పల్లెల్లో ప్రగతి దారులు
ఏలూరు : జిల్లాలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి మూడేళ్ల అనంతరం మోక్షం కలగనుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన (పీఎంజీఎస్‌వై) కింద రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమం పట్టాలెక్కనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర రవాణా అవసరాలు పెరిగే అవకాశం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రోడ్ల పరిస్థితిని అంచనా వేసి పీఎంజీఎస్‌వై పథకం కింద ఆయూ రహదారులను అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా అవసరాలను అంచనా వేయడం ద్వారా వివిధ రహదారులకు మార్కులు వేస్తారు.
ఆ మార్కుల ఆధారంగా సంబంధిత రహదారులను దశలవారీగా విస్తరించేందుకు పీఎంజీ ఎస్‌వై ఫేజ్-2 కింద పనులు చేయడానికి రంగం సిద్ధమైంది. 2014-15 సంవత్సరానికి గాను జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 16 పనులు చేపట్టాలని నిర్ణరుుంచారు. ఇందుకు రూ.60 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ నిధులు ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యూరుు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అంచనాలను పూర్తిస్థాయిలో రూపొందించలేదు. ఎన్నికలు ముగిసి పాలన గాడిన పడిన నేపథ్యంలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన అంచనాలను వడివడిగా పూర్తిచేసి టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. జూలై నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబర్ నుంచి పనులను ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.
నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే...
పీఎంజీఎస్‌వై పథకం కింద అభివృద్ధి చేసిన రహదారుల నిర్వహణ బాధ్యతను ఐదేళ్లపాటు సంబంధిత కాంట్రాక్టరే చూడాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్ల పనుల్లో నాణ్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. ఈ పనులను త్వరితగతిన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.వేణుగోపాల్ తెలిపారు.