సాక్షి, హైదరాబాద్/ ఏజీ వర్సిటీ: ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ రోడ్లకు మహర్దశ తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, రాష్ట్రంలో 67వేల కి.మీ. మేర ఉన్న పీఆర్ రోడ్ల అభివృద్ధిలో ఇంజనీరింగ్ అధికారులు భాగస్వాములు కావాలన్నారు.
టీఎస్‌ఐఆర్డీ పీఆర్ కార్యనిర్వాహక, పర్యవేక్షక ఇంజనీర్లకు రోడ్ల అభివృద్ధి, నిర్వహణపై శనివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఇందుకోసం రూ.3 వేల కోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మరో రూ.3 వేల కోట్లతో అవసరాన్ని బట్టి ప్రాధాన్యత గల కొత్త రోడ్లను గుర్తించి వచ్చే ఏడాదికీ ప్రతిపాదనలు ఇప్పటినుంచే సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖ రీ ఆర్గనైజేషన్ కోసం అనుభవజ్ఞుల సూచనలు, సలహాలతో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల విషయంలో సమస్యలు గుర్తించి ఈఎన్‌సీ దృష్టికి తేవాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బీటీ రోడ్ల ఏర్పాటు కోసం ఇతర దేశాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు.
బీటీ రోడ్లకు మెటీరియల్‌ను వైజాగ్ నుంచి రప్పించడంతో రవాణా ఖర్చు పెరుగుతున్నందున రాష్ట్రంలో స్టాక్ యార్డ్ ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. పీఆర్, ఆర్‌డీ శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఈనెల 22లోగా ప్రతిపాదనలు సమర్పించాలని, వెంటనే పాలనాపరమైన అనుమతి మంజూరు చేస్తామని చెప్పారు. టెండర్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేసి డిసెంబర్ 10 వరకు పనులు గ్రౌండ్ కావాలని ఇంజనీర్లకు సూచించారు.
పెండింగ్ ఉపాధి వేతనాలు విడుదల చేయండి
రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న ఉపాధిహామీ కూలీల వేతనాలు రూ.110.35 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తిచేశారు. ఈమేరకు శనివారం ఆయన లేఖ రాశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీ పనులు చేసిన వారికి వేతనాలు విడుదల కాలేదని తెలిపారు. రెండు నెలలుగా 1.25 లక్షల మంది ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎర్రబెల్లి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment