సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు జైపూర్‌లో పాల్గొననున్న సభకు కేవలం జనాన్ని సమీకరించడం కోసమే రాజస్థాన్ ప్రభుత్వం 7.23 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నది. ఆహారం, వసతి ఏర్పాటు చేయడానికి ఇంతకన్నా ఎక్కువ సొమ్మును వెచ్చించనున్నట్లు తెల్సింది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి మీడియాకు చిక్కడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పలు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలను ప్రధాని సభకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. వీరందరికి రవాణా సౌకర్యంతోపాటు ఆహారం, వసతి సౌకర్యాలు జైపూర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకరావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,579 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పథకాల లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించడంతోపాటు స్మార్ట్‌సిటీ కార్యక్రమం పేరట ఓ ర్యాలీని కూడా ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి సభకు మరో ఐదువేల మంది లబ్ధిదారులను పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరుతూ బర్మర్ జిల్లా యంత్రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 24 లక్షల రూపాయల చెక్కును పంపించింది.
ఇక ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మహిళలను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇచ్చింది. ప్రధానితోని ప్రశాంతంగా సానుకూలంగా మాట్లాడాలని కోరారు. వారిలో మంజూదేవి కూడా ఉన్నారు. ‘నాకు కూతురు పుట్టినందుకు రాజ్‌శ్రీ యోజన కింద రెండున్నర వేల రూపాయల చొప్పున రెండు వాయిదాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకున్న నేను 50 వేల రూపాయలు తీసుకున్నానని ఎలా చెబుతాన’ని ఆమె స్పష్టం చేయడంతో గురువారం నాడు ఆమెను ప్రధానితో మాట్లాడే వారి జాబితా నుంచి తొలగించారు. ప్రధానితో మాట్లాడే ఐదుగురికి తర్ఫీదు ఇచ్చినట్లు రాజస్థాన్ సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ సత్యనారాయణ చౌహాన్ అంగీకరించారు. ప్రధానితో మాట్లాడేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి కూడా విద్యార్థినులను ఎంపిక చేస్తున్నామని ఆయన తెలిపారు.
వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధి పొందిన రాజస్థాన్ వాసుల్లో 90 శాతం మంది బీజేపీ కార్యకర్తలే ఉన్నారని, రానున్న రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment