అభివృద్ధి జాడేది?
అభివృద్ధి జాడేది?
Published Mon, Dec 19 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
ప్రచార ఆర్భాటంగానే స్మార్ట్ సిటీ
ప్రజలపై దండయాత్ర చేస్తున్న దోమలు
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అవసరం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కమిషనర్‌కు పార్టీ నేతల వినతి పత్రం
కాకినాడ : స్మార్ట్ సిటీగా ఎంపికయిందన్న ప్రచారమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడంలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఆకర్షణీయ నగరంగా ఎంపికయ్యాక ఏడాది ఉత్సవాలు కూడా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు తీరు కేవలం ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోందన్నారు. భూగర్భ డ్రెయినేజీ, స్మార్ట్ సిటీ, నగరంలోని ప్రధాన సమస్యలపై వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం కమిషనర్ అలీమ్‌బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలంతా సమావేశమై సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న డ్రెయినేజీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్‌సిటీని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు. నగరంలో అభివృద్ధి కుంటుపడింది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో హంగామా చేస్తున్నప్పటికీ వాస్తవానికి దోమలే ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయన్నారు. ఎక్కడా ఫ్యాగింగ్ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదన్నారు.
సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని ప్రాతిపదికగా తీసుకుని అభివృద్ధి చేయడంలేదని విమర్శించారు. కేవలం మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లోనే పనులు చేపట్టడం ద్వారా మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రెయినేజీ రోడ్డుకన్నా ఎత్తులో చేపట్టారని, దీనివల్ల ముంపు సమస్య యథావిధిగానే కొనసాగుతుందన్నారు. సరైన ప్రణాళికతో డ్రెయినేజీ పనులు చేపట్టాలని సూచించారు. వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ర్యాలి రాంబాబు, మాజీ కౌన్సిలర్ బొట్టా కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చాట్ల చైతన్య, బెజవాడ బాబి, చిలుకూరి మనోజ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రసాదరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement