చిత్తశుద్ధి ఏదీ? | None of integrity? | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి ఏదీ?

Published Mon, Jan 19 2015 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

చిత్తశుద్ధి ఏదీ?

చిత్తశుద్ధి ఏదీ?

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రతి పల్లెనూ ‘స్మార్ట్ సిటీ’ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. పల్లెసీమలను ‘స్మార్ట్ విలేజ్’ చేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమే అయినా.. అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలింది. కేవలం ప్రచారం కోసమే టీడీపీ సర్కారు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ.. ప్రజలకు ‘అరచేతిలో వైకుంఠం’ చూపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో ‘స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డు’ కార్యక్రమం ఒకటి. ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో అధికార యంత్రాంగంతో పాటు.. మంత్రులు, శాసనసభ్యులు పాదయాత్ర చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వారు అభివృద్ధి చేయబోయే దత్తత గ్రామాలను కూడా ప్రకటించాలని ఆదేశించారు. స్మార్ట్ విలేజ్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాకూ రూ.కోటి విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం బ్యానర్లకు మాత్రం ఖర్చుచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిధులు విడుదల కాకపోవడంతో కార్యక్రమం తూతూ మంత్రంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు తాము దత్తత తీసుకుబోయే గ్రామాలను ప్రకటించాల్సి ఉంది.

అందులో భాగంగా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాత్రం తాను దత్తత తీసుకోబోయే గ్రామాన్ని ప్రకటించారు. కలిగిరి మండలం పెద్దపాడు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో వెల్లడించారు. వెంకటగిరి, కోవూరు ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తాము దత్తత తీసుకోబోయే గ్రామాల పేర్లు ప్రకటించకపోవడం గమనార్హం.
 
స్మార్ట్ విలేజ్, వార్డు సాధ్యమేనా?
గ్రామాల అభివృద్ధికి నిధులు ఏ మాత్రం విడుదల చేయకపోయినా... పల్లెలను స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని అధికారయంత్రాంగానికి ఆదేశాలు అందాయి. జిల్లాలో మొత్తం 940 పంచాయతీలు, 1620 గ్రామాలతో పాటు, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వార్డులు ఉన్నాయి. గ్రామాలు, వార్డుల్లో పక్కా గృహాలు, మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, విద్యుత్ సౌకర్యం, 100 శాతం సంస్థాగత ప్రసవాలు, ప్రసూతి, శిశు మరణాల నివారణ, పౌష్టికాహారలోపాన్ని నివారించడం, పాఠశాలల్లో డ్రాపౌట్స్ లేకుండా చూడడం, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రం, క్రమం తప్పకుండా గ్రామ, వార్డు సభల నిర్వహణ, ప్రతి కుటుంబానికీ బ్యాంక్ ఖాతా, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళిక, చెట్ల పెంపకం, నీటి సంరక్షణ- నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, సమాచార కేంద్రం, కంప్యూటర్ ల్యాబ్, మీ సేవా కేంద్రం, టెలికం, ఇంటర్‌నెట్ సౌకర్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రతి కుటుంబానికీ జీవనోపాధి అవకాశాలు కల్పించడం వంటి 20 సౌకర్యాలను 100 శాతం ఏర్పాటు చేయాలి.

ఇవన్నీ చేయడానికి ఆయా గ్రామాల నుంచి ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన వారిని గుర్తించి విరాళాలు సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా సేకరించిన నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అయితే విరాళాలు సేకరించే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. దత్తత బాధ్యతను అధికారులకు అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలనా బాధ్యతలతో పాటు ఎన్‌ఆర్‌ఐలను గుర్తించేదెప్పుడు? అభివృద్ధి చేసేదెప్పుడు? అనే ప్రశ్నలు అధికారులను వేధిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement