అభివృద్ధి, సంక్షేమం అజెండా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ అన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రహదారుల మరమ్మతులు, విస్తరణ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి జిల్లాకు రూ. 1821.95 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆసరా పథకం కింద ఇప్పటివరకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 3,65,813 పింఛన్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
దీంతోపాటు పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో 9,40,092 ఆహార భద్రత కార్డులను జారీ చేసినట్లు వివరించారు. కార్డుల జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకని సోమవారం ఉదయం పోలీస్‌పరేడ్ మైదానంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఎస్పీ వి.శివకుమార్‌తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అసిస్టెంట్ కలెక్టర్ అద్వైత్ సింగ్‌సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దాదాపు 25 నిమిషాలు ప్రసంగించిన కలెక్టర్ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగం ఆమె మాటల్లోనే...
ఒక్కో మనిషికి వంద లీటర్ల మంచినీళ్లు
మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలో రాబోయే ఐదేండ్లలో 5,939 చెరువులను విడతలవారీగా పునరుద్దరించనున్నాం. ఈ ఏడాది 1188 చెరువులను మరమ్మత్తులు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించాం. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతోపాటు ఒక్కో మనిషికి 100 లీటర్ల చొప్పున స్వచ్చమైన తాగునీరు అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నాం.
నూతన వధువులూ...‘నజరానా’అందుకోండి
నిరుపేద ఎస్సీ, ఎస్టీల కోసం కళ్యాణలక్ష్మి, మైనారిటీ యువతుల వివాహాలకు షాదీ ముబారక్ పథకాల కింద ప్రభుత్వం అందజేస్తున్న రూ.51 వేల ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలి. అట్లాగే దళితులకు భూ పంపిణీలో భాగంగా ఇప్పటివరకు 239 ఎకరాలను పంపిణీ చేయడంతోపాటు దాదాపు 1258 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించాం.
లోఓల్టేజీని నివారిస్తాం
జిల్లాలో విత్తనాలు, ఎరువులకు కొరత లేదు. రబీ సీజన్‌లో రూ.311.18 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 6890 హెక్టార్లలో డ్రిప్, 1550 హెక్టార్లలో స్ప్రింక్లర్లు సేద్యంలోకి తెచ్చుటకు లక్ష్యంగా నిర్ణయించాం. జిల్లాలో 3,66,817 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. లోవోల్టేజీ సమస్యల నివారణకు ఇరవై ఆరు 33/11, ఐదు 132/33, పది 220/132 కేవీ సబ్‌స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
ధాన్యం సేకరణలో మనమే ఫస్ట్
ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 581 కేంద్రాల ద్వారా 4.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఐకేపీ రుణాల రికవరీలోనూ కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 10,689 సంఘాలకు ఇప్పటివరకు రూ.352 కోట్లను మంజూరు చేయగా, 97.5 శాతం రుణాలను రికవరీ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డలేని రుణాల కింద రూ.68.48 కోట్లు స్వశక్తి మహిళా సంఘాల ఖాతాల్లో జమచేశాం. స్రీనిధి బ్యాంకు ద్వారా ఫోన్ చేసిన 48 గంటల్లోనే రుణాలు అందజేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.60.48 కోట్లను మంజూరు చేశాం.
పుష్కరాలకు భారీ ఏర్పాట్లు..
గోదావరి పుష్కరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ హరితహారం ద్వారా జిల్లాలో 6.24 లక్షల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 13 నియోజకవర్గాల్లో 40 లక్షల చొప్పున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
రోడ్లకు నిధుల వరద
జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, వెడల్పు పనులకు జిల్లాకు రూ.1318 కోట్ల నిధులు మంజూరు చేశాం. వీటికి టెండర్లు నిర్వహించి త్వరలో పనులు ప్రారంభిస్తాం. ప్రధానమంత్రి సడక్‌యోజన కింద రూ.74.48 కోట్లు, గ్రామీణ కొత్త రోడ్ల నిర్మా ణం కోసం మరో రూ.361.47 కోట్లు మంజూరయ్యాయి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ఈ ఏడాది రూ.289 కోట్ల అంచనాలతో 340197 పనులు మంజూరు చేశాం. సన్‌సద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిని అన్నిరకాలుగా అభివృద్ది చేస్తాం.
నెలాఖరులోగా క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి
ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న నిరుపేదలు ఈ నెల 31లోగా క్రమబద్దీకరణ చేసుకోవాలి. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నాం. డెంగీ, మలేరియా, విషజ్వరాలు, అతిసార వంటి అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నాం.
ప్రజా విజ్ఞప్తులకు ప్రాధాన్యత..
ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి ప్రాధాన్యతనిన్తున్నాం. ప్రతి సోమవారం ప్రజల నుంచి అందే దరఖాస్తులు, విజ్ఞప్తులను పరిష్కరిస్తున్నాం. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.