జిల్లా ప్రగతిపథంలో నడిపిస్తాం!
జిల్లా ప్రగతిపథంలో నడిపిస్తాం!
Published Wed, Mar 29 2017 9:50 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- అభివృద్ధిలో అగ్రగామిగా కర్నూలును తీర్చిదిద్దుతాం
– ఉగాది ఉత్సవంలో కలెక్టర్
కర్నూలు(కల్చరల్): హేవళంబి నామ సంవత్సరంలో కర్నూలు జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు. స్థానిక సునయన ఆడిటోరియంలో బుధవారం ఉదయం జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఉగాది ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టు, ఓర్వకల్లు విమానాశ్రయం తదితర అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రంలోనే కర్నూలును అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ హేవళంబి నామ ఉగాది సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా అధికార యంత్రాంగం పంచాంగ పఠనం, కవి సమ్మేళనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఒక పండగ వాతావరణాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులతో కర్నూలు జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారనున్నదన్నారు.
ఆకట్టుకున్న కవి సమ్మేళనం... అలరించిన నృత్యాలు...
ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హేవళంబి నామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలనే సందేశంతో కవులు దీవి హయగ్రీవాచార్యులు, స్వరూప్ సిన్హా, కవయిత్రులు విజయలక్ష్మి, మహాలక్ష్మి కవితాగానం చేశారు. సమకాలీన సమస్యలను మేళవిస్తూ కర్నూలు జిల్లా ప్రజల ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని వివరిస్తూ కవులు ఇనాయతుల్లా, డాక్టర్ పోతన చేసిన కవితాగానం చూపరులను అలరించింది. శారద ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జేసీ హరికిరణ్ కుమార్తె చిన్నారి లౌక్య సాధిక చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను మైమరిపించింది.
ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువే...
హేవళంబి నామ సంవత్సరంలో వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వర్షాలు కూడా ఆశాజనకంగానే కురస్తాయని పంచాంగ పఠనం చేసిన శశిభూషణ్ సిద్ధాంతి తెలిపారు. బుధవారం సునయన ఆడిటోరియంలో ఉగాది ఉత్సవ ప్రారంభంలో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హేవళంబి అనగా బంగారు వర్ణశరీరము కలది అనే అర్థముందని, ఈ సంవత్సరం ప్రజలకు శుభాలే ఎక్కువగా కలుగుతాయని పేర్కొన్నారు. చైత్రవైశాఖ శ్రావణ మాసాల్లో శుభముహూర్తాలున్నాయన్నారు.
ఉగాది విశిష్ట పురస్కారాలు...
హేవళంబి నామ ఉగాది ఉత్సవంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ఐదు మందికి జిల్లాకలెక్టర్ విజయమోహన్, జేసీ హరికిరణ్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. విజయభారతి, రాజేశ్వరమ్మ, డాక్టర్ విజయకుమార్, తుర్లపాటి వెంకట సుబ్రహ్మణ్యం, సాయి నిఖితశ్రీలకు ఈ విశిష్ట పురస్కారాలు అందజేశారు. వీరితో పాటు కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు, సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న శారదా సంగీత కళాశాల కళాకారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శారదా సంగీత కళాశాల ప్రిన్సిపల్ గోపవరం రామచంద్రన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కర్నూలు డీఆర్వో గంగాధర్ గౌడు, హౌసింగ్ పీడీ హుసేన్ సాహెబ్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, ఇన్‌చార్జి డీఈఓ తాహెరా సుల్తానా, సీపీఓ ఆనంద్ నాయక్ తదితర జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Advertisement