్మార్ట్ రోడ్లు తదితర అభివృద్ధి పనులపై వారు బస్సు యాత్ర నిర్వహించారు. కాజీపేట ఫాతిమానగర్‌లో ప్రారంభమైన ఏసీ బస్సు యాత్ర అర్బన్ కలెక్టరేట్ వరకు సాగింది. గ్రేటర్ ఇన్చార్జి ఎస్ఈ లింగమూర్తి, ఈఈలు భిక్షపతి, విద్యాసాగర్, ఇన్చార్జి సీపీ శ్యాంకుమార్, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల శాఖ అధికారులు, లీ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ –3 ఫేజ్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్, కమిషనర్ సూచనలు.. ♦ ఫాతిమానగర్ కేయూ క్రాస్‌రోడ్డు నుంచి ములుగు రోడ్డు వరకు డివైడర్, సుందరీకరణ, ఎలిమెంట్స్ పనులు చేయాలని ఆదేశించారు. ♦ ఖిలా వరంగల్ కోటను పూర్తిస్థాయిలో టూరిజం స్పాట్‌గా మార్చుతున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాలు, కోట చుట్టూ రోడ్డు నుంచి ఖుష్‌మహల్ వరకు స్మార్ట్ లుక్ కోసం అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని లీ అసోసియేట్స్ ప్రతినిధులకు సూచించారు. ♦ ఖమ్మం రోడ్డులోని శివనగర్ వాటర్ ట్యాంకు నుంచి వరంగల్ రైల్వే స్టేషన్‌లోని 3 ప్లాట్ఫారం వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. ♦ ఖమ్మం రోడ్డులోని మామూనూరు మీదుగా ఐనవోలు క్రాస్‌రోడ్డు వరకు రెండు వైపులా వెడల్పు, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు ప్రతిపాదనలు. ♦ రంగశాయిపేట చౌరస్తా నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు వరకు బై సైకిల్, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్‌కు మార్కింగ్, ఖమ్మం బైపాస్ రోడ్డు (ఇసుక అడ్డా)ను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. -
స్మార్ట్ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశామంది. -
స్మార్ట్ ప్రణాళిక రూ. 3025 కోట్లు
నగర అభివృద్ధిలో కేంద్ర పథకాల సమ్మిళితం పీపీపీ పద్ధతి ద్వారా పెట్టుబడుల సేకరణ రాష్ట్ర ప్రభుత్వానికీ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ హన్మకొండ : స్మార్ట్‌సిటీ ద్వారా రాబోయే ఐదేళ్లలో వరంగల్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సేకరణకు సంబంధించి ప్రాథమిక అంచనాలను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు రూపొందిం చారు. మొత్తంగా రూ.3025 కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ నివేదికను కేంద్రానికి పంపడం ద్వారా స్మార్ట్‌సిటీ పథకం రెండో అంచెలో పోటీ పడేందుకు గ్రేటర్ వరంగల్ రంగం సిద్ధం చేసుకున్నట్లరుుంది. ఎస్పీవీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ పథకంలో వరంగల్ నగరం ఎంపికైంది. అంతకుముందే అమృత్, హృదయ్ పథకాలకు సైతం అర్హత సాధించింది. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో నేరుగా రూ.500 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులకు తోడు వివిధ మార్గాల ద్వారా మరిన్ని నిధులను జత చేసి నగరంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహరాలన్నీ నిర్వర్తించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేసే ఎస్పీవీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పోరేషన్ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టు/పథకాలకు సంబంధించిన ప్రణాళిక, అనుమతులు, నిధులు, రుణసేకరణ, నిధులను ఖర్చుచేయడం తదితర వ్యవహారాలను ఎస్పీవీ చేపడుతుంది. రూ. 3025 కోట్లతో.. వరంగల్ స్మార్ట్‌సిటీ ప్రణాళికకు సంబంధించి ఎస్పీవీ ద్వారా రూ.2022 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఇందులో స్మార్ట్‌సిటీ పథకం నుంచి రూ.500 కోట్లు, అమృత్ పథకం నుంచి రూ.41 కోట్లు, హృదయ్ నుంచి రూ.39 కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.104 కోట్లు, రహదారులు, భవనాల శాఖ నుంచి రూ.774 కోట్లు, రైల్వేశాఖ నుంచి రూ.47 కోట్లు ప్రధానంగా సేకరిస్తారు. మిగిలిన నిధులను పధ్నాలుగో ప్రణాళిక సంఘం నిధులతో పాటు, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సేకరిస్తారు. ఇవి కాకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో రూ.1003 కోట్లు సేకరిస్తారు. ఇలా ఎస్పీవీ, పీపీపీ పద్దతిలో సమకూరిన రూ.3025 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. స్మార్ట్‌సిటీ ద్వారా చేపట్టబోయే పనుల్లో రూ.1772 కోట్లను రెట్రో ఫిట్టింగ్(పూర్తిగా కొత్త ప్రాజెక్టు) పనులకు కేటాయిస్తారు. మిగిలిన రూ. 1253 కోట్లను ప్రస్తుతం నగరంలో ఉన్న వనరులు మరింత మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక ఆదాయ వనరులకు సంబంధించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామని కేంద్రానికి పంపిన నివేదికలో గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు. -
స్మార్ట్ సిటీల్లో యూజర్ చార్జీలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల పథకానికి ఆర్థిక వనరుల కోసం ఆ సిటీల్లో యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఈ దిశగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని జీవన విధానాన్ని మెరుగుపర్చడం కోసం వీటిని సిద్ధం చేస్తున్న ఆ శాఖ అధికారులు వెల్లడించారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపికైన నగరంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయడానికి నిర్వహణ ఖర్చుల కింద యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (ఏఎంఆర్టీయూ) పథకం కింద వసతులు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై అనేక వర్క్‌షాపులు నిర్వహించింది. ఈ నగరాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు నీటి సరఫరా ఆధారిత టారిఫ్‌లతో మోడల్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు సమాచారం. మోడల్ డాక్యుమెంట్లో పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్లకు భాగస్వామ్యం కల్పిస్తారు. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలందిస్తామన్నారు. మంచి సౌకర్యాలున్నప్పుడే ప్రజలు అభివృద్ధికి సహకరిస్తారని వివరించారు.