స్మార్ట్ సిటీల్లో యూజర్ చార్జీలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల పథకానికి ఆర్థిక వనరుల కోసం ఆ సిటీల్లో యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఈ దిశగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని జీవన విధానాన్ని మెరుగుపర్చడం కోసం వీటిని సిద్ధం చేస్తున్న ఆ శాఖ అధికారులు వెల్లడించారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపికైన నగరంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయడానికి నిర్వహణ ఖర్చుల కింద యూజర్ చార్జీలు వసూలు చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ (ఏఎంఆర్‌టీయూ) పథకం కింద వసతులు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై అనేక వర్క్‌షాపులు నిర్వహించింది. ఈ నగరాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు నీటి సరఫరా ఆధారిత టారిఫ్‌లతో మోడల్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు సమాచారం. మోడల్ డాక్యుమెంట్‌లో పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్లకు భాగస్వామ్యం కల్పిస్తారు.
మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలందిస్తామన్నారు. మంచి సౌకర్యాలున్నప్పుడే ప్రజలు అభివృద్ధికి సహకరిస్తారని వివరించారు.