జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి
-
ఉగాది ఉత్సవాల్లో కలెక్టర్ పిలుపు
అనంతపురం సిటీ :
అభివృద్ధిలో అనంతను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ జిల్లా ప్రజలు, అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హేవిళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం కరువు కాటకాలతో విలవిలలాడుతున్న అనంతను అభివృద్ధి పథంలో నిలపాలన్న తపనతో ముందుకు వెళదామన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంచాంగ శ్రవణం ద్వారా వినిపించారని, ఇది సంతోషదాయకమని అన్నారు. కరువు నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ నాటికి లక్షకు పైగా ఫారంపాండ్లను నిర్మిస్తామన్నారు. గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో నీటి సంరక్షణ పనులకు రూ.2,006 కోట్లు ఖర్చు చేశామన్నారు. నాలుగు వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. అడిగిన వారికి గ్రామాల్లోనే పనులు కల్పిస్తూ వలసలను నియంత్రిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ తదితరులు మాట్లాడారు. జెడ్పీ సీఈఓ రామచంద్ర, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్, ఐసీడీఎస్ పీడీ జుబేదా బేగం తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
సకాలంలో వర్షాలు
హేవిళంబి నామ సంవత్సరంలో వర్షాలు సకాలంలో కురుస్తాయని, తక్కువ వర్షపాతమే అయినా రైతులకు చాలా ఉపశమనం ఉంటుందని వేద పండితులు వాసుదేవశాస్త్రి తెలిపారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆయన పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ ఏడాది ఎరుపు రంగు ధాన్యానికి మంచి బలం కనిపిస్తోందన్నారు. పాడి రైతులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయన్నారు. అందరూ సుభిక్షంగా ఉండేందుకు, అరిష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు సుదర్శన యాగం లాంటివి జిల్లా అధికార యంత్రాంగం చేయించాలని సూచించారు. రాజకీయంగా కూడా ఈ ఏడాది ‘అనంత’ కీలక స్థానంలో నిలుస్తుందన్నారు.
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
పంచాంగ పఠనం అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి నారాయణ, సడ్లపల్లి చిదంబరరెడ్డి, ఆశావాది ప్రకాశరావు, డీఎస్ సైబరాబాను తదితరులు కవితలు చదివి విన్పించారు. అనంతరం చిన్నారులు కూచిపూడి, భరత నాట్యంతో అలరించారు. పలువురు కళాకారులు, పండితులు, కవులను అధికారులు ఘనంగా సన్మానించారు.