panchayat raj engineering department
-
మా మంత్రి కనిపించడం లేదు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆరు నెలల క్రితం తమకు పలు హామీలు ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదని, ముఖం కూడా చూపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న 14 సమస్యలను పరిష్కారిస్తామని ఈ ఏడాది మార్చి 14వ తేదీన మంత్రి లోకేశ్, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి లోకేశ్ సూచన మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఆరు నెలలు దాటినా అందులో ఒక్కటీ నేరవేరలేదని ఉద్యోగా సంఘాల నేతలు అంటున్నారు. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ స్థాయి ఇంజనీరింగ్ సిబ్బంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒకేసారి 150 పనులను పర్యవేక్షించాల్సి వస్తోంది. పనిభారం వల్ల ఇంజనీరింగ్ అధికారులు ప్రతి పని వద్ద ఉండే పరిస్థితి లేకపోవడంతో దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి సస్పెన్షన్ కేసులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రికి చెప్పుకున్నారు. వర్క్ఇన్స్పెక్టర్ల స్థానంలో 1,900 మంది సైట్ ఇంజనీర్లను నియమిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. లోకేశ్ ప్రతిపాదనను తిరస్కరించిన ఆర్థిక శాఖ లోకేశ్ హామీ మేరకు 1,900 సైట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి సిఫార్సు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ కార్యదర్శి జవహార్‌రెడ్డి ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ తిరస్కరించిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనిగురించి మంత్రి లోకేశ్‌కు చెబుదామంటే ఆయన అందుబాటులోకి రావడం లేదని విమర్శిస్తున్నారు. అసలే పని ఒత్తిడిలో ఉన్న ఫీల్డు ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్లు వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ల పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేస్తే.. నెలకు ఒక్క మీటింగ్‌కే పరిమితం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని, కనీసం ఆ హామీని కూడా నేరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్‌కు విశ్వసనీయత ఏది? హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించిన మంత్రి లోకేశ్‌కు విశ్వసనీయత ఏముందని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన సచివాలయంలోని తన చాంబర్లో ఎప్పుడూ అందుబాటు ఉండరని చెబుతున్నారు. -
పార్కింగ్ ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పుష్కర ఘాట్ల పనులే కాదు.. పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసే స్థలాల పనుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 13 ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాల ఏర్పాటు కోసం మంజూరైన సుమారు రూ.58.45 లక్షల అంచనా వ్యయం గల 13 పనులను అధికారులు నామినేషన్‌పై అప్పగిస్తున్నారు. వీటిలో ఒకటి, రెండింటికి మినహా మిగిలిన అన్ని పనులకూ ఎలాంటి టెండర్లు పిలువలేదు. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీ నేతలకు పనులు కట్టబెట్టాలని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో రూ.5 లక్షల కంటే తక్కువ అంచనా వ్యయం పనులను నామినేషన్‌పై అప్పగించే వీలుంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాకు మంజూరైన సుమారు రూ.అరకోటికి పైగా అంచనా వ్యయం పనులను అధికార పార్టీ నేతలకు కట్టబెడుతున్నారు. అన్ని పనులను కలిపి ఒక ప్యాకేజీగా ఏర్పాటు చేసి టెండర్లు పిలిస్తే అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయేది. కానీ.. ఈ దిశగా అధికారులు చొరవ చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘాట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాలివే.. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు వచ్చే వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు జిల్లాలో ఇప్పటికే నిర్మించిన, ప్రస్తుతం నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జన్నారం మండలం చింతగూడ, లక్ష్మణచాంద మండలం చింతల్చాందా, దండేపల్లి మండలం ద్వారకా, ఖానాపూర్, ముథోల్ మండలం లోకేశ్వరం, లక్ష్మణచాంద మండలం పీచర, మామడ మండలం పొన్కల్, దిలావర్పూర్ మండలం సంగ్వి, నిర్మల్ మండలం సోన్-1, సోన్-2, జైపూర్ మండలం వెల్మల్‌లో ఈ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో స్థలానికి రూ.రెండు లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో ఓ పార్కింగ్ స్థలానికి రూ.6 లక్షలు, మరో స్థలానికి రూ.13 లక్షలు కూడా కేటాయించారు. ఇందులో రెండు పనులకు మినహా మిగిలిన అన్ని పనులనూ అప్పనంగా కట్టబెట్టారు. స్థలాల గుర్తింపులో జాప్యం.. ఆయా ఘాట్ల వద్ద రెవెన్యూ అధికారులు గుర్తించిన స్థలాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కరాల సమయం దగ్గర పడుతున్నా ఈ స్థలాల గుర్తింపులో జాప్యం జరుగుతోంది. కొన్ని చోట్ల స్థలాలను గుర్తించినా, ఆ స్థలాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించకపోవడంతో పనులు ప్రారంభించేందుకు వీలు పడటం లేదు. ఒక్క చింతల్‌చాంద, ఖానాపూర్, లోకేశ్వరం, పీచర, పొన్కల్, సంగ్వి, సోన్-1, సోన్-2, వేలాల ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను అప్పగించిన అధికారులు, మిగిలిన చోట్ల వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ‘రూ.5 లక్షలలోపు కంటే తక్కువ అంచనా వ్యయం గల పనులను నామినేషన్‌పై ఇచ్చేందుకు వీలుంది. రూ.ఐదు లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం గల పనులన్నింటికీ టెండర్లు పిలిచాం’ అని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ మారుతి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘ఎక్సెస్’ ఎత్తుగడ..!
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో గ్రామీణ రోడ్లను అద్దంలా తీర్చిదిద్దే పనులకు సర్కారు శ్రీకారం చుడితే.. ఈ పనుల్లో అందిన కాడికి దండుకునేందుకు కాంట్రాక్టర్లు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. భారీ మొత్తంలో మంజూరైన రోడ్ల మరమ్మతు నిధులపై కన్నేసిన గుత్తేదార్లు కొత్త ఎత్తుగడకు తెర లేపారు. ఇందుకోసం ఏకంగా ఓ అసోసియేషన్‌గా ఏర్పడి టెండర్ల ప్రక్రియలో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ టెండరు నిబంధనల ప్రకారం ఏదైనా రోడ్డు పనులకు మొదటిసారి(ఫస్ట్‌కాల్) టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అంచనా వ్యయం కంటే ఎక్సెస్‌కు టెండర్లు వేయడం కుదరదు. ఆయా పనులకు ఎవరూ టెండర్లు వేయని పక్షంలో రెండోసారి టెండర్లు పిలిస్తేనే ఎక్సెస్‌కు వేయడం సాధ్యమవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని అసోసియేషన్‌గా ఏర్పడిన కాంట్రాక్టర్లు మొదటి సారి ఎవ్వరు కూడా టెండర్లు వేయలేదు. రెండోసారి పిలిస్తే ఎక్సెస్‌కు ఈ పనులు దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో ఏదైనా పనులకు టెండర్లు పిలిస్తే పోటీపడి అంచనా వ్యయం కంటే తక్కువ(లెస్)కు టెండర్లు వేసే కాంట్రాక్టర్లు ఇప్పుడు అందినకాడికి దండుకునే యోచనలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 52 ప్యాకేజీలు.. రూ.252 కోట్లు.. జిల్లా వ్యాప్తంగా 2009 కంటే ముందు నిర్మించిన పంచాయతీరాజ్ బీటీ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,390 కిలోమీటర్ల పొడవున ఉన్న 390 పీఆర్ రహదారుల మరమ్మతులకు(బీటీ రెన్యూవల్) హైదరాబాద్‌లోని ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం గత నెల 24న టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. మండలానికి ఒక ప్యాకేజీ చొప్పున మొత్తం 52 ప్యాకేజీలుగా ఏర్పాటు చేసిటెండర్లు పిలిచారు. అసోసియేషన్‌గా ఏర్పడిన జిల్లాలోని గుత్తేదార్లు 50 ప్యాకేజీలకు అసలు టెండర్లు వేయలేదు. మిగిలిన ఈ రెండు ప్యాకేజీలకు కూడా హాట్ మిక్సింగ్ ప్లాంట్లకు దగ్గరలో ఉన్న రోడ్లు కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ చిన్న పనికి అయినా పోటీ పడి మరీ టెండర్లు దాఖలు చేసే కాంట్రాక్టర్లు ఇప్పుడు 50 మండలాల ప్యాకేజీలకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఈ శాఖ ఉన్నతాధికారులు రెండోసారి టెండర్లు పిలిచారు. దీన్ని ఆసరాగా చేసుకునే మిగిలిన 50 ప్యాకేజీలకు ఎక్సెస్‌కు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. పనులు అధికం.. కాంట్రాక్టర్లు పరిమితం.. రహదారుల నిర్మాణం పనులు చేసే బడా కాంట్రాక్టర్లు జిల్లాలో సుమారు 30 మంది వరకు ఉంటారు. ఈ పనులకు టెండర్లు వేయాలంటే ఆయా కాంట్రాక్టర్లు హాట్‌మిక్సింగ్ ప్లాంటు కలిగి ఉండడం తప్పనిసరి. ఈ ప్లాంట్లు ఉన్న కాంట్రాక్టర్లు జిల్లాలో పరిమితంగా ఉండడం, పనులేమో పెద్ద సంఖ్యలో ఉండడం కూడా ఈ కాంట్రాక్టర్ల పంట పండడానికి కారణమవుతోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఇతర జిల్లాల కాంట్రాక్టర్ల నుంచి పోటీ లేకుండా పోయింది. ఆయా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్డు పనులు మంజూరు కావడంతో సమీపంలో ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన బడా కాంట్రాక్టర్లకు ఆయా జిల్లాల్లోనే చేతినిండా పనులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈ పనులు చేసేందుకు ఇతర జిల్లాల కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఇది జిల్లాలో స్థానికంగా ఉన్న పరిమితి కాంట్రాక్టర్లకు కలిసొస్తోంది. -
రిటైర్డ డీఈ ఇంట్లో దోపిడీ
సాక్షి, కాకినాడ : ఇంట్లో చొరబడ్డ దొంగలు.. భార్యాభర్తలను బంధించి బంగారు ఆభరణాలను దోచుకున్న సంఘటన సంచలనం కలిగించింది. స్థానిక ప్రతాప్‌నగర్ వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. వృద్ధులైన బాధితులు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో స్వ యంగా కట్లు విప్పుకొని స్థానికుల సహకారంతో టూ టౌన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం ఉదయం సంఘటన వెలుగులోకి వచ్చింది. రూ.4 లక్షలకు పైగా సొత్తు చోరీ అయింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో డీఈగా పని చేసి రిటైరైన పంజా వేణుగోపాలరావు స్థానిక ప్రతాప్‌నగర్ వాటర్ ట్యాంకు వద్ద ఇల్లు నిర్మించుకున్నారు. ఆయన పిల్లలు ఉపాధి రీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్నందున, ఆ ఇంట్లో భార్య విజయలక్ష్మితో ఉంటున్నారు. ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్లిన వారు సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరుకున్నారు. తలుపులు వేశాక కాసేపటి తర్వాత వారు అల్పాహారం తిన్నారు. ఎనిమిది గంటలు దాటాక భర్తకు మజ్జిగ ఇద్దామని విజయలక్ష్మి లోపలికి వె ళ్లింది. ఈ సమయంలోముసుగులు ధరించిన ఇద్దరు యువకులు తలుపు తోసుకుని ఇంట్లోకి చొరబడ్డారు. గోపాలరావుకు కత్తులు చూపి, అరిస్తే చంపుతామని బెదిరించారు. ప్రతిఘటించబోయిన ఆయనపై ఆ ఇద్దరు చేయిచేసుకుని, తమ వెంట తెచ్చిన ప్లాస్టర్ నోటికి చుట్టి, చేతులను బంధించారు. వంటింటి నుంచి వస్తున్న విజయలక్ష్మిని కూడా అలాగే బంధించి, బీరువా తాళాలు అడిగి తీసుకున్నారు. బీరువాలో సామాన్లు చిందరవందర చేసి, బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు, బ్యాంకు లాకర్ కీతో పాటు విజయలక్ష్మి మెడలోని పుస్తెల తాడును అపహరించారు. ఆభరణాలు సుమారు 20 కాసులు ఉంటాయి. దుండగులు వెళ్లిపోయాక ఆ భార్యాభర్తలు అర్ధరాత్రి సమయానికి తమ కట్లు విడిపించుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని కాకినాడ డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డి, నగర క్రైం సీఐ ఆండ్ర రాంబాబు, టూ టౌన్ క్రైం ఎస్సై కేవీ రామారావు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ జాగిలం సంఘటన స్థలం నుంచి వెనుక వైపు వీధి, రైల్వే ట్రాక్ గోడ పక్క నుంచి ట్రెజరీ కాలనీ వైపు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. దుండగులు బీరువా వైపు వెళ్లాక కారం చల్లడంతో, క్లూస్ టీంకు ఎలాంటి ఆధారం లభించలేదని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా ప్రధాన ద్వారానికి కట్టిన మామిడి తోరణాలు అడ్డురావడంతో.. మెష్డోర్ టవర్ బోల్టు పూర్తిగా పడకపోవడం వల్ల దుండగులు నేరుగా ఇంట్లోకి చొరబడి, దోచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలిసిన వారి పనే : డీఎస్పీ కాకినాడ డీఎస్పీ రామిరెడ్డి విజయ భాస్కర రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని నిత్యం కనిపెట్టి ఉంటున్నవారు, ఇంటి విషయమై బాగా ఆనూపానూ తెలిసిన వ్యక్తులే ఈ నేరం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశా రు. నిందితులు దొరకడం ఖాయమని చెప్పారు.