rural roads
-
గ్రామీణ రోడ్లకు మహర్దశ తేవాలి
సాక్షి, హైదరాబాద్/ ఏజీ వర్సిటీ: ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ రోడ్లకు మహర్దశ తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, రాష్ట్రంలో 67వేల కి.మీ. మేర ఉన్న పీఆర్ రోడ్ల అభివృద్ధిలో ఇంజనీరింగ్ అధికారులు భాగస్వాములు కావాలన్నారు. టీఎస్ఐఆర్డీ పీఆర్ కార్యనిర్వాహక, పర్యవేక్షక ఇంజనీర్లకు రోడ్ల అభివృద్ధి, నిర్వహణపై శనివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఇందుకోసం రూ.3 వేల కోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరో రూ.3 వేల కోట్లతో అవసరాన్ని బట్టి ప్రాధాన్యత గల కొత్త రోడ్లను గుర్తించి వచ్చే ఏడాదికీ ప్రతిపాదనలు ఇప్పటినుంచే సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖ రీ ఆర్గనైజేషన్ కోసం అనుభవజ్ఞుల సూచనలు, సలహాలతో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల విషయంలో సమస్యలు గుర్తించి ఈఎన్సీ దృష్టికి తేవాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బీటీ రోడ్ల ఏర్పాటు కోసం ఇతర దేశాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. బీటీ రోడ్లకు మెటీరియల్‌ను వైజాగ్ నుంచి రప్పించడంతో రవాణా ఖర్చు పెరుగుతున్నందున రాష్ట్రంలో స్టాక్ యార్డ్ ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. పీఆర్, ఆర్డీ శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఈనెల 22లోగా ప్రతిపాదనలు సమర్పించాలని, వెంటనే పాలనాపరమైన అనుమతి మంజూరు చేస్తామని చెప్పారు. టెండర్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేసి డిసెంబర్ 10 వరకు పనులు గ్రౌండ్ కావాలని ఇంజనీర్లకు సూచించారు. పెండింగ్ ఉపాధి వేతనాలు విడుదల చేయండి రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న ఉపాధిహామీ కూలీల వేతనాలు రూ.110.35 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తిచేశారు. ఈమేరకు శనివారం ఆయన లేఖ రాశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీ పనులు చేసిన వారికి వేతనాలు విడుదల కాలేదని తెలిపారు. రెండు నెలలుగా 1.25 లక్షల మంది ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎర్రబెల్లి వివరించారు. -
గ్రామీణ రోడ్లకు రూ.200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 200 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 120 కోట్లకు రాష్ట్ర వాటాగా రూ. 80 కోట్లను కలిపి మొత్తం రూ. 200 కోట్లు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను ప్రత్యేకంగా వినియోగిస్తారు. -
అతుకులు.. గతుకులు
జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏ రోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి రోడ్డు చరిత్ర సమస్తం అతుకు గతుకుల మయం అన్న చందంగా తయారైంది పరిస్థితి. పల్లెసీమలు ప్రగతికి పట్టుగొమ్మలు అంటూ ఊదరగొట్టే పాలకులు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. అధికారులు పంపిన ప్రతిపాదనలు సైతం చెత్తబుట్టల్లో చేరిపోతున్నాయి. వెరసి ఈ రహదారుల్లో ప్రజలకు ‘నడక’యాతన తప్పడం లేదు. - అస్తవ్యస్తంగా గ్రామీణ రహదారులు - ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్‌లకు తక్కువగా నిధులు - ప్రతిపాదనలకే పరిమితమైన సోములవారిపల్లె కాజ్వే - సోమశిలకు బ్యాక్ వాటర్ వస్తే 20 గ్రామాలకు ఇబ్బందులు - నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య పూర్తికాని రహదారి - అటకెక్కిన నంద్యాల - పలమనేరు నాలుగులేన్ల రహదారి సాక్షి కడప: పల్లె సీమలు ప్రగతిబాట పట్టాలంటే ప్రధానంగా రహదారులే కీలకం. గ్రామాలకు రోడ్డు మార్గం ఉంటే ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు.. ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరేందుకు మార్గం సుగమమవుతుంది. స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్లు దాటుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. ప్రత్యేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్‌అండ్‌బీకి నిధుల వరద కురిసింది. అప్పట్లో ప్రతి పల్లెకూ తారు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో తారు రోడ్ల మరమ్మతులకు కూడా టీడీపీ సర్కార్ నిధులు విదల్చడం లేదని పలువురు వాపోతున్నారు. అనేక చోట్ల ఇప్పటికీ అతుకు గతుకుల రోడ్లల్లో ప్రయాణం సాగించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుమునుపే రోడ్డు పనులు పూర్తి చేసినా బిల్లులు రాక అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు కూడా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు బిల్లులను ప్రభుత్వానికి నివేదిస్తున్నా పూర్తి స్థాయిలో రావడం లేదు. పైగా జిల్లాలో అనేక చోట్ల రోడ్లు, కాజ్‌వేలకు ప్రతిపాదనలు పంపినా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. ప్రతిపాదనలకు పరిమితమైన సోములవారిపల్లె కాజ్వే ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె కాజ్వే కూలిపోయి చాలా రోజులు అవుతునా ఇప్పటి వరకు ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. పెన్నానదిపై సోములవారిపల్లె వద్ద కాజ్వే నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు దిక్కుదివానం లేదు. కాజ్వే లేకపోవడంతో వాహనదారులతోపాటు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రొద్దుటూరు పరిధిలోని మీనాపురం రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది. ఇక్కడి రోడ్డుపై ప్రయాణించడం కష్టం కావడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలే రోడ్డుపై ఉన్న గులకరాళ్లను ఎత్తివేసుకుని వెళ్తున్నారు. సోమశిలకు పూర్తి నీరు వస్తే 20 గ్రామాలకు ఇక్కట్లు అట్లూరు మండల పరిధిలోని సగిలేరు లో లెవెల్ వంతెనతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్ 72 టీఎంసీలు ఉన్నప్పుడు సగిలేరు ప్రాజెక్టులోకి నీరు వచ్చి లోలెవెల్ కాజ్‌వేపై ప్రవహిస్తున్నాయి. దాదాపు రెండు అడుగుల మేర నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. అట్లూరు మండలంలోని వేమలూరు, ముతుకూరు, కామసముద్రం, మాడపూరు, మన్నెంవారిపల్లి, కమలకూరు పంచాయతీలలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్‌వేపై నీరు ప్రవహిస్తున్న సమయంలో అట్లూరుకు రావాల్సి వస్తే ... ప్రజలు బద్వేలు మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో 32 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తేనే మండల కేంద్రానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కాజ్వే ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. సగంలోనే ఆగిపోయిన నందలూరు ఆర్ఎస్ రోడ్డు రాజంపేట పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పలు చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రత్యేకంగా సుండుపల్లి-పీలేరు మార్గంలో మెటల్ రోడ్డు అధ్వానంగా తయారైంది. అలాగే నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు పూర్తి చేయకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించి సగం వరకు మాత్రమే పూర్తి చేశారు. మిగతా సగం పూర్తి చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అటకెక్కిన నాలుగులేన్ల రహదారి దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నంద్యాల-పలమనేరు మధ్య నాలుగు లేన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.1100 కోట్ల వ్యయంతో టెండర్ల వరకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టు అటకెక్కింది. నంద్యాల నుంచి కోవెలకుంట్ల, జమ్మలమడుగు, పులివెందుల, కదిరి మీదుగా పలమనేరుకు కలిపి బెంగుళూరు జాతీయ రహదారికి కలిపేలా ప్రణాళిక రూపొందించారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్ విస్మరించింది. దానికి సంబంధించిన ఫైళ్లను పక్కన పడేశారు. తక్కువగా నిధులు జిల్లాలో పల్లె సీమల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి నిధులు సక్రమంగా రావడం లేదు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నిధులు విడుదల చేయడం లేదు. ఆర్‌అండ్‌బీతోపాటు పంచాయతీరాజ్‌కు కూడా నిధులు విడుదల కాకపోవడంతో పనులకు బ్రేక్ పడుతోంది. చాలా చోట్ల గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు కూడా బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులకు మోక్షం కల్పించేందుకు పాలకులు, అధికారులు తగినన్ని నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
నరకానికి నకళ్లు !
జిల్లాలో రహదారుల వ్యవస్థ దారుణంగా మారింది. రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో అంతర్భాగమైన రహదారుల వ్యవస్థను ప్రభుత్వం గాలికొదిలేసిన ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణం, నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో రహదారులు క్షీణదశకు చేరాయి. పలు నియోజకవర్గాలు, మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లేందుకు సరైన రహదారుల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కళ్లకు కడుతోంది. రాజధాని కేంద్ర బిందువైన తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలకు సరైన రహదారుల వ్యవస్థ లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. - గ్రామీణ రహదారుల వ్యవస్థ చిన్నాభిన్నం - రోడ్లు సరిగా లేక 40 గ్రామాలకు వెళ్లని ఆర్టీసీ బస్సులు - గుంతలమయంగా మారిన గుంటూరు - హైదరాబాద్, చెన్నైమార్గాలు - మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు నియోజకవర్గాల్లో సైతం దారుణం - నాణ్యతాలోపంతో తెనాలి డివిజన్లో భారీగా దెబ్బతిన్న రహదారులు గుంటూరు ఎడ్యుకేషన్ రహదారులు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) పరిధిలో జిల్లాలో 3,400 కిలో మీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో 656 కిలోమీటర్ల పరిధిలో రాష్ట్ర రహదారులు, 1,965 కిలోమీటర్ల మేర జిల్లా రహదారులు, 779 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు ఉన్నాయి. రహదారుల వ్యవస్థ లేక జిల్లాలోని 40 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు సైతం వెళ్లని పరిస్థితులు ఉన్నాయయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తట్టుకొనేందుకు చేపట్టిన రహదారుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు రెండు లేన్ల రాష్ట్ర రహదారిని నాలుగు లేన్లగా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఓ కొలిక్కి రాలేదు. గుం టూరు నగర పరిధిలో చుట్టుగుంట-పల్నాడు బస్టాండ్ మధ్య విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్, అటు చెన్నై వెళ్లే మార్గాలకు ఈ దారే కీలకం. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారి నిర్వహణ లోపంతో గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది. తారు రోడ్డు ఎరుగని గ్రామాలు ... - తారురోడ్డు సైతం ఎరుగని గ్రామాలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల వ్యవస్థ అధ్వానంగా మా రింది. ఎస్సీ కాలనీలకు దారితీసే రోడ్లు మట్టి, గ్రావెల్ వంటి తాత్కాలిక మెరుగులకే పరిమితమయ్యాయి. - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజవర్గంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లు అధ్వానంగా మారాయి. యడ్లపాడు -లింగారావుపాలెం, వంకాయలపాడు - కారుచోల రోడ్డు, తిమ్మాపురం-దింతెనపాడు, సందెపూడి-వేలూరు రోడ్లు అధ్వానంగా ఉన్నా యి. చిలకలూరిపేట మండలంలో కొమటినేని వారిపాలెం-కమ్మవారిపాలెం, మానుకొండవారిపాలెం-వేలూరు, నాదెండ్ల -గణపవరం, కనుపర్రు-సాతులూరు, సాతులూరు-నాదెండ్ల రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. - మాచర్ల నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులు అధ్వానంగా తయారై నిత్యం ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మార్జిన్లు సక్రమంగా లేకపోవటం, వర్షాలకు కోతకు గురికావటంతో ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే సాగర్ రహదారి గుంతల మయంగా మారింది. - పొన్నూరు నియోజకవర్గంలో వలసమాలప ల్లి, మన్నవ, రమణప్పపాలెం, దొప్పలపూడి, నండూరు,కసుకర్రు, మన్నవ,రమణప్పపాలెం, వల్లభరావుపాలెం, పెదపాలెం, ఉప్పరపాలెం గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. - తెనాలి డివిజన్లో ఆర్అండ్బీ రోడ్లు నిర్మా ణం, మరమ్మతుల్లో నాణ్యత లేమి కారణంగా భారీగా దెబ్బతిన్నాయి. నిర్మాణంలో ఉన్న రోడ్లు నత్తనడకన సాగుతున్నాయి. సిరిపురం-తెనాలి, దంతులూరు-మున్నంగి, తెనాలి-చెరుకుపల్లి రోడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి. -
‘ఎక్సెస్’ ఎత్తుగడ..!
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో గ్రామీణ రోడ్లను అద్దంలా తీర్చిదిద్దే పనులకు సర్కారు శ్రీకారం చుడితే.. ఈ పనుల్లో అందిన కాడికి దండుకునేందుకు కాంట్రాక్టర్లు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. భారీ మొత్తంలో మంజూరైన రోడ్ల మరమ్మతు నిధులపై కన్నేసిన గుత్తేదార్లు కొత్త ఎత్తుగడకు తెర లేపారు. ఇందుకోసం ఏకంగా ఓ అసోసియేషన్‌గా ఏర్పడి టెండర్ల ప్రక్రియలో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ టెండరు నిబంధనల ప్రకారం ఏదైనా రోడ్డు పనులకు మొదటిసారి(ఫస్ట్‌కాల్) టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అంచనా వ్యయం కంటే ఎక్సెస్‌కు టెండర్లు వేయడం కుదరదు. ఆయా పనులకు ఎవరూ టెండర్లు వేయని పక్షంలో రెండోసారి టెండర్లు పిలిస్తేనే ఎక్సెస్‌కు వేయడం సాధ్యమవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని అసోసియేషన్‌గా ఏర్పడిన కాంట్రాక్టర్లు మొదటి సారి ఎవ్వరు కూడా టెండర్లు వేయలేదు. రెండోసారి పిలిస్తే ఎక్సెస్‌కు ఈ పనులు దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో ఏదైనా పనులకు టెండర్లు పిలిస్తే పోటీపడి అంచనా వ్యయం కంటే తక్కువ(లెస్)కు టెండర్లు వేసే కాంట్రాక్టర్లు ఇప్పుడు అందినకాడికి దండుకునే యోచనలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 52 ప్యాకేజీలు.. రూ.252 కోట్లు.. జిల్లా వ్యాప్తంగా 2009 కంటే ముందు నిర్మించిన పంచాయతీరాజ్ బీటీ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,390 కిలోమీటర్ల పొడవున ఉన్న 390 పీఆర్ రహదారుల మరమ్మతులకు(బీటీ రెన్యూవల్) హైదరాబాద్‌లోని ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం గత నెల 24న టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. మండలానికి ఒక ప్యాకేజీ చొప్పున మొత్తం 52 ప్యాకేజీలుగా ఏర్పాటు చేసిటెండర్లు పిలిచారు. అసోసియేషన్‌గా ఏర్పడిన జిల్లాలోని గుత్తేదార్లు 50 ప్యాకేజీలకు అసలు టెండర్లు వేయలేదు. మిగిలిన ఈ రెండు ప్యాకేజీలకు కూడా హాట్ మిక్సింగ్ ప్లాంట్లకు దగ్గరలో ఉన్న రోడ్లు కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ చిన్న పనికి అయినా పోటీ పడి మరీ టెండర్లు దాఖలు చేసే కాంట్రాక్టర్లు ఇప్పుడు 50 మండలాల ప్యాకేజీలకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఈ శాఖ ఉన్నతాధికారులు రెండోసారి టెండర్లు పిలిచారు. దీన్ని ఆసరాగా చేసుకునే మిగిలిన 50 ప్యాకేజీలకు ఎక్సెస్‌కు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. పనులు అధికం.. కాంట్రాక్టర్లు పరిమితం.. రహదారుల నిర్మాణం పనులు చేసే బడా కాంట్రాక్టర్లు జిల్లాలో సుమారు 30 మంది వరకు ఉంటారు. ఈ పనులకు టెండర్లు వేయాలంటే ఆయా కాంట్రాక్టర్లు హాట్‌మిక్సింగ్ ప్లాంటు కలిగి ఉండడం తప్పనిసరి. ఈ ప్లాంట్లు ఉన్న కాంట్రాక్టర్లు జిల్లాలో పరిమితంగా ఉండడం, పనులేమో పెద్ద సంఖ్యలో ఉండడం కూడా ఈ కాంట్రాక్టర్ల పంట పండడానికి కారణమవుతోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఇతర జిల్లాల కాంట్రాక్టర్ల నుంచి పోటీ లేకుండా పోయింది. ఆయా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్డు పనులు మంజూరు కావడంతో సమీపంలో ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన బడా కాంట్రాక్టర్లకు ఆయా జిల్లాల్లోనే చేతినిండా పనులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈ పనులు చేసేందుకు ఇతర జిల్లాల కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఇది జిల్లాలో స్థానికంగా ఉన్న పరిమితి కాంట్రాక్టర్లకు కలిసొస్తోంది. -
రోడ్లు గుల్ల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్షాలు, వరదలకు జిల్లాలోని గ్రామీణ రహదారులు గుల్లయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం ఇటీవలి వానలు, వరదలతో 139 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 17 మండలాల్లో 107 రోడ్లు కోతకు గురయ్యాయని అధికారుల అంచనా. ఈ మేరకు రూపొందించిన నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపింది. మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరింది. గుండాలలో ఎక్కువ నష్టం వానలు, వరదలతో నష్టపోయిన రోడ్ల వివరాలను పరిశీలిస్తే ఎక్కువగా గుండాల మండలంలో 24.14 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వీఆర్‌పురంలో 18.40, అశ్వారావుపేటలో 16.50 కి.మీ రోడ్లు కొట్టుకుపోయాయి. వెంకటాపురంలో కూడా 11.40 కిలోమీటర్ల రోడ్డు కొట్టుకుపోయిందని, ఈ రోడ్లను శాశ్వతంగా మరమ్మతులు చేసేందుకు 2.75 కోట్ల నిధులు అవసరమని అధికారులు లెక్కలు కట్టారు. చర్లలో నష్టపోయిన 9.35 కిలోమీటర్ల రోడ్లకు దాదాపు మూడు కోట్లు అవసరమవుతాయని అంచనా. దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో రూ.కోటిన్నర చొప్పున, బూర్గంపాడులో రూ.1.10 కోట్లు, మొత్తంగా చూస్తే 139 కిలోమీటర్ల మేర పాడయిన ఈ రోడ్లను తాత్కాలికంగా బాగు చేయాలంటే రూ.2.5 కోట్లు, శాశ్వత ప్రాతిపదికనైతే రూ.16.50 కోట్లు అవసరం అవుతాయి. ఈ నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఒక రోడ్డు..11 కిలోమీటర్లు రోడ్ల వారీగా చూస్తే పదికిపైగా రహదారులు ఐదు కి.మీ కన్నా ఎక్కువగా పాడయ్యాయని అధికారుల నివేదిక. గుండాల మండలకేంద్రం నుంచి శెట్టిపల్లి 22 కి.మీ రోడ్డులో సగం అంటే 11 కిలోమీటర్లు దెబ్బతింది. ఇప్పుడు ఈ మార్గం ప్రయాణీకులకు నరకం చూపిస్తోంది. గుండాల మండలంలోనే మామకన్ను నుంచి అల్లపల్లి వెళ్లే రోడ్డు 3.5 కిలోమీటర్ల మేర దెబ్బతింది. కూనవరం మండలంలోని టేకులబోరు నుంచి చట్టి వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు ఐదు కిలోమీటర్లు దెబ్బతింది. వి.ఆర్‌పురం మండలంలోని ములకనపల్లి - వీరబాపని కుంట, రేఖపల్లి బీసీకాలనీ నుంచి చింతరేగుపల్లి, శ్రీరామగిరి నుంచి కల్తనూరులకు వెళ్లే రోడ్లు నాలుగు కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. వీఆర్‌పురం నుంచి శ్రీరామగిరి వెళ్లే నాలుగు కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. చర్ల మండలంలో తాలిపేరు బ్రిడ్జి నుంచి సి.కత్తిగూడెం వెళ్లే తొమ్మిది కిలోమీటర్లలో ఐదు కి.మీ రోడ్డు కొట్టుకుపోయింది. ఇలా 107 రోడ్లు వివిధ మండలాల్లో దెబ్బతిన్న నేపథ్యంలో వీటి మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. -
పల్లెల్లో ప్రగతి దారులు
ఏలూరు : జిల్లాలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి మూడేళ్ల అనంతరం మోక్షం కలగనుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన (పీఎంజీఎస్‌వై) కింద రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమం పట్టాలెక్కనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర రవాణా అవసరాలు పెరిగే అవకాశం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రోడ్ల పరిస్థితిని అంచనా వేసి పీఎంజీఎస్‌వై పథకం కింద ఆయూ రహదారులను అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా అవసరాలను అంచనా వేయడం ద్వారా వివిధ రహదారులకు మార్కులు వేస్తారు. ఆ మార్కుల ఆధారంగా సంబంధిత రహదారులను దశలవారీగా విస్తరించేందుకు పీఎంజీ ఎస్‌వై ఫేజ్-2 కింద పనులు చేయడానికి రంగం సిద్ధమైంది. 2014-15 సంవత్సరానికి గాను జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 16 పనులు చేపట్టాలని నిర్ణరుుంచారు. ఇందుకు రూ.60 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ నిధులు ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యూరుు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అంచనాలను పూర్తిస్థాయిలో రూపొందించలేదు. ఎన్నికలు ముగిసి పాలన గాడిన పడిన నేపథ్యంలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన అంచనాలను వడివడిగా పూర్తిచేసి టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. జూలై నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబర్ నుంచి పనులను ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే... పీఎంజీఎస్‌వై పథకం కింద అభివృద్ధి చేసిన రహదారుల నిర్వహణ బాధ్యతను ఐదేళ్లపాటు సంబంధిత కాంట్రాక్టరే చూడాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్ల పనుల్లో నాణ్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. ఈ పనులను త్వరితగతిన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.వేణుగోపాల్ తెలిపారు. -
నరకదారులు
సాక్షి, కడప : ‘రోడ్లకు ఇరువైపుల ఏపుగా దారి మూసుకునిపోయేలా పెరిగిన కంపచెట్లు.. మోకాటిలోతు గుంతలు, కంకర తేలిన రోడ్లు, ప్రమాదకర మలుపులు, మరమ్మత్తులకు నోచుకోని కల్వర్టులు, వర్షం పడితే బురదమయమై ప్రయాణం చేయడానికి వీలుకాని దారులు’...వెరసి జిల్లాలోని గ్రామీణ రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ రోడ్లలో ప్రయాణమంటే ప్రజలు హడలి పోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. వర్షం వచ్చినప్పుడు రోడ్లు బురదమయంగా మారి కొన్నిచోట్ల నరక కూపాలుగా తయారవుతున్నాయి. మొత్తం మీద జిల్లాలో పాలకులు, అధికారులు రోడ్ల గురించి పట్టించుకోక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం రోడ్ల నిర్వహణ కూడా చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. ప్రమాదటపుంచున ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు ద్విచక్ర వాహనాలలో కూడా వెళ్లేందుకు వీలు లేదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కడప నగరానికి కూతవేటు దూరంలోఉండే చింతకొమ్మదిన్నె మండలం రాజులవడ్డెపల్లె, రాజుల తాతయ్యగారిపల్లెతోపాటు బుగ్గవంకకు వెళ్లే రోడ్డు దుర్భరంగా ఉంది. గూడావాండ్లపల్లె, బీరంఖాన్పల్లె, నాగిరెడ్డిపల్లె, బుగ్గపల్లె, దళితవాడలకు చెందిన గ్రామాల రైతులు ఈ రోడ్డు మీదుగానే పొలాలకు వెళ్లాల్సి ఉంది. 2010లో రోడ్డుకు నామమాత్రంగా మరమ్మత్తులుచేసి వదిలేశారు. రోడ్డుపైన కంకర తేలి ఉండడంతోపాటు కంపచెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి. కడప నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీల పరిధిలోగల రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. కమలాపురంలో గ్రామ చావిడి నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు మోకాటిలోతు గుంతలతో కంకర తేలి ఉంటుంది. కంకర ఎగిరిపడి పాదచారులకు ఇబ్బందులను పెడుతోంది. మునకవారిపల్లె, విభవాపురం, వల్లూరు- ఆదినిమ్మాయపల్లె, ఖాజీపేట-కమలాపురం రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో రిక్షా కాలనీకి వెళ్లే దారే లేదు. అక్కడికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అట్లూరు-తంబళ్లగొందిరోడ్డు, రాచాయిపల్లె ఎస్సీ కాలనీ, కలసపాడు-బ్రాహ్మణపల్లె, తంగెడుపల్లె-బి.కోడూరు రోడ్లు కంకర తేలి తారురోడ్లు సైతం మట్టి రోడ్ల మాదిరి దర్శనమిస్తున్నాయి. దీనికితోడు పోరుమామిళ్ల-బద్వేలు రోడ్డు దుర్భరంగా ఉంది. రైల్వేకోడూరు-గంగెద్దుల మిట్టకు ప్రయాణించాలంటే రహదారే లేదు. యేటిలో నడిచి వెళ్లాల్సిందే. దీంతోపాటు రాజీవ్‌నగర్ గిరిజన కాలనీ, పెనగలూరు-దిగువ సిద్దవరం, పల్లంపాడు, పుల్లంపేట మండలంలో కుమారపల్లె వంటి రోడ్లలో ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. వర్షం పడితే పూర్తి బురదమయం అవుతున్నాయి. దాదాపు 50 గ్రామాలకు వెళ్లే రాజంపేట-ఆకేపాడు రహదారి ఘోరంగా ఉంది. మోకాటిలోతు గుంతలతో ఈ రోడ్డుపైన ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. ఇరిగేషన్‌శాఖ పరిధిలో ఈ రహదారి ఉండడంతో మరమ్మతులకు నిధులు లేవంటూ చేతులెత్తేశారు. సిద్దవటం మండలం లింగంపల్లె రోడ్డు, నందలూరు మండలం చింతకాయపల్లె రోడ్డుతో పాటు కొన్నిచోట్ల కల్వర్టులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పులివెందుల-వెలమవారిపల్లె తారురోడ్డు కొన్నేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. కంకర తేలి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. వేముల మండలంలో బచ్చయ్యగారిపల్లె రోడ్డు, గండిరోడ్డు నుంచి బైపాస్కు వెళ్లే రహదారి, తొండూరు మండలంలో బూచువారిపల్లె రోడ్డు, సింహాద్రిపురం మండలంలో హిమకుంట్ల, చెర్లోపల్లె, అంకెవానిపల్లెకు వెళ్లే రహదారి చిధ్రమైంది. వర్షాలకు సెప్టెంబరు, అక్టోబరులో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు నిధులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఆర్అండ్బీ పరిధిలో 205.3 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, మూడుచోట్ల రోడ్లు కోసుకుపోయాయి. 16 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో * 15 కోట్లతో శాశ్వత అంచనాలు రూపొందించారు. దీంతోపాటు 96 పంచాయతీ రోడ్లు 110.52 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. దీనికోసం 13.36 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులుమాత్రం మంజూరు కాలేదు. -
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ 3.66 కోట్లు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ :గ్రామీణ రోడ్లు అభివృద్ధికి నియోజకవర్గానికి రూ 3.66 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఈలి నాని తెలిపారు. బుధవారం ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను పంచాయతీరాజ్ గ్రాంటుగా ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో బీటీ రోడ్ల కోసం తాడేపల్లిగూడెం మండలానికి రూ 1.78 కోట్లు, పెంటపాడు మండలానికి రూ 1.42 కోట్లు మొత్తం రూ.3.20 కోట్లు విడుదయ్యాని తెలిపారు. ఎల్ అగ్రహారం నుంచి కుంచనపల్లికి, ఆరుగొలను నుంచి ఆరుగొలను శివారుకు, ఎల్.అగ్రహారం నుంచి అదే పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ వరకు, కుంచనపల్లి నుంచి తాడేపల్లిగూడెంలో జువ్వలపాలెం వరకు, జాతీయ రహదారి నుంచి పెదతాడేపల్లి వరకు బీటీ రోడ్లను ఈ నిధులతో వేస్తామన్నారు. పెంటపాడు మండలంలోని ఎన్ఏ రోడ్డు నుంచి కె.పెంటపాడు అరుంధతిపేట వరకు, ఉప్పరగూడెం నుంచి వెస్టు విప్పర్రులోని సుఖాల దిబ్బవరకు, జట్లపాలెం-మౌంజీపాడు రోడ్డు నుంచి ఉమామహేశ్వరం వరకు, దర్శిపర్రు నుంచి తాడేపల్లిగూడెం మునిసిపల్ ఏరియా వరకు రోడ్లు నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు. సీడీపీ మినిస్టర్ గ్రాంటు నుంచి తాడేపల్లిగూడెం మండలానికి రూ 23.25 లక్షలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. బంగారుగూడెం, నీలాద్రిపురం, మారంపల్లి, దండగర్ర ఇందిరమ్మ కాలనీ, కుంచనపల్లిలో సీసీ రోడ్లు, నీలాద్రిపురంలో కమ్యూనిటీ హాలు, నందమూరు అంబేద్కర్ విగ్రహం వీధిలో సీసీ డ్రెయిన్ నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగించనున్నట్లు చెప్పారు. ఇదే గ్రాంటు నుంచి పెంటపాడు మండలానికి రూ.23 లక్షలు మంజూరయ్యాయన్నారు. పెంటపాడులో సీసీ రోడ్లు, డ్రెయిన్లు , బి.కొందేపాడులో మెటల్ రోడ్డు, పెంటపాడు జూనియర్ కళాశాలకు బీటీ రోడ్డు, రావిపాడులో గ్రావెల్ రోడ్లు, ప్రత్తిపాడు రామాల యం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తామన్నారు. పం చాయతీరాజ్ డీఈ ఎంవీ రమణమూర్తి, ఏఈలు శ్రీనివాసు, అప్పారావు పాల్గొన్నారు.