స్మార్ట్ డివిజన్లు... మళ్లీ తెరపైకి
► అధికారుల కసరత్తు
► టక్కర్ ఆదేశాలతో హైరానా
► తొలి విడత నాలుగు డివిజన్ల ఎంపిక!
► వెంటాడుతున్న నిధుల కొరత
విజయవాడ సెంట్రల్ : రాజధాని నగరంలో స్మార్ట్ డివిజన్ల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకోసం నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెలైట్ ప్రాజెక్ట్‌గా నాలుగు డివిజన్లను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నారు. స్మార్ట్ సిటీల్లో స్థానం దక్కించుకోలేని విజయవాడపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది అక్టోబర్ 15న నగరంలో స్మార్ట్ డివిజన్లను ఎంపిక చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్ర టరీ టక్కర్ ఆదేశాలు జారీ చేశారు.
నగ రపాలక సంస్థ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్మార్ట్ డివిజన్ల ఏర్పాటుపై ఎందుకు దృష్టిపెట్టలేదంటూ టక్కర్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో అధికారుల్లో హైరానా మొదలైంది. కమిషనర్ జి.వీరపాండియన్ స్మార్ట్ డివిజన్ల ఎంపిక బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించారు.
స్మార్ట్ డివిజన్లు అంటే...
ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి. తడి, పొడి చెత్త విభజన చేయాలి. ఆధునిక హంగులతో పార్కులను తీర్చిదిద్దాలి. పచ్చదనాన్ని పెంపొందించాలి. నిరంతర నీటి సరఫరా జరగాలి. కుళాయిలకు నీటి మీటర్లు అమర్చాలి. రహదారులు అభివృద్ధి చేయాలి. విద్యుత్ దీపాల వెలుగులు సక్రమంగా ఉండాలి. అప్పుడే ఆ డివిజన్‌ను స్మార్ట్ (ఆకర్షణీయమైనది)గా గుర్తిస్తారు. దీనిని సాధించేందుకు ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుంది. కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో స్మార్ట్ డివిజన్ల ఎంపిక బాధ్యతను చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, చీఫ్ ఇంజనీర్ ఎం.ఏ.షుకూర్, ఏడీహెచ్ జీపీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. తొలి విడతగా సర్కిల్-3లో రెండు, సర్కిల్-1, 2లలో ఒక్కోటి చొప్పున మొత్తం నాలుగు డివిజన్లను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
అమలు సాధ్యమేనా!
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న నగరపాలక సంస్థలో ప్రతినెలా జీతాల కోసం వెతుకులాట సాగించాల్సిన దుస్థితి నెలకొంది. 59 డివిజన్ల పరిధిలో సుమారు 132 పార్కులు ఉన్నాయి. నిధుల లేమి కారణంగా 70 శాతం పార్కులు కళావిహీనంగా తయారయ్యాయి. రాజీవ్‌గాంధీ, కేఎల్‌రావు, రాఘవయ్య పార్కుల అభివృద్ధికి కోటి రూపాయల హడ్కో నిధులు ఇచ్చింది. డివిజన్లలో చిన్న పార్కుల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరినప్పటికీ స్పందన రాలేదు. ఇక పారిశుధ్య విషయానికి వస్తే ఇంటింటి చెత్త సేకరణ 70 శాతం మించి జరగడం లేదు. చెత్త విభజన కొన్ని డివిజన్లకే పరిమితమైంది.
కృష్ణమ్మ చెంతనే ఉన్న నగరవాసులకు దాహం కేకలు తప్పడం లేదు. సర్కిల్-3 పరిధిలోని రామలింగేశ్వర నగర్ 10 ఎంజీడీ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంతో సర్కిల్-3లో అత్యధిక డివిజన్లలో మురుగునీరు సరఫరా అవుతోంది. కొండ, శివారు ప్రాంతాల్లో నీరు సక్రమంగా అందడం లేదు. కుళాయిలకు నీటి మీటర్లు ఏర్పాటు చేయలన్న ప్రతిపాదనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో స్మార్ట్ డివిజన్ల ఏర్పాటు సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.