సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో గ్రామీణ రోడ్లను అద్దంలా తీర్చిదిద్దే పనులకు సర్కారు శ్రీకారం చుడితే.. ఈ పనుల్లో అందిన కాడికి దండుకునేందుకు కాంట్రాక్టర్లు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. భారీ మొత్తంలో మంజూరైన రోడ్ల మరమ్మతు నిధులపై కన్నేసిన గుత్తేదార్లు కొత్త ఎత్తుగడకు తెర లేపారు. ఇందుకోసం ఏకంగా ఓ అసోసియేషన్‌గా ఏర్పడి టెండర్ల ప్రక్రియలో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ టెండరు నిబంధనల ప్రకారం ఏదైనా రోడ్డు పనులకు మొదటిసారి(ఫస్ట్‌కాల్) టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అంచనా వ్యయం కంటే ఎక్సెస్‌కు టెండర్లు వేయడం కుదరదు. ఆయా పనులకు ఎవరూ టెండర్లు వేయని పక్షంలో రెండోసారి టెండర్లు పిలిస్తేనే ఎక్సెస్‌కు వేయడం సాధ్యమవుతుంది.
దీన్ని ఆసరాగా చేసుకుని అసోసియేషన్‌గా ఏర్పడిన కాంట్రాక్టర్లు మొదటి సారి ఎవ్వరు కూడా టెండర్లు వేయలేదు. రెండోసారి పిలిస్తే ఎక్సెస్‌కు ఈ పనులు దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో ఏదైనా పనులకు టెండర్లు పిలిస్తే పోటీపడి అంచనా వ్యయం కంటే తక్కువ(లెస్)కు టెండర్లు వేసే కాంట్రాక్టర్లు ఇప్పుడు అందినకాడికి దండుకునే యోచనలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
52 ప్యాకేజీలు.. రూ.252 కోట్లు..
జిల్లా వ్యాప్తంగా 2009 కంటే ముందు నిర్మించిన పంచాయతీరాజ్ బీటీ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,390 కిలోమీటర్ల పొడవున ఉన్న 390 పీఆర్ రహదారుల మరమ్మతులకు(బీటీ రెన్యూవల్) హైదరాబాద్‌లోని ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం గత నెల 24న టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది.
మండలానికి ఒక ప్యాకేజీ చొప్పున మొత్తం 52 ప్యాకేజీలుగా ఏర్పాటు చేసిటెండర్లు పిలిచారు. అసోసియేషన్‌గా ఏర్పడిన జిల్లాలోని గుత్తేదార్లు 50 ప్యాకేజీలకు అసలు టెండర్లు వేయలేదు. మిగిలిన ఈ రెండు ప్యాకేజీలకు కూడా హాట్ మిక్సింగ్ ప్లాంట్లకు దగ్గరలో ఉన్న రోడ్లు కావడం గమనార్హం.
ఇప్పటి వరకు ఏ చిన్న పనికి అయినా పోటీ పడి మరీ టెండర్లు దాఖలు చేసే కాంట్రాక్టర్లు ఇప్పుడు 50 మండలాల ప్యాకేజీలకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఈ శాఖ ఉన్నతాధికారులు రెండోసారి టెండర్లు పిలిచారు. దీన్ని ఆసరాగా చేసుకునే మిగిలిన 50 ప్యాకేజీలకు ఎక్సెస్‌కు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసుకున్నారు.
పనులు అధికం.. కాంట్రాక్టర్లు పరిమితం..
రహదారుల నిర్మాణం పనులు చేసే బడా కాంట్రాక్టర్లు జిల్లాలో సుమారు 30 మంది వరకు ఉంటారు. ఈ పనులకు టెండర్లు వేయాలంటే ఆయా కాంట్రాక్టర్లు హాట్‌మిక్సింగ్ ప్లాంటు కలిగి ఉండడం తప్పనిసరి. ఈ ప్లాంట్లు ఉన్న కాంట్రాక్టర్లు జిల్లాలో పరిమితంగా ఉండడం, పనులేమో పెద్ద సంఖ్యలో ఉండడం కూడా ఈ కాంట్రాక్టర్ల పంట పండడానికి కారణమవుతోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఇతర జిల్లాల కాంట్రాక్టర్ల నుంచి పోటీ లేకుండా పోయింది.
ఆయా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్డు పనులు మంజూరు కావడంతో సమీపంలో ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన బడా కాంట్రాక్టర్లకు ఆయా జిల్లాల్లోనే చేతినిండా పనులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈ పనులు చేసేందుకు ఇతర జిల్లాల కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఇది జిల్లాలో స్థానికంగా ఉన్న పరిమితి కాంట్రాక్టర్లకు కలిసొస్తోంది.
‘ఎక్సెస్’ ఎత్తుగడ..!
Published Tue, Dec 23 2014 1:21 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement