రిటైర్‌‌డ డీఈ ఇంట్లో దోపిడీ | robbery in Retirement DE home | Sakshi
Sakshi News home page

రిటైర్‌‌డ డీఈ ఇంట్లో దోపిడీ

Published Fri, Sep 13 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

robbery in Retirement DE  home

 సాక్షి, కాకినాడ : ఇంట్లో చొరబడ్డ దొంగలు.. భార్యాభర్తలను బంధించి బంగారు ఆభరణాలను దోచుకున్న సంఘటన సంచలనం కలిగించింది. స్థానిక ప్రతాప్‌నగర్ వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. వృద్ధులైన బాధితులు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో స్వ యంగా కట్లు విప్పుకొని స్థానికుల సహకారంతో టూ టౌన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం ఉదయం సంఘటన వెలుగులోకి వచ్చింది. రూ.4 లక్షలకు పైగా సొత్తు చోరీ అయింది.
 
 స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో డీఈగా పని చేసి రిటైరైన పంజా వేణుగోపాలరావు స్థానిక ప్రతాప్‌నగర్ వాటర్ ట్యాంకు వద్ద ఇల్లు నిర్మించుకున్నారు. ఆయన పిల్లలు ఉపాధి రీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్నందున, ఆ ఇంట్లో భార్య విజయలక్ష్మితో ఉంటున్నారు. ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్లిన వారు సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరుకున్నారు. తలుపులు వేశాక కాసేపటి తర్వాత వారు అల్పాహారం తిన్నారు. ఎనిమిది గంటలు దాటాక భర్తకు మజ్జిగ ఇద్దామని విజయలక్ష్మి లోపలికి వె ళ్లింది. ఈ సమయంలోముసుగులు ధరించిన ఇద్దరు యువకులు తలుపు తోసుకుని ఇంట్లోకి చొరబడ్డారు. గోపాలరావుకు కత్తులు చూపి, అరిస్తే చంపుతామని బెదిరించారు. ప్రతిఘటించబోయిన ఆయనపై ఆ ఇద్దరు చేయిచేసుకుని, తమ వెంట తెచ్చిన ప్లాస్టర్ నోటికి చుట్టి, చేతులను బంధించారు. వంటింటి నుంచి వస్తున్న విజయలక్ష్మిని కూడా అలాగే బంధించి, బీరువా తాళాలు అడిగి తీసుకున్నారు. బీరువాలో సామాన్లు చిందరవందర చేసి, బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు, బ్యాంకు లాకర్ కీతో పాటు విజయలక్ష్మి మెడలోని పుస్తెల తాడును అపహరించారు. ఆభరణాలు సుమారు 20 కాసులు ఉంటాయి.
 
 దుండగులు వెళ్లిపోయాక ఆ భార్యాభర్తలు అర్ధరాత్రి సమయానికి తమ కట్లు విడిపించుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని కాకినాడ డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డి, నగర క్రైం సీఐ ఆండ్ర రాంబాబు, టూ టౌన్ క్రైం ఎస్సై కేవీ రామారావు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ జాగిలం సంఘటన స్థలం నుంచి వెనుక వైపు వీధి, రైల్వే ట్రాక్ గోడ పక్క నుంచి ట్రెజరీ కాలనీ వైపు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. దుండగులు బీరువా వైపు వెళ్లాక కారం చల్లడంతో, క్లూస్ టీంకు ఎలాంటి ఆధారం లభించలేదని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా ప్రధాన ద్వారానికి కట్టిన మామిడి తోరణాలు అడ్డురావడంతో.. మెష్‌డోర్ టవర్ బోల్టు పూర్తిగా పడకపోవడం వల్ల దుండగులు నేరుగా ఇంట్లోకి చొరబడి, దోచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
 తెలిసిన వారి పనే : డీఎస్పీ
 కాకినాడ డీఎస్పీ రామిరెడ్డి విజయ భాస్కర రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని నిత్యం కనిపెట్టి ఉంటున్నవారు, ఇంటి విషయమై బాగా ఆనూపానూ తెలిసిన వ్యక్తులే ఈ నేరం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశా రు. నిందితులు దొరకడం ఖాయమని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement