
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ స్థాయి బీచ్‌గా గుర్తింపు
చక్కటి నిర్వహణతో 2020 నుంచి నాలుగు దఫాలుగా రెన్యువల్
తొమ్మిది నెలలుగా బీచ్ నిర్వహణ నిధులు మింగేసిన నేతలు, అధికారులు
వెరసి బీచ్ ప్రాంతం అంతా అధ్వాన్నంగా మారిన వైనం
ప్రపంచ స్థాయి గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన డెన్మార్క్ సంస్థ
సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బీచ్(Rushikonda Beach).. ప్రపంచ బీచ్‌గా మారిందన్న ఆనందం ఆవిరైపోయింది. చంద్రబాబు సర్కారు(Chandrababu govt) నిర్లక్ష్యం కారణంగా ఏపీలో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్(Blue Flag) బీచ్ గుర్తింపు రద్దయింది. గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడింది. ప్రపంచ పర్యాటకులతో కళకళలాడింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాకుండానే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ జెండా పీకేయాల్సి వచ్చింది.
బ్లూ ఫ్లాగ్‌కు అవసరమైన సౌకర్యాల్ని కొనసాగించడంలో విఫలమైనందున ఆ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు డెన్మార్క్ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) ప్రకటించింది. పర్యావరణ హిత, ప్రమాద రహిత బీచ్‌లకు అందించే బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్‌ను ఈ బీచ్ 2020 అక్టోబర్ 11న దక్కించుకుంది. మూడు దశాబ్దాల తర్వాత 2019–20లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 13 బీచ్‌లు ఈ సర్టీఫికేషన్ కోసం పోటీ పడితే ఎనిమిది బీచ్‌లకు బ్లూ ఫాగ్ దక్కింది. ఇందులో రుషికొండ బీచ్ ఒకటి.
అప్పట్లో ఏం చేశారంటే..?
బ్లూ ఫ్లాగ్ కోసం రుషికొండ బీచ్ అభివృద్ధికి రూ.7.35 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటితో వివిధ పనులు చేపట్టారు. ఈ సర్టిఫికెట్ కోసం నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందుకనుగుణంగా రుషికొండను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యత, భద్రత, బీచ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ మొదలైన అంశాల్లో రుషికొండ బీచ్‌ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. బీచ్‌లో 600 చదరపు మీటర్ల మేర బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా అభివృద్ధి చేశారు.

ఈ పరిధిలో ఎక్కడా మలినాలు, వ్యర్థాలు కనిపించకుండా చర్యలు తీసుకున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీచ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వాచ్ టవర్లు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లు, మంచినీటి ప్లాంట్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్.. ఇలా ప్రతీది వెదురు సామగ్రితో నిర్మించింది. బీచ్ నిర్వహణకు అవసరమైన కరెంట్ కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. 40 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి 35 కేవీ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. బీచ్‌లో ఏర్పాటు చేసిన 70 ఎల్‌ఈడీ విద్యుత్ బల్బులకు సోలార్ పవర్‌నే వాడేలా తీర్చిదిద్దారు.

నాలుగేళ్ల పాటు కంటికి రెప్పలా..
ప్రతి సంవత్సరం జ్యూరీ పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని రెన్యువల్ చేస్తారు. 2021, 22లో ఏపీటీడీసీ బీచ్ నిర్వహణ పనులు చేపట్టింది. పలు లోపాలు తలెత్తడంతో.. 2023 నుంచి ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి బీచ్ మరింత సుందరంగా మారింది. ఏటా జ్యూరీ బృందం బీచ్‌కి వచ్చి.. ప్రతి అంశాన్ని పరిశీలించి.. నివేదిక సిద్ధం చేసేది. 33 అంశాల్లో ఏ ఒక్కటి తేడా ఉన్నా, సర్టిఫికేషన్‌ను రెన్యువల్ చేయరు. అలా ప్రతి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో నాలుగేళ్ల పాటు బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. బ్లూఫ్లాగ్ బీచ్ కాస్తా బ్లూ ఫ్రాడ్‌గా మారిపోయింది.
ఏపీటీడీసీ అధికారులు, కూటమి నేతలు కలిసి.. ప్రైవేట్ సంస్థతో కుమ్మక్కై నిర్వహణ కోసం కేటాయించిన సొమ్మును అందిన కాడికి దోచుకున్నారు. దీంతో బీచ్ కళావిహీనంగా మారిపోయింది. కనీస వసతులు కరువయ్యాయి. ఇటీవల పరిశీలనకు వచ్చిన ఎఫ్‌ఈఈ జ్యూరీ బీచ్ పరిస్థితుల్ని చూసి అవాక్కయింది. దీంతో.. బీచ్ గుర్తింపును ఫిబ్రవరి 13న రద్దు చేస్తున్నట్లు ఏపీటీడీసీకి సమాచారం ఇచ్చారు. కొద్ది నెలల సమయంలో మరోసారి పరిశీలనకు వస్తామని.. ఆలోపు పరిస్థితులు మారకుంటే శాశ్వతంగా గుర్తింపు రద్దు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment