తిప్పనపల్లెలో చిన్నారుల మృతదేహాల వద్ద నివాళులు అర్పిస్తున్న జెడ్పీ చైర్మన్
అభివృద్ధిని అడ్డుకుంటున్న కలెక్టర్
Published Thu, Sep 8 2016 10:50 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ విమర్శ
తిప్పనపల్లె(చాగలమర్రి): వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జిల్లాకు మంజూరైన రూ. 100 కోట్ల కేంద్ర నిధులను జిల్లా కలెక్టర్ విడుదల చేయకుండా అభివద్ధిని అడ్డుకుంటున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ విమర్శించారు. జెడ్పీ చైర్మన్ దత్తత గ్రామమైన తిప్పనపల్లెలో బుధవారం చెరువులో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం గ్రామానికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 వేల చొప్పున బాధితులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా ఉప ముఖ్యమంత్రితో కృషి చేస్తామన్నారు. గ్రామానికి చెందిన రోడ్డు గుంతలమయం కావడంతో చిన్నారులను తొందరగా ఆసుపత్రికి తీసుకోలేక పోయామని గ్రామస్తులు జెడ్పీ చైర్మన్‌తో చెప్పగా.. నిధులు అందక దత్తత గ్రామంలో అభివృద్ధి చేయలేక పోతున్నామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చెబుతుంటే జిల్లా అధికారులు పట్టించు కోవడం లేదని విమర్శించారు. జిల్లా అధికారులు వారు దత్తత తీసుకొన్న గ్రామాలకు తప్పా.. ప్రజాప్రతినిధులు దత్తత తీసుకొన్న 120 గ్రామాలకు నిధులు మంజూరు కావడం లేదన్నారు. ఓడీఎఫ్ కింద ఇచ్చిన రూ. 100 కోట్లు వెనుక బడిన ప్రాంతాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తిప్పనపల్లె రోడ్డు నిర్మాణానికి రూ. 20 లక్షలు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యుడు బాబుబాల్, ఎంపీడీఓ శ్రీలత, తహశీల్దార్ ఆంజనేయులు, ఎంఈఓ అనురాధ, సర్పంచ్ మస్తాన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్‌రాంరెడ్డి, గ్రామ నాయకులు ఓబుల్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement