యడ్లపాడు మండలం సంగం గోపాలపురానికి చెందిన షేక్ చిన్న కమాల్ ఇరవై ఏళ్ల కిందట గుంటూరుకు చెందిన మేరి వద్ద స్థలం కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని తన ముగ్గురు కుమార్తెలకు పంచడంతో వారు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఆ స్థలంపై స్థానిక అధికార పార్టీ నాయకుడు కన్నేశాడు. పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. అయితే ఈ సారి స్థలం ఖాళీ చేయాలని అధికార పార్టీ నాయకుడు పోలీసులతో కుమ్మక్కై వేధింపులు తీవ్రం చేశాడు. అర్ధరాత్రి వేళలో ఇంటికి వెళ్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించడంతో గత్యంతరం లేని స్థితిలో బాధితులు రూరల్ ఏఎస్పీని కలిసి గత సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల హెచ్చరికతో పోలీసులు ఓ అడుగు వెనక్కి వేశారు. సదరు నాయకుడు మాత్రం ఎలాగైనా స్థలం కాజేయాలనే పనిలో నిమగ్నమయ్యాడు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటు చేసుకుంటున్నాయి.
గుంటూరు: ‘సారూ.. ఆ ఎస్‌ఐ మమ్మల్ని పట్టించుకోవడంలేదయ్యా.. తమరే మా కు న్యాయం చేయాలి..’ అంటూ ఓ వృద్ధ దంపతులు మొరపెట్టుకోగా.. ‘ఎస్పీ గారూ.. మా స్థలం కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారికి పోలీసులు వత్తాసుపలికి, ఫిర్యాదిచ్చిన మా మీదనే బెదిరింపులకు దిగుతున్నారంటూ...’ బాధితులు రూరల్, అర్బన్ ఎస్పీల గ్రీవెన్స్‌లో వాపోతున్నారు. పోలీసులు బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.. తక్షణమే వారి సమస్యలపై స్పందించాలని అర్బన్, రూరల్ ఎస్పీలు పదేపదే క్రైం సమీక్షల్లో చెబుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండటం లేదనిపిస్తోంది.
అచ్చంగా కాసులొచ్చే కేసులపైనే మక్కువ చూపుతూ.. అన్యాయం జరిగిన వారిని సైతం బెదిరిస్తూ పబ్బంగడుపుకోవాలని కొందరు ఎస్‌ఐ, సీఐలు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోన్న క్రమంలో బా«ధితులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఓ అడుగు ముందుకు వేస్తే..అధికార పార్టీ నాయకుల అండతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేసేందుకు సైతం వెనుకాడటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సివిల్ వివాదాల్లో తలదూర్చి..
జిల్లాలో ఇటీవల వివిధ స్టేషన్ల పరిధిలోని కొందరు ఎస్సై, సీఐ స్థాయి అధికారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారితో అమర్యాదగా మాట్లాడటం, వారి చెప్పినట్లు వినకపోతే ఇరుపక్షాల కేసులను నమోదు చేసేందుకు కూడా వెనుకాడటంలేదు. జిల్లాలోని అర్బన్ పరిధిలో 18 స్టేషన్లు, రూరల్ పరిధిలో 64 స్టేషన్లు ఉండగా, వాటి పరిధిలో సరాసరిగా చూస్తే నెలకు 2400 కేసులు వరకు నమోదవు తున్నాయి. గతంలో స్టేషన్ కొచ్చిన ఫిర్యాదులన్నింటిని జనరల్ డైరీ (జీడీ)లో నమోదు చేసి.. ఆ సమాచారాన్ని ప్రతీ రోజూ సాయంత్రానికి జిల్లా కేంద్రానికి పంపేవారు.
అయితే, నేడు కొన్ని పోలీస్ స్టేషన్‌ల నుంచి ఫిర్యాదుల సమాచారమే రావడం లేదని అధికార వర్గాల సమాచారం. సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్న పోలీస్ అధికారులపైనే ఉన్నతాధికారులకు అధికంగా ఫిర్యాదులందుతున్నాయి. రాజధాని నేపథ్యంలో స్థలాల ధరలు పెరగడం, డబుల్ రిజిస్ట్రేషన్‌లు, నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించడం వంటి వ్యవహారాలు సంగతి తెలిసిందే. అయితే, ఆయా కేసుల్లో బాధితులకు అన్యాయం చేసిన వారితో పాటు పోలీస్ అధికారులపైనా ఆరోపణలు రావడం గమనార్హం. గ్రీవెన్స్ సెల్‌లో ఒకే స్టేషన్ పరిధిలో రెండు, మూడు సార్లు ఫిర్యాదులు వస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికి ఫలితంలేకుండా పోయింది. ఇలాగైతే బాధితులకు న్యాయం ఎలాజరుగుతుందనే విమర్శలు లేక పోలేదు.
మండల స్థాయిలో నమ్మకం లేకనే
మండల స్థాయిలో అధికారపార్టీ నాయకుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న పోలీసులు ఎటూ మాట్లాడలేక మిన్నకుండిపోతున్నారు. గ్రీవెన్స్‌లో అధికంగా ఆస్తుల వివాదాలు, బెదిరింపుల వ్యవహారాలు, కొట్లాట కేసుల్లో న్యాయం జరగడం లేదని, మండలస్థాయిలో స్టేషన్‌లపై నమ్మకం ఉండటం లేదని బాధితులు అర్బన్, రూరల్ ఎస్పీలను కలుస్తున్నారు. ఇదిలావుంటే, జిల్లా కేంద్రంకు వచ్చే ఫిర్యాదుల్లో కొంత భాగం అవాస్తవాలు కూడా నమోదవుతున్నాయని ఎస్పీలే చెబుతున్నారు. ఏది ఏమైనా పోలీస్ స్టేషన్‌లలో సిబ్బంది బాధితుల పట్ల వ్యవహరించే శైలిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లంచాలే ఆయనకు దివ్య‘ప్రసాద’ం
రాజధాని ప్రాంతంలో కొంతమంది పోలీస్ అధికారుల అవినీతి మితిమీరిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ స్టేషన్ బాస్ అయితే.. లంచాల రూపంలో ‘ప్రసాదం’ ముడితే.. తప్పు చేసిన వాళ్లను వదిలేసి.. బాధితులనే వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోతున్నారు. ఈ అధికారి అక్రమంగా సంపాందించిన సొమ్ముతోనే రాజధాని ప్రాంతంలోని వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఉన్న ప్లాటును బినామీ పేరు మీద కొనుగోలు చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా జిల్లా పోలీస్ బాస్, డివిజన్ బాస్ తెలుసుకోవడంతో ఈ స్టేషన్ బాస్‌పై ఫైర్ అయినట్టు వినికిడి.
Comments
Please login to add a commentAdd a comment