చంద్రబాబుది రాజ్యాంగ ద్రోహం | Chandrababu constitutional betrayal: Andhra pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది రాజ్యాంగ ద్రోహం

Published Mon, Mar 3 2025 10:13 AM | Last Updated on Mon, Mar 3 2025 10:13 AM

Chandrababu constitutional betrayal: Andhra pradesh

సీఎంగా పదవీ ప్రమాణం యథేచ్ఛగా ఉల్లంఘన

వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనులు చేయకూడదంటూ బరితెగింపు వ్యాఖ్యలు 

ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విస్మయం 

న్యాయస్థానాలు ఆయన్ను ప్రశ్నించాలని సర్వత్రా ఏకాభిప్రాయం 

గతంలో రాజ్యాంగ ధర్మాన్ని పాటించిన వైఎస్‌ జగన్‌ తీరును గుర్తుచేస్తున్న నిపుణులు

సాక్షి, అమరావతి: సీఎం హోదాలో చంద్రబాబు రాజ్యాంగ ద్రోహానికి స్వయంగా పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన రాజ్యాంగబద్ధ పదవీ స్వీకార ప్రమాణాన్ని ఉల్లంఘించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవజు్ఞడినని పదేపదే  చెప్పుకునే ఆయన రాజ్యాంగం అంటే తనకు లెక్కలేదన్న రీతిలో బరితెగించారు.

వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చెయ్యొద్దని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆదేశించడంపై రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో పదవీ స్వీకార ప్రమాణం పవిత్రత, నిబద్ధత  గురించిస్పష్టంగా వివరించారు. అసలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన చేసిన పదవీ స్వీకార ప్రమాణం అర్థం తెలుసా అని ప్రశ్నిస్తున్నారు.  

ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాయడమే.. 
రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రయోజనం కలిగించడం ప్రభుత్వ ధర్మమని రాజ్యాంగం విస్పష్టంగా ప్రకటిస్తోంది. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, రాజకీయ, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా ప్రజలకు అన్ని హక్కులను రాజ్యాంగం కల్పించింది. ఆ విషయాన్ని రాజ్యాంగంలోని నిబంధనలు 14, 21లలో పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకునే పాలకులు ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలి.

అంతేగానీ.. రాజకీయ కారణాలతో ఎవరికైనా సరే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందకుండా చేయడమంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే. ఇలా పాల్పడే వారిపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలను సవాల్‌ చేస్తే న్యాయస్థానాలు ఇలా స్పందించే అవకాశముందని వారు చెబుతున్నారు. అదెలాగంటే.. 

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌–123 ప్రకారం అది అవినీతి కార్యకలాపాలకు కిందకు వస్తుంది. అందుకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని న్యాయస్థానాలు పిలిచి వివరణ కోరవచ్చు. 

రాజ్యాంగంలోని ఆర్టీకల్‌–226 ప్రకారం.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు మాండమస్, కో–వారెంట్‌ వంటి రిట్లు జారీ చేయవచ్చు. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ఆదేశించవచ్చు. 

 రాజ్యాంగంలోని ఆర్టీకల్‌–32 ప్రకారం.. ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు రిట్‌ జారీచేయవచ్చు.

రాజ్యాంగ ధర్మాన్ని పాటించిన జగన్‌.. 
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ తన రాజ్యాంగబద్ధ ధర్మాన్ని త్రికరణ శుద్ధితో పాటించారు. ‘కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. చివరికి పార్టీలు కూడా చూడం.. మీరు ఎవరికి ఓటేశారో అన్నది మాకు సంబంధంలేదు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం కల్పిస్తాం’.. అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.

తన ఐదేళ్ల పదవీ కాలంలో అదే విధానాన్ని చిత్తశుద్ధితో అమలుచేశారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారికి ప్రభుత్వ పథకాలు ఎందుకివ్వాలని కొందరు ప్రశ్నిస్తే ఆయన వారిపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలను ఓటర్లుగా చూడదని తేల్చిచెప్పారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ మేలు చేయాలన్నదే తమ విధానమని ఆయన తేలి్చచెప్పారు. అలాగే, ఐదేళ్లపాటు అదే విధానాన్ని చిత్తశుద్ధిగా అమలుచేసిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.  

చంద్రబాబు చేసిన పదవీ స్వీకరణ ప్రమాణం ఏమిటంటే.. 
‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’.. అని చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆయనతో ఆ విధంగా పదవీ స్వీకార ప్రమాణాన్ని గవర్నర్‌ చేయించిన తరువాతే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడుపల్లిలో శనివారం చంద్రబాబు ఏమన్నారంటే.. 
‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పనులు చేయకూడదు’.. అని ఆదేశించారు. అంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి పూర్తి విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. సీఎంగా రాజ్యాంగబద్ధమైన తన బాధ్యతలను ఉల్లంఘించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement