శావల్యాపురం పోలీసు స్టేషను ఎస్‌ఐ వెంకట సురేష్
శావల్యాపురం: నియోజకవర్గంలోని శావల్యాపురం ఎస్‌ఐ వెంకట సురేష్‌ను వీఆర్‌కు పంపుతూ జిల్లా రూరల్ ఎస్పీ చింతల వెంకట అప్పలనాయుడు బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. దంపతులపై వేధింపులకు పాల్పడంతో ఆయన ఈ చర్య తీసుకున్నారు. వివరాలు...శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి శ్రీనివాసరావు కారు డ్రైవరుగా వినుకొండలోని ట్రావెల్స్‌లో పని చేస్తాడు. భార్య నాగలక్ష్మి పొలం పనులు చూసుకుంటూ ఇంటి దగ్గర ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఈనెల 7న గేదెల్ని తోలుకుని పొలానికి వెళ్లింది.అక్కడ గ్రామానికి చెందిన గోపిశెట్టి రంగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా, అదే సమయంలో భర్త శ్రీనివాసరావు అక్కడకు వచ్చాడు.
విషయాన్ని నాగలక్ష్మి అతడి దృష్టికి తెచ్చింది. దీంతో గోపిశెట్టి రంగా–శ్రీనివాసరావు మధ్య పొలంలో ఘర్షణ నెలకొంది. అదే రోజు సాయంత్రం గోపిశెట్టి రంగా పోలీసుస్టేషనుకు వచ్చి రామిశెట్టి శ్రీనివాసరావు దంపతులు కలసి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు సాయంత్రం ఎస్‌ఐ వెంకట సురేష్ భార్యభర్తల్ని విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు. పెద్దల సమక్షంలో రామిశెట్టి శ్రీనివాసరావును దుర్భాషలాడి, కొట్టారు. దీంతో దంపతులు మనస్తాపం చెందారు. ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకొని తమను తీవ్ర ఇబ్బందులకు పాలుచేస్తున్నాడని ఆరోపిస్తూ ఇద్దరూ వినుకొండ మండలం మదమంచిపాడు దేవాలయం సమీపాన ఈనెల 9న పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన ఆటో డ్రైవర్లు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
గ్రామస్తుల ఆందోళన
ఈ సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున శావల్యాపురం పోలీసుస్టేషనుకు చేరుకొని ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని అందోళన చేపట్టారు.దీంతో ఉన్నతాధికారులు ఈపూరు మండల ఎస్‌ఐ పట్టాభిరామయ్యను పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల హామీ మేరకు గ్రామస్తులు శాంతించారు. అనంతరం వినుకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు వైద్యశాల వద్దకు చేరుకొని భార్యభర్తల పరిస్థితి వాకబు చేశారు. సంఘటనపై జిల్లా పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి ఘటనల వల్ల పోలీసు డిపార్టుమెంటుపై ప్రజల్లో నమ్మకం పోతోందని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రామిశెట్టి శ్రీనివాసరావు తల్లి సుందరమ్మ ఫిర్యాదు మేరకు గోపిశెట్టి రంగాపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ అప్పలనాయుడు జరిగిన సంఘటనపై పత్రికలు, సోషల్ మీడియోలో వచ్చిన కథనాలను పరిశీలించారు. విచారణ చేసి తక్షణమే ఎస్‌ఐ వెంకట సురేష్‌ను బుధవారం రాత్రి 10గంటల సమయంలో వీఆర్‌కు పంపారు.
ఎస్‌ఐపై ఫిర్యాదుల వెల్లువ
2017లో ఎస్‌ఐ వెంకట సురేష్ విధుల్లోకి చేరారు. తరుచూ వివాదాలకు పోవడం, స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తించడం, కేసుల్లో చేతివాటం ప్రదర్శించటం, ప్రజలతో దురుసుగా వ్యవరించడం తదితర వ్యవహారాలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందాయి.
కానిస్టేబుల్సే కారణమా ?
స్టేషనులోని కొందరు సీనియర్ కానిస్టేబుల్స్ ఎస్‌ఐలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. తమకు ఇష్టమైన వ్యక్తులపై సానుకూలత ప్రదర్శిచడం, ఇష్టం లేని వారిపై దురుసుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఎస్‌ఐలకు తప్పుడు సమాచారం ఇస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. నూతనంగా వచ్చిన ఎస్‌ఐలు కూడా మండలంపై పట్టు సాధించలేక కానిస్టేబుళ్లపై ఆధారపడటం వారికి అవకాశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment