అతుకులు.. గతుకులు | Rural roads are haphazard | Sakshi
Sakshi News home page

అతుకులు.. గతుకులు

Published Mon, Jul 6 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

అతుకులు.. గతుకులు

అతుకులు.. గతుకులు

జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏ రోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి రోడ్డు చరిత్ర సమస్తం అతుకు గతుకుల మయం అన్న చందంగా తయారైంది పరిస్థితి. పల్లెసీమలు ప్రగతికి పట్టుగొమ్మలు అంటూ ఊదరగొట్టే పాలకులు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. అధికారులు పంపిన ప్రతిపాదనలు సైతం చెత్తబుట్టల్లో చేరిపోతున్నాయి. వెరసి ఈ రహదారుల్లో ప్రజలకు ‘నడక’యాతన తప్పడం లేదు.
- అస్తవ్యస్తంగా గ్రామీణ రహదారులు
- ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌లకు తక్కువగా నిధులు
- ప్రతిపాదనలకే పరిమితమైన సోములవారిపల్లె కాజ్‌వే
- సోమశిలకు బ్యాక్ వాటర్ వస్తే 20 గ్రామాలకు ఇబ్బందులు
- నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య పూర్తికాని రహదారి
- అటకెక్కిన నంద్యాల - పలమనేరు నాలుగులేన్ల రహదారి
సాక్షి కడప:
పల్లె సీమలు ప్రగతిబాట పట్టాలంటే ప్రధానంగా రహదారులే కీలకం. గ్రామాలకు రోడ్డు మార్గం ఉంటే ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు.. ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరేందుకు మార్గం సుగమమవుతుంది. స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్లు దాటుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. ప్రత్యేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్‌అండ్‌బీకి నిధుల వరద కురిసింది.

అప్పట్లో ప్రతి పల్లెకూ తారు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో తారు రోడ్ల మరమ్మతులకు కూడా టీడీపీ సర్కార్ నిధులు విదల్చడం లేదని పలువురు వాపోతున్నారు. అనేక చోట్ల ఇప్పటికీ అతుకు గతుకుల రోడ్లల్లో ప్రయాణం సాగించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుమునుపే రోడ్డు పనులు పూర్తి చేసినా బిల్లులు రాక అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు కూడా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు బిల్లులను ప్రభుత్వానికి నివేదిస్తున్నా పూర్తి స్థాయిలో రావడం లేదు. పైగా జిల్లాలో అనేక చోట్ల రోడ్లు, కాజ్‌వేలకు ప్రతిపాదనలు పంపినా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదు.  
 
ప్రతిపాదనలకు పరిమితమైన సోములవారిపల్లె కాజ్‌వే
ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె కాజ్‌వే కూలిపోయి చాలా రోజులు అవుతునా ఇప్పటి వరకు ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. పెన్నానదిపై సోములవారిపల్లె వద్ద కాజ్‌వే నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు దిక్కుదివానం లేదు. కాజ్‌వే లేకపోవడంతో వాహనదారులతోపాటు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రొద్దుటూరు పరిధిలోని మీనాపురం రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది. ఇక్కడి రోడ్డుపై ప్రయాణించడం కష్టం కావడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలే రోడ్డుపై ఉన్న గులకరాళ్లను ఎత్తివేసుకుని వెళ్తున్నారు.
 
సోమశిలకు పూర్తి నీరు వస్తే 20 గ్రామాలకు ఇక్కట్లు

అట్లూరు మండల పరిధిలోని సగిలేరు లో లెవెల్ వంతెనతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్ 72 టీఎంసీలు ఉన్నప్పుడు సగిలేరు ప్రాజెక్టులోకి నీరు వచ్చి లోలెవెల్ కాజ్‌వేపై ప్రవహిస్తున్నాయి. దాదాపు రెండు అడుగుల మేర నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. అట్లూరు మండలంలోని వేమలూరు,  ముతుకూరు, కామసముద్రం, మాడపూరు, మన్నెంవారిపల్లి, కమలకూరు పంచాయతీలలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్‌వేపై నీరు ప్రవహిస్తున్న సమయంలో అట్లూరుకు రావాల్సి వస్తే ... ప్రజలు బద్వేలు మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో 32 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తేనే మండల కేంద్రానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కాజ్‌వే ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
 
సగంలోనే ఆగిపోయిన నందలూరు ఆర్‌ఎస్ రోడ్డు

రాజంపేట పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు  పలు చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రత్యేకంగా సుండుపల్లి-పీలేరు మార్గంలో మెటల్ రోడ్డు అధ్వానంగా తయారైంది. అలాగే నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు పూర్తి చేయకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించి సగం వరకు మాత్రమే పూర్తి చేశారు. మిగతా సగం పూర్తి చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
 
అటకెక్కిన నాలుగులేన్ల రహదారి
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నంద్యాల-పలమనేరు మధ్య నాలుగు లేన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.1100 కోట్ల వ్యయంతో టెండర్ల వరకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టు అటకెక్కింది. నంద్యాల నుంచి కోవెలకుంట్ల, జమ్మలమడుగు, పులివెందుల, కదిరి మీదుగా పలమనేరుకు కలిపి బెంగుళూరు జాతీయ రహదారికి కలిపేలా ప్రణాళిక రూపొందించారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్ విస్మరించింది. దానికి సంబంధించిన ఫైళ్లను పక్కన పడేశారు.
 
తక్కువగా నిధులు
జిల్లాలో పల్లె సీమల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి నిధులు సక్రమంగా రావడం లేదు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నిధులు విడుదల చేయడం లేదు. ఆర్‌అండ్‌బీతోపాటు పంచాయతీరాజ్‌కు కూడా నిధులు విడుదల కాకపోవడంతో పనులకు బ్రేక్ పడుతోంది. చాలా చోట్ల గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు కూడా బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులకు మోక్షం కల్పించేందుకు పాలకులు, అధికారులు తగినన్ని నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement