అభివృద్ధికి ఐక్య మంత్రం
అభివృద్ధికి ఐక్య మంత్రం
Published Sun, Apr 23 2017 11:01 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
మేమంతా ఒకే టీం
– అధికారులు, ఉద్యోగులతో కలిసి జిల్లా ప్రగతికి కృషి
– నా వద్దకు వస్తే సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తా
– తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
– దీర్ఘకాలంలో విద్య, వైద్యం, పారిశ్రామికీకరణపై దృష్టి
– క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం
– ప్రాథమికరంగ మిషన్‌పై మంగళవారం సమావేశం
– ‘సాక్షి’తో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ నేను, జిల్లా అధికారులు, ఉద్యోగులు వేరు వేరు కాదు. మేమంతా ఒక టీం. మేమందరం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. నేను అనే భావన నా వద్ద ఉండదు. మనం అనే భావనతోనే పనిచేస్తాం. టీం స్పిరిట్‌తో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లాం’’ అని జిల్లా నూతన కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తానని, దగ్గరకు వెళ్లి వాస్తవ పరిస్థితిని గమనించకుండా సమస్యలను పరిష్కరించడం కూడా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ వద్దకు వెళ్లి సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందనే నమ్మకాన్ని కలిగించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తక్షణం తాగునీటి సమస్యను పరిష్కరించాల్సి ఉందని గుర్తించానని, దీర్ఘకాలంలో విద్య, వైద్యం, పారిశ్రామికీకరణపై దృష్టి సారిస్తానని వివరించారు. ప్రాథమికరంగ మిషన్‌పై వ్యవసాయ, అనుబంధరంగాల అధికారులతో మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న 24 గంటల తర్వాత సాక్షి ప్రతినిధితో సత్యనారాయణ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే....
నేను కిందిస్థాయి వర్కర్‌ను..!
మొదట్లో నాకు కేంద్ర సర్వీసు...ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐఐఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే, నాకు మన రాష్ట్రంతో ఉన్న అనుబంధంతో ఆ సర్వీసులో ఎక్కువకాలం పనిచేయలేదు. గ్రూప్స్ రాసి ఇక్కడ ఆర్డీవోగా 1996లో ఉద్యోగం ప్రారంభించాను. నేను ఇప్పటివరకు కిందిస్థాయిలోనే అంటే క్షేత్రస్థాయిలోనే ఎక్కువ పనిచేశాను. జెడ్పీ సీఈవోగా, ఐటీడీవో పీవోగా, ఆర్డీవోగా, డ్వామా పీడీగా.... ఇలా కిందిస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకునే వీలు ఉండే పోస్టుల్లోనే పనిచేశాను. దీంతో వాస్తవ పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు ఎక్కువ దోహదపడింది. హెడ్ ఆఫీసు పోస్టింగుల్లో నేను ఇప్పటివరకు పనిచేయలేదు. ప్రజల మధ్యనే ఇప్పటివరకు పనిచేశాను. ఫలితంగా నాకు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కువ అవకాశం దొరికింది. దీనిని ఇప్పుడు అవకాశంగా మలుచుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.
ఇవీ నా ప్రాధాన్యతలు..!
తక్షణ ప్రాధాన్యత అంశంగా తాగునీటి సమస్యను గుర్తించాను. ఇందుకోసం అవసరమైన చర్యలను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాను. వీటితో పాటు పంట కుంటలు, నీరు–చెట్టు, మొక్కల పంపిణీ తదితరాలను తక్షణం చేపట్టాల్సిన ప్రాధాన్యతలుగా గుర్తించాను. దీర్ఘకాలంలో విద్య, వైద్యం, పారిశ్రామికీకరణతో పాటు ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగామ్స్‌ను ముందుకు తీసుకెళతాను. ప్రధానంగా విమానాశ్రయం ఏర్పాటు, సోలార్ పార్కు, ఐఐఐటీ, ఉర్దూ యూనివర్సిటీ తదితర అంశాల్లో ఇంకా ఉన్న సమస్యలను పరిష్కరించి వాటిని ప్రారంభించేదుకు ప్రయత్నిస్తాను. భూమి రికార్డుల విషయంలో అటు అనంతపురం, ఇటు తూర్పుగోదావరి జిల్లాలో నా హాయంలోనే కొత్త పథకాలు ముందుకు తీసుకొచ్చాం. ఆ తర్వాత మిగతా జిల్లాలో వీటిని అమలు చేశారు. జిల్లాలో పర్‌స్పెక్టివ్ అవసరం. ఇక్కడే చదివిన విద్యార్థిగా నాకు జిల్లాపై ఒక అవగాహన ఉంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.
కొత్త పంథా...!
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే తన మార్క్ పరిపాలనను సత్యనారాయణ మొదలుపెట్టారు. కలెక్టర్ కుర్చీలో ఎక్కువ సమయం కూర్చోకుండా వెంటనే సమావేశ మందిరంలో జిల్లా అధికారులను పేరు పేరునా పరిచయం చేసుకున్నారు. కేవలం పరిచయాలతో సరిపెట్టకుండా ఆయా రంగాల్లో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించేందుకు ఆయా అధికారులతోనే బ్రీఫింగ్ ఇప్పించుకున్నారు. అక్కడికక్కడే ఆయా శాఖలల్లో ఉన్న సమస్యలను నోట్ చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే జిల్లా మీద ఒక అవగాహనకు వచ్చేందుకు కేవలం జిల్లా అధికారులతోనే కాకుండా నేరుగా మండలస్థాయి అధికారులైన ఎంపీడీవోలతోనే ఆయన ఫోన్‌లోనే మాట్లాడారు. అంతేకాకుండా పరిపాలనలో మూడు కోణాలు ఉంటాయని.... కిందిస్థాయి వారు చేసేవి అన్నీ తప్పు అనే ధోరణి, నాకు చేతకాదు అనే ధోరణి, నేను చేయగలను...మీరు చేయగలరనే మూడో రకం ధోరణి. నా పరిపాలన ధోరణి మూడోరకమని గడిచిన 24 గంటల్లోనే ఆయన స్పష్టంగా తేల్చిచెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement