అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. వీటి ప్రగతి, అమలు చేయబోతున్న కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా బ్లూప్రింట్ రూపొందించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని వివరించాలని సూచిం చారు. దాదాపుగా మూడు నెలలపాటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిధ శాఖల ద్వారా అమలు చేసే కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మలేరియా, డెంగ్యూ, అతిసార వంటి అంటు వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో శంకరరావును కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు.
విత్తనాలు సకాలంలో అందించాలి
ఖరీఫ్‌కు విత్తనాలు, ఎరువులు సక్రమంగా రైతులకు అందేలా చూడాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 5 నుంచి 12 తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులకు సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లోనూ విద్యార్థులకు వీటిని సకాలంలో అందజేయాలని ఆ శాఖ జేడీ మల్లికార్జునరావును ఆదేశించారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులు తమ పరిధిలోని పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్లు చెల్లింపులకోసం రైతులు, ప్రజల కు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన జారీ చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు.
పెండింగ్ బిల్లులను సమర్పించండి
సాధారణ ఎన్నికలకు సంబంధించి వివిధ పనులు చేసి ఏమైనా బిల్లులు పెండింగ్ ఉంటే వెంటనే ఆయా సంస్థలు, యాజమాన్యాలు కలెక్టరేట్‌కు సమర్పించి బిల్లు చెల్లింపులను పొందాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఓ ప్రకటనలో కోరారు. ఇప్పటికే 90 శాతం చెల్లింపులు పూర్తి చేశామని పేర్కొన్నారు.
7 తేదీలోగా కార్యాచరణ ప్రణాళిక అందించాలి
రాష్ట్ర విభజన సందర్భంగా నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్య, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, డ్వామా తదితర శాఖలన్నీ ప్రాధాన్యతల మీద కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 7 తేదీ సాయంత్రంలోగా సీపీవోకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ టి.బాబూరావునాయుడు, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, డీఆర్వో కె. ప్రభాకర్‌రావు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు కె.వేణుగోపాల్, పి. శ్రీమన్నారాయణ, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, సాంఘిక సంక్షేమశాఖ జేడీ లు వి.సత్యనారాయణ, డాక్టర్ జ్ఞానేశ్వరరావు, మల్లికార్జునరావు పాల్గొన్నారు.