గ్రామీణ రహదారులపైనా యూజర్ ఛార్జీలు
నిర్వహణ వ్యయం ప్రజల నుంచే వసూలు
ప్రైవేటు ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం అమలు
శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు
ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై యూజర్ చార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశిత యూజర్ చార్జీలు వసూలు చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ రోడ్డు మీదకు వాహనంతో వచి్చనా యూజర్ చార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ దగ్గర డబ్బులు లేవుగానీ.. ఇలాంటి వినూత్న ఆలోచనలు మాత్రం చాలా ఉన్నాయని, వాటి ద్వారా సంపద సృష్టిస్తానని పేర్కొన్నారు.
మంత్ర దండాలేం లేవు.. ప్రజలను ఒప్పించండి
వచ్చే జనవరి కల్లా రాష్ట్రంలోని రహదారులపై అన్ని గుంతలు పూడ్చేయాలని, జనవరిలో పండుగ సందర్భంగా రాష్ట్రానికి వచ్చే వారికి మెరుగైన రహదారులు కనిపించాలనే లక్ష్యంతో మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. లక్షల సంఖ్యలో గుంతలు పడ్డాయని, అయితే వాటిని పూడ్చేందుకు అయ్యే ఖర్చు మొత్తం స్థానిక ప్రజల నుంచే వసూలు చేయాలనుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తొలుత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రోడ్ల నిర్వహణను జాతీయ రహదారుల మాదిరిగా టెండర్ పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు.
ఆ విధానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను ఒప్పించగలిగితే వెంటనే పనులు ప్రారంభిస్తామని, అలా కాకుండా గుంతల రోడ్డులోనే తిరుగుదామంటే నాకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘గోతులు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా అన్నీ నువ్వే చేయాలంటారు. నా దగ్గర మంత్ర దండాలేవీ లేవు’ అని సీఎం పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్ వసూలును కూడా తొలుత వ్యతిరేకించారని, ఇప్పుడు కూడా వ్యతిరేకత వస్తుందని, అయినా ముందుకే వెళతామని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై చేతులు ఎత్తి సమ్మతి తెలియచేయాలని సీఎంకోరడంతో కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. తమ జిల్లాల్లో వెంటనే దీన్ని అమలు చేయాలని వారంతా కోరారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మలేషియా ఉపరితల రవాణా మంత్రి స్వామివేలును రప్పించి చెన్నై నుంచి నెల్లూరు వరకూ డబ్బులివ్వకుండా మలేషియా కంపెనీతో కలిసి రోడ్డు వేశామని చంద్రబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment