ఐ.ఎఫ్.సి. సహకారం
పి.పి.పి.పద్ధతిలో అభివృద్ధి అవకాశాలు పుష్కలం
ఢిల్లీ తర్వాత తొలి నగరం
స్వాగ తిస్తున్న నగరవాసులు
విజయవాడ : విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు వరల్డ్ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐ.ఎఫ్.సి) ఆసక్తిచూపడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైనప్పుడు విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే అంశం చర్చకు వచ్చింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి ఐ.ఎఫ్.సి. ముందుకు వచ్చింది. దీనికి సీఎం కొంత సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గురువారం రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చేం దుకు నిధులు కేటాయిస్తామని ప్రకటించడం గమనార్హం.
ఢిల్లీ తర్వాత తొలి స్మార్ట్ నగరం
ఐ.ఎఫ్.సి. విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంగీకరిస్తే.. దేశంలో ఢిల్లీ తర్వాత తొలి స్మార్ట్ సిటీ విజయవాడ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కావడంతో దీన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారు. అదే జరిగితే నగర రూపురేఖలే మారిపోతాయి. స్మార్ట్ సిటీలో మెట్రో రైలు, విశాలమైన రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి శానిటేషన్ అభివృద్ధి, 24 గంటల విద్యుత్ సౌకర్యం, రోజంతా నగర ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, విమానాశ్రయం, నగరమంతా వైఫై సౌకర్యం, డిస్నీల్యాండ్, కాల్వల్లో బోటింగ్‌లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వర్షం నీటిని వడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచుకునే సౌకర్యాలు ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కాగా ఈ ప్రాజెక్టులో కొన్నింటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సమకూర్చితే, మరికొన్ని పి.పి.పి. పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ఐ.ఎఫ్.సి నిధులు కేటాయిస్తుంది.
అభివృద్ధికి అన్ని హంగులూ..
విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చేందుకు నిధులు కేటాయిస్తే ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని నగర ప్రముఖులు చెబుతున్నారు. 113 ఎకరాల్లో విస్తరించి ఉన్న భవానీ ద్వీపాన్ని గ్రీన్ ఫీల్డ్ జోన్‌గా అభివృద్ధి చేయడమే కాకుండా డిస్నీల్యాండ్‌ను ఏర్పాటు చేస్తే వాటర్ బోటింగ్ సౌకర్యం పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దేవాలయాన్ని అభివృద్ధి పరిచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చివచ్చు. నగరం మధ్య నుంచి వెళుతున్న మూడు కాల్వలను రవాణా సౌకర్యాలు, బోటింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. శివారు ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీతో శానిటేషన్ మిషన్లు ఏర్పాటు చేసి చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికే ఆసియాలోనే పెద్దదైన బస్‌స్టేషన్, పది ప్లాట్‌ఫారాలు ఉన్న రైల్వేస్టేషన్ ఉన్నాయి.
వీటిని మరికాస్త అభివృద్ధి చేస్తే దేశంలో ఇతర బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లను తలదన్నేలా నిలుస్తాయి. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పటికే మంజూరైన మెట్రో రైలు నిర్మాణం పూర్తయితే నగరాభివృద్ధి దూసుకుపోతుంది. ఇప్పటికే నగరంలో కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, ఐనాక్స్ థియేటర్లు వచ్చేశాయి. రాబోయే రోజుల్లో మెట్రో నగరాలకు దీటుగా ఇవి అభివృద్ధి చెందుతాయి. పోలీసులు కృషితో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, నేరాలను అదుపులో ఉంచితే రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీగా విజయవాడ అభివృద్ధి చెందడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు.
సిటీ.. స్మార్టీ
Published Fri, Mar 13 2015 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement
Advertisement