పెద్దాసుపత్రి ప్రగతికి ‘గ్రీన్’ సిగ్నల్
పెద్దాసుపత్రి ప్రగతికి ‘గ్రీన్’ సిగ్నల్
Published Sat, Nov 19 2016 10:35 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
–అత్యవసర పరికరాల కోసం రూ.5.5కోట్లు
–ఆసుపత్రిలో పచ్చదనం పెంపునకు రూ.50లక్షలు
–అవుట్‌సోర్సింగ్‌లో స్ట్రెచ్చర్ బాయ్స్ నియామకం
- తీర్మానాలకు ఆమోదం తెలిపిన జిల్లా కలెక్టర్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రగతికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్..గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సూచించిన అజెండాలోని తీర్మాలన్నింటికీ ఆమోదం తెలిపారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం మోర్టాన్‌హాల్‌లో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన జరిగింది. వర్కింగ్ చైర్మన్ జి. మంజునాథరెడ్డి, సభ్యులు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కె. అనురాధ, కె. మహేష్‌గౌడ్, ఎం. శ్రీనివాసులు, పి. రవికుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నూతన సభ్యుల ఎన్నికకు జీవో రావడంతో సమావేశం నిర్వహించడం ఆలస్యమైందన్నారు. గత సమావేశంలో 17 తీర్మానాలు చేశామని, అందులో 10 పూర్తి చేశామన్నారు. ఆసుపత్రిలో గార్డెనింగ్ కోసం రూ.50లక్షలు మంజూరు చేస్తామని, పనులను మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. రెండురోజుల్లో ఇందుకు సంబంధించి రూ.25లక్షలు బదిలీ చేస్తామన్నారు. ధోబీఘాట్, క్యాంటీన్లకు సంబంధించి అగ్రిమెంట్ డిసెంబర్‌లో ముగుస్తుందని, ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆసుపత్రులో పందులను పెంచి పోషించేది ఇక్కడి సిబ్బందే అని తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు వెనుకాడబోమన్నారు. ఆసుపత్రిలోని రోగులకు ఇకపై ప్యాకింగ్ చేసిన బ్రెడ్‌నే ఇవ్వాలని ఆదేశించామన్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం ఆసుపత్రిలో జరిగే అభివృద్ధి, సమస్యలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇకపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, వచ్చే సమావేశం జనవరిలో ఉంటుందన్నారు.
కొత్తగా చేసిన తీర్మానాలు ఇవే...!
1. రిపేరిలో ఉన్న మూడు ఆర్‌వో ప్లాంట్ల మరమ్మతు
2. అవుట్‌సోర్సింగ్ విధానంలో స్ట్రెచ్చర్ బాయ్స్ నిర్వహణ
3. అత్యవసర పరికరాల కొనుగోలుకు రూ.5.5కోట్లు మంజూరు
4. ఆసుపత్రి ముందుగా ఉన్న షాపులను తొలగించి, వాటి స్థానంలో ఆసుపత్రి ఆవరణలో ఓ చోట నిర్మాణం
5. సీటీ సర్జరీ కార్పస్ ఫండ్‌కు రూ.5లక్షలు
6. ఎంసీహెచ్ బ్లాక్ వద్ద 250 కేవీ జనరేటర్ కొనుగోలు
7. ఏఎంసీ విభాగానికి 10 వెంటిలేటర్ల కొనుగోలు
8. ఎన్‌టీఆర్ వైద్యసేవలో చికిత్స పొందే రోగులు ఖర్చు పెట్టే మొత్తం తిరిగి చెల్లింపు
9. బ్లడ్‌బ్యాంకులో అవుట్‌సోర్సింగ్ సిబ్బంది రెన్యువల్
10. రెండువారాల్లో ఆసుపత్రి నుంచి పందులు, కుక్కలు తరలింపు
11. త్వరలో పార్కింగ్ టెండర్
12. ప్రైవేటు సంస్థల సహకారంతో ఆసుపత్రిలోని ఐదు ఎకరాల్లో ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా సోలార్‌ప్లాంట్ ఏర్పాటు
Advertisement