గృహ, స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి దన్ను | Proceeds of Hudco IPO will go to government: M Ravi Kanth, Hudco | Sakshi
Sakshi News home page

గృహ, స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి దన్ను

Published Wed, May 24 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

గృహ, స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి దన్ను

గృహ, స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి దన్ను

హడ్కో సీఎండీ మేడిది రవికాంత్‌
మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తున్నాయి
మా నికర ఎన్‌పీఏ కేవలం 1.51 శాతమే
ప్రభుత్వ రుణాల్లో కేవలం 0.75% ఎన్‌పీఏ
తెలుగు వ్యక్తి సారథ్యంలో హడ్కో కాంతులు


కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు 2022 నాటికి అందరికీ ఇళ్లు,  100 స్మార్ట్‌ సిటీల నిర్మాణం.. ఈ రెండు లక్ష్యాలను సాధించేందుకు చేయూతనిస్తానంటోంది హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో). ఇటీవలే స్టాక్‌మార్కెట్‌లో లిస్టయిన హడ్కో బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందంటున్నారు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మేడిది రవికాంత్‌. కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అయిన రవికాంత్‌ తెలుగు వారే కావడం విశేషం. మూడేళ్లుగా హడ్కోకు సారథ్యం వహిస్తున్న రవికాంత్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆ సంస్థ పనితీరు, భవిష్యత్‌ కార్యాచరణను పంచుకున్నారు. ముఖ్యాంశాలు...

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్రు రెవెన్యూ పరిధిలోని మైజారుగుంట అనే ఓ కుగ్రామం మాది. విద్యాభ్యాసం అంతా పంచాయతీ పాఠశాలల్లోనే సాగింది. ఆ తరువాత నర్సాపూర్‌లో చదువుకున్నా. ఆంధ్రాయూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీజీ, పీహెచ్‌డీ చదివా. ఆ తరువాత 1986లో ఐఏఎస్‌కు సెలెక్ట్‌ అయ్యా. కేరళ క్యాడర్‌లో పనిచేశా. ఆ తరువాత ఢిల్లీలో ఎక్కువ కాలం ఉన్నాను. ఆటమిక్‌ ఎనర్జీ, కార్మిక శాఖ, అపెడా, విద్యుత్తు శాఖ, సామాజిక న్యాయ శాఖ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేశా.

సాక్షి, న్యూఢిల్లీ
హడ్కో ఇటీవలే స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. హడ్కో ఐపీవో దాదాపు 80 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఈ స్పందన మీపై మరింత బాధ్యతను పెంచిందనొచ్చా?
ధన్యవాదాలు. హడ్కో పనితీరుకు ఇది అద్దంపడుతుంది. ఐపీఓ చాలా గొప్ప విజయం. దీని కోసం చాలా శ్రమించాం. 2016 మధ్యకాలంలో సీసీఈఏ అనుమతి లభించినప్పటి నుంచి మా కృషి ప్రారంభించాం.  మదుపరుల విశ్వాసం చూరగలిగాం. మరింత బాధ్యతగా భావించి ముందు ముందు మరింత కృషితో సంస్థను ముందుకు తీసుకెళతాం.

ఇంత స్పందనకు కారణమేంటి?
గృహ నిర్మాణ రంగానికి, పట్టణ మౌలిక సదుపాయాల కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. గృహ నిర్మాణానికి 35 శాతం, మిగిలినది పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుత్తు సరఫరా, మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాజెక్టులకు రుణాలు ఇస్తాం. అలాగే నీటి సరఫరా ప్రాజెక్టులకు, పాఠశాలలు, వైద్య కళాశాలలు, రహదారులు, వంతెనలకు కూడా రుణాలు ఇస్తున్నాం. మిషన్‌ భగీరథ, సీఆర్‌డీఏ వంటి ప్రాజెక్టులకు ఇచ్చాం. ఇచ్చిన రుణం తిరిగి రావడం కూడా మా విజయానికి కారణంగా చెప్పొచ్చు. రూ. 11 లక్షల లాభంతో ప్రారంభమైన హడ్కో ఇప్పుడు రూ. 1000 కోట్ల లాభాలు ప్రకటించింది.

ఈ స్పందనను నిలబెట్టుకోవడానికి మీ ప్రణాళికలు ఏంటి?
మాకు ఆథరైజ్‌ క్యాపిటల్‌ రూ. 2,500 కోట్లు ఉంది. పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌ రూ. 2,002 కోట్లు ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ కంపెనీ. వాటాలో పట్టణ పేదరిక నిర్మూలన శాఖ(హుపా) 70 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ 20 శాతం, పట్టణాభివృద్ధి శాఖ 10 శాతం చొప్పున కలిగి ఉన్నాయి. హుపాకు చెందిన 70 శాతం నుంచి 10 శాతం ఉపసంహరించుకోవడం ద్వారా రూ. 1,200 కోట్ల సమీకరణకు ఐపీఓకు వెళ్లాం. ఈ నిధులు కేంద్రానికి సమకూరుతాయి. మా కంపెనీకి తగినంత ఈక్విటీ ఉంది. ఆ నిధులు మాకు అవసరం లేదు. అయితే తాజా స్పందన చూసిన తరువాత మాపై బాధ్యత పెరిగినట్టయింది. ఈ బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. రుణ మంజూరు, బట్వాడా వేగం పెంచుతాం. ఫలానా రంగానికే రుణాలు ఇవ్వాలన్న ఆంక్షలు లేవు. పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణ రంగానికి సంబంధించి ఏ అంశానిౖ కైనా ప్రాధాన్యత ఇస్తాం.

సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చడంలో హడ్కో పాత్ర ఎలా ఉండబోతోంది?
 2022 నాటికి అందరికీ గృహాలు సమకూర్చాలన్న మిషన్‌ ఊపందుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం, క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్, అఫర్డబుల్‌ హౌసింగ్‌ యూనిట్లకు సబ్సిడీ, వ్యక్తిగతంగా ఇంటి నిర్మాణం లేదా అభివృద్ధి తదితర విభాగాల్లో కేంద్రం లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తోంది.  వీటిల్లో రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.3 లక్షల వరకు సబ్సిడీ అందుతుంది. సొంతింటి కలను నెరవేర్చడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. దీనికి నోడల్‌ ఏజెన్సీగా ఉన్న మేం ఈ సబ్సిడీ లబ్ధిదారుకు అందేలా చూస్తాం. రాష్ట్రాల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలు అందిస్తాం.

2022 నాటికి అందరికీ ఇల్లు మిషన్‌ విజయవంతానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి? ఏపీ, తెలంగాణలో ప్రగతి ఎలా ఉంది?
ఏ విధానంలోనైనా నిబంధనలకు లోబడి పనిచేయాలి. ఆయా పథకాల్లో లబ్ధి పొందాలంటే సంబంధిత రుణం మహిళ పేరు మీదగానీ, జాయింట్‌గా గానీ తీసుకోవాలి. భూమి టైటిల్‌ క్లియర్‌గా ఉండాలి. కొన్ని నిబంధనలకు లోబడి నిర్మాణాలు ఉండాలి. టైటిల్‌ డీడ్స్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకం అమలులో చొరవ తీసుకుంటున్నాయి. తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ దిశగా చర్యలు ఊపందుకున్నాయి.

హడ్కో నేరుగా ప్రజలకు హౌసింగ్‌ లోన్లు ఇస్తుందా?
అవును. దానికి మావద్ద హడ్కో నివాస్‌ అనే ఒక పథకం ఉంది. ఈ పేరు మీద రిటైల్‌ హౌసింగ్‌ లోన్లు ఇస్తాం. రీచింగ్‌ అన్‌రీచ్‌డ్‌ అన్న నినాదంతో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, మైనారిటీలు ఉన్న ఆవాసాలకు చేరడానికి ఈ రిటైల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ చేస్తున్నాం. హడ్కో నివాస్‌ విస్తరణకు కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలను సరళీకృతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు వడ్డీ తక్కువగా ఉండేలా చూస్తున్నాం. మా రుణాల్లో 96 శాతం  తక్కువ ఆదాయం కలిగిన వారికే ప్రయోజనం చేకూరుస్తున్నాయి.

పట్టణ వసతుల అభివృద్ధిలో, స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో మీ పాత్ర ఏంటి?
ఒకరకంగా మాది టెక్నో ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌. సివిల్‌ ఇంజనీరింగ్‌ తదితర అన్ని బ్రాంచీల్లో మాకు నిపుణులు ఉన్నారు. 47 ఏళ్ల అనుభవం ఉంది. మేం రుణ వితరణ పెంచుకునేందుకు స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ దోహదపడుతుంది. ఈ మిషన్‌లో ఏర్పాటయ్యే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌తో మేం ఒప్పందాలు కుదుర్చుకుంటాం. తద్వారా వాటిలో మేం భాగం తీసుకుంటాం. గృహ నిర్మాణానికి, పట్టణాభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. నీటి సరఫరా, రహదారుల అభివృద్ధికి రుణాలిస్తాం. ఇప్పటికే కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి  రుణం ఇచ్చాం. కాలికట్‌ ఎయిర్‌పోర్టుకు ఇచ్చాం.

హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలతో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు?
హడ్కో మొదట్లో ఒకటే ఉండేది. ఇప్పుడు గృహ నిర్మాణాలకు రుణాలు ఇచ్చే సంస్థలు దాదాపు 70 ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉంది. బ్యాంకులు కూడా మాకు పోటీయే. డీమానిటైజేషన్‌ వల్ల వాళ్లకు డిపాజిట్లు ఉన్నాయి. వాళ్లు కూడా చౌకగా రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేం మరింత కష్టపడాలి. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల చొరవ మాకు కలిసొస్తుంది. హడ్కోకు వాటితో ఉన్న సత్సంబంధాలు కలిసొస్తాయి.

భవిష్యత్తు ప్రాజెక్టులు ఏంటి? ప్రత్యేకించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా భోగాపురం తదితర విమానాశ్రయాలు రానున్నాయి. అలాగే అమరావతి ప్రాజెక్టు రానుంది. వాటికి రుణాలు అవసరం. అలాగే ఏపీలో టూరిజం ప్రాజెక్టులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మౌలికవసతుల స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో మిషన్‌ భగీరథకు గణనీయమైన స్థాయిలో రుణం ఇచ్చాం. హైదరాబాద్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయి.

దేశంలో మొండి బకాయిలు పేరుకుపోయిన పరిస్థితిలో బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి. హడ్కో పరిస్థితి ఏంటి?
బ్యాంకులతో పోలిస్తే హడ్కో పరిస్థితి బాధాకరంగా ఏమీ లేదు. 6.8% స్థూల ఎన్‌పీఏ ఉండగా.. 1.51%  నికర ఎన్‌పీఏ ఉంది. ప్రభుత్వంతో చేసిన బిజినెస్‌లో 0.75% ఎన్‌పీఏ. ఇది చాలా తక్కువనే చెప్పాలి. గత దశాబ్దంలో పవర్‌ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు 5–10% వాటిలో పెట్టుబడి పెట్టాం. రకరకాల కారణాల వల్ల ఆలస్యం కావడంతో అవి ఎన్‌పీఏలుగా పరిగణనలోకి వచ్చాయి. అది సాంకేతికమే. అంతేతప్ప అవి రావని కాదు. అప్పటివే ఇప్పుడు బాధించాయి. 2013 నుంచి మాత్రం ప్రైవేటు సంస్థలకు రుణాలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటి ఏజెన్సీలకు మాత్రమే ఇస్తూ వచ్చాం.

సామాజిక బాధ్యత కింద హడ్కో చేస్తున్న పథకాలు ఏంటి?
విశాఖలో నైట్‌ షెల్టర్లు నిర్మించేందుకు సాయం చేశాం. ఒక పూట భోజన వసతికి సాయం చేశాం. సిక్కింలో ఎయిడ్స్‌ బాధిత చిన్నారులకు భవనాలు నిర్మించాం. అనేక ప్రాంతాల్లో స్వచ్ఛభారత్, డిజిటల్‌ లిటరసీ తదితర పథకాలకు సాయం చేశాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు డ్రైవింగ్, టైలరింగ్, స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement