నరకానికి నకళ్లు !
జిల్లాలో రహదారుల వ్యవస్థ దారుణంగా మారింది. రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో అంతర్భాగమైన రహదారుల వ్యవస్థను ప్రభుత్వం గాలికొదిలేసిన ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణం, నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో రహదారులు క్షీణదశకు చేరాయి. పలు నియోజకవర్గాలు, మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లేందుకు సరైన రహదారుల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కళ్లకు కడుతోంది. రాజధాని కేంద్ర బిందువైన తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలకు సరైన రహదారుల వ్యవస్థ లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
- గ్రామీణ రహదారుల వ్యవస్థ చిన్నాభిన్నం
- రోడ్లు సరిగా లేక 40 గ్రామాలకు వెళ్లని ఆర్టీసీ బస్సులు
- గుంతలమయంగా మారిన గుంటూరు - హైదరాబాద్, చెన్నైమార్గాలు
- మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు నియోజకవర్గాల్లో సైతం దారుణం
- నాణ్యతాలోపంతో తెనాలి డివిజన్‌లో భారీగా దెబ్బతిన్న రహదారులు
గుంటూరు ఎడ్యుకేషన్
రహదారులు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) పరిధిలో జిల్లాలో 3,400 కిలో మీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో 656 కిలోమీటర్ల పరిధిలో రాష్ట్ర రహదారులు, 1,965 కిలోమీటర్ల మేర జిల్లా రహదారులు, 779 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు ఉన్నాయి. రహదారుల వ్యవస్థ లేక జిల్లాలోని 40 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు సైతం వెళ్లని పరిస్థితులు ఉన్నాయయి.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తట్టుకొనేందుకు చేపట్టిన రహదారుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు రెండు లేన్ల రాష్ట్ర రహదారిని నాలుగు లేన్లగా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఓ కొలిక్కి రాలేదు. గుం టూరు నగర పరిధిలో చుట్టుగుంట-పల్నాడు బస్టాండ్ మధ్య విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్, అటు చెన్నై వెళ్లే మార్గాలకు ఈ దారే కీలకం. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారి నిర్వహణ లోపంతో గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది.
తారు రోడ్డు ఎరుగని గ్రామాలు ...
- తారురోడ్డు సైతం ఎరుగని గ్రామాలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల వ్యవస్థ అధ్వానంగా మా రింది. ఎస్సీ కాలనీలకు దారితీసే రోడ్లు మట్టి, గ్రావెల్ వంటి తాత్కాలిక మెరుగులకే పరిమితమయ్యాయి.
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజవర్గంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లు అధ్వానంగా మారాయి. యడ్లపాడు -లింగారావుపాలెం, వంకాయలపాడు - కారుచోల రోడ్డు, తిమ్మాపురం-దింతెనపాడు, సందెపూడి-వేలూరు రోడ్లు అధ్వానంగా ఉన్నా యి. చిలకలూరిపేట మండలంలో కొమటినేని వారిపాలెం-కమ్మవారిపాలెం, మానుకొండవారిపాలెం-వేలూరు, నాదెండ్ల -గణపవరం, కనుపర్రు-సాతులూరు, సాతులూరు-నాదెండ్ల రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.
- మాచర్ల నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులు అధ్వానంగా తయారై నిత్యం ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మార్జిన్లు సక్రమంగా లేకపోవటం, వర్షాలకు కోతకు గురికావటంతో ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే సాగర్ రహదారి గుంతల మయంగా మారింది.
- పొన్నూరు నియోజకవర్గంలో వలసమాలప ల్లి, మన్నవ, రమణప్పపాలెం, దొప్పలపూడి, నండూరు,కసుకర్రు, మన్నవ,రమణప్పపాలెం, వల్లభరావుపాలెం, పెదపాలెం, ఉప్పరపాలెం గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి.
- తెనాలి డివిజన్‌లో ఆర్‌అండ్‌బీ రోడ్లు నిర్మా ణం, మరమ్మతుల్లో నాణ్యత లేమి కారణంగా భారీగా దెబ్బతిన్నాయి. నిర్మాణంలో ఉన్న రోడ్లు నత్తనడకన సాగుతున్నాయి. సిరిపురం-తెనాలి, దంతులూరు-మున్నంగి, తెనాలి-చెరుకుపల్లి రోడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి.