సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పుష్కర ఘాట్ల పనులే కాదు.. పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసే స్థలాల పనుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 13 ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాల ఏర్పాటు కోసం మంజూరైన సుమారు రూ.58.45 లక్షల అంచనా వ్యయం గల 13 పనులను అధికారులు నామినేషన్‌పై అప్పగిస్తున్నారు. వీటిలో ఒకటి, రెండింటికి మినహా మిగిలిన అన్ని పనులకూ ఎలాంటి టెండర్లు పిలువలేదు. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీ నేతలకు పనులు కట్టబెట్టాలని భావిస్తున్నారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో రూ.5 లక్షల కంటే తక్కువ అంచనా వ్యయం పనులను నామినేషన్‌పై అప్పగించే వీలుంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాకు మంజూరైన సుమారు రూ.అరకోటికి పైగా అంచనా వ్యయం పనులను అధికార పార్టీ నేతలకు కట్టబెడుతున్నారు. అన్ని పనులను కలిపి ఒక ప్యాకేజీగా ఏర్పాటు చేసి టెండర్లు పిలిస్తే అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయేది. కానీ.. ఈ దిశగా అధికారులు చొరవ చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఘాట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాలివే..
పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు వచ్చే వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు జిల్లాలో ఇప్పటికే నిర్మించిన, ప్రస్తుతం నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జన్నారం మండలం చింతగూడ, లక్ష్మణచాంద మండలం చింతల్‌చాందా, దండేపల్లి మండలం ద్వారకా, ఖానాపూర్, ముథోల్ మండలం లోకేశ్వరం, లక్ష్మణచాంద మండలం పీచర, మామడ మండలం పొన్కల్, దిలావర్‌పూర్ మండలం సంగ్వి, నిర్మల్ మండలం సోన్-1, సోన్-2, జైపూర్ మండలం వెల్మల్‌లో ఈ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో స్థలానికి రూ.రెండు లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో ఓ పార్కింగ్ స్థలానికి రూ.6 లక్షలు, మరో స్థలానికి రూ.13 లక్షలు కూడా కేటాయించారు. ఇందులో రెండు పనులకు మినహా మిగిలిన అన్ని పనులనూ అప్పనంగా కట్టబెట్టారు.
స్థలాల గుర్తింపులో జాప్యం..
ఆయా ఘాట్ల వద్ద రెవెన్యూ అధికారులు గుర్తించిన స్థలాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కరాల సమయం దగ్గర పడుతున్నా ఈ స్థలాల గుర్తింపులో జాప్యం జరుగుతోంది. కొన్ని చోట్ల స్థలాలను గుర్తించినా, ఆ స్థలాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించకపోవడంతో పనులు ప్రారంభించేందుకు వీలు పడటం లేదు. ఒక్క చింతల్‌చాంద, ఖానాపూర్, లోకేశ్వరం, పీచర, పొన్కల్, సంగ్వి, సోన్-1, సోన్-2, వేలాల ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను అప్పగించిన అధికారులు, మిగిలిన చోట్ల వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ‘రూ.5 లక్షలలోపు కంటే తక్కువ అంచనా వ్యయం గల పనులను నామినేషన్‌పై ఇచ్చేందుకు వీలుంది. రూ.ఐదు లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం గల పనులన్నింటికీ టెండర్లు పిలిచాం’ అని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ మారుతి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
పార్కింగ్ ‘పంచాయితీ’
Published Thu, Jun 11 2015 5:45 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement