సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్షాలు, వరదలకు జిల్లాలోని గ్రామీణ రహదారులు గుల్లయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం ఇటీవలి వానలు, వరదలతో 139 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 17 మండలాల్లో 107 రోడ్లు కోతకు గురయ్యాయని అధికారుల అంచనా. ఈ మేరకు రూపొందించిన నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపింది. మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరింది.
గుండాలలో ఎక్కువ నష్టం
వానలు, వరదలతో నష్టపోయిన రోడ్ల వివరాలను పరిశీలిస్తే ఎక్కువగా గుండాల మండలంలో 24.14 కి.మీ మేర
రోడ్లు దెబ్బతిన్నాయి. వీఆర్‌పురంలో 18.40, అశ్వారావుపేటలో 16.50 కి.మీ రోడ్లు కొట్టుకుపోయాయి. వెంకటాపురంలో కూడా 11.40 కిలోమీటర్ల రోడ్డు కొట్టుకుపోయిందని, ఈ రోడ్లను శాశ్వతంగా మరమ్మతులు చేసేందుకు 2.75 కోట్ల నిధులు అవసరమని అధికారులు లెక్కలు కట్టారు. చర్లలో నష్టపోయిన 9.35 కిలోమీటర్ల రోడ్లకు దాదాపు మూడు కోట్లు అవసరమవుతాయని అంచనా.
దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో రూ.కోటిన్నర చొప్పున, బూర్గంపాడులో రూ.1.10 కోట్లు, మొత్తంగా చూస్తే 139 కిలోమీటర్ల మేర పాడయిన ఈ రోడ్లను తాత్కాలికంగా బాగు చేయాలంటే రూ.2.5 కోట్లు, శాశ్వత ప్రాతిపదికనైతే రూ.16.50 కోట్లు అవసరం అవుతాయి. ఈ నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.
ఒక రోడ్డు..11 కిలోమీటర్లు
రోడ్ల వారీగా చూస్తే పదికిపైగా రహదారులు ఐదు కి.మీ కన్నా ఎక్కువగా పాడయ్యాయని అధికారుల నివేదిక. గుండాల మండలకేంద్రం నుంచి శెట్టిపల్లి 22 కి.మీ రోడ్డులో సగం అంటే 11 కిలోమీటర్లు దెబ్బతింది. ఇప్పుడు ఈ మార్గం ప్రయాణీకులకు నరకం చూపిస్తోంది. గుండాల మండలంలోనే మామకన్ను నుంచి అల్లపల్లి వెళ్లే రోడ్డు 3.5 కిలోమీటర్ల మేర దెబ్బతింది. కూనవరం మండలంలోని టేకులబోరు నుంచి చట్టి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు ఐదు కిలోమీటర్లు దెబ్బతింది.
వి.ఆర్‌పురం మండలంలోని ములకనపల్లి - వీరబాపని కుంట, రేఖపల్లి బీసీకాలనీ నుంచి చింతరేగుపల్లి, శ్రీరామగిరి నుంచి కల్తనూరులకు వెళ్లే రోడ్లు నాలుగు కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. వీఆర్‌పురం నుంచి శ్రీరామగిరి వెళ్లే నాలుగు కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. చర్ల మండలంలో తాలిపేరు బ్రిడ్జి నుంచి సి.కత్తిగూడెం వెళ్లే తొమ్మిది కిలోమీటర్లలో ఐదు కి.మీ రోడ్డు కొట్టుకుపోయింది. ఇలా 107 రోడ్లు వివిధ మండలాల్లో దెబ్బతిన్న నేపథ్యంలో వీటి మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్లు గుల్ల
Published Mon, Sep 15 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement