చికిత్స పొందుతున్న బాధితురాలు సువార్తమ్మ
న్యాయం చేయండని వెళ్లిన దళిత మహిళకు ఎస్‌ఐ బెదిరింపు
లాఠీతో కొట్టి దుర్భాషలాడిన వైనం
అవమానంతో పురుగు మందు తాగిన బాధితురాలు.. పరిస్థితి విషమం
రేపల్లె: న్యాయాన్యాయాలు చూడకుండా లాఠీతో చితకబాది, బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ ఎస్‌ఐ తీవ్రంగా బెదిరించడంతో ఓ దళిత మహిళ పురుగు మందు తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. తమ స్థలంలో ఉన్న మెట్లను ఎందుకు అక్రమంగా పగులగొడుతున్నారని ప్రశ్నించడమే ఆ మహిళ పట్ల శాపంగా మారింది.
బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరుంబాకలో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ఇంటి వద్ద ఉన్న మెట్లను కూల్చడం అక్రమమని సువార్తమ్మ, ఆమె భర్త ఏసురత్నం శనివారం అడ్డుపడ్డారు. దీంతో తమ మాటకే ఎదురు చెబుతారా అంటూ సర్పంచ్ వేము ప్రసన్నత, ఆమె భర్త కిరణ్, మరికొందరు వీరిపై దాడి చేశారు. తమపై సర్పంచ్, ఆమె భర్త.. అనుచరులు దాడి చేశారంటూ బాధితులు సువార్తమ్మ, ఆమె భర్త ఏసురత్నం చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాత్రి ఎస్‌ఐ పి.భాస్కర్ సువార్తమ్మ, ఏసురత్నంలను స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సువార్తమ్మ ఇంటికొచ్చి ఆదివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తేగాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు.
‘బ్రోతల్ కేసులో ఇరికిస్తా... అండమాన్ జైలుకు పంపిస్తా... ఇంటి చుట్టు పక్కల పది మందితో సంతకాలు చేయించుకుని అడ్రస్ లేకుండా చేస్తా.. ఇల్లు కూల్చేస్తా.. అంటూ బూతులు తిడుతూ నా తల్లిదండ్రులను ఎస్‌ఐ భాస్కర్ అవమానించారు. పోలీస్టేస్టేషన్‌లో లాఠీతో కొట్టడంతోనే మా అమ్మ పురుగుల మందు తాగింది. మా నాన్న ఆరోగ్యం బాగోలేదు. నా తల్లి చనిపోతే నా పరిస్థితేంటి? మాపై దాడి జరిగింది.. న్యాయం చేయండని వెళ్లిన మా అమ్మా నాన్నలను నిర్బంధించి లాఠీలతో కొట్టడం ఎంత వరకు న్యాయం’ అని సువార్తమ్మ కుమార్తె సీహెచ్ అనూష కన్నీటి పర్యంతమైంది.
విచారించాం.. కొట్టలేదు
రోడ్డు నిర్మాణానికి అడ్డు పడుతున్నారని గ్రామ సర్పంచ్ వేము ప్రసన్నత, కార్యదర్శి ఎం.కుమారి ఆరుంబాక గ్రామానికి చెందిన సువార్తమ్మ, ఏసురత్నంలపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిని స్టేషన్‌కు పిలిపించి విచారించిన మాట వాస్తవమే. ఎవరినీ దుర్భాషలాడలేదు. కొట్టలేదు.
– భాస్కర్, ఎస్సై, చెరుకుపల్లి