'అమరావతి రాజదాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.. ఇదంతా తనకు అంతర్జాతీయగా ఉన్న పలుకుబడివల్లే .."అని 2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదే, పదే చెప్పుకున్న మాటలు. ఆయనకు మాటలకు తగినట్లే సింగపూర్ దేశ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తరచు అమరావతి రావడం, చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఆరంభించడానికి ఒప్పందం చేసుకోవడం గమనించిన పలువురు నిజంగానే ఏపీ మీద, ఎపి రాజధాని మీద అభిమానంతోనే సింగపూర్ మంత్రి తరచు వస్తున్నారేమోలే అని అనుకునేవారు. కాని అప్పట్లోనే నిశితంగా పరిశీలన చేసే కొందరు మాత్రం ఇందులో ఏదో మోసం ఉందని అనేవారు. వారి మాటలను తోసిపుచ్చుతూ వారిని అమరావతి యజ్ఞాన్ని పాడుచేసే రాక్షసులు మాదిరి అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శిస్తుండేవారు. ఈశ్వరన్ లాగానే బిడిశెట్టి అనే మిత్రుడు కూడా చంద్రబాబుకు ఉన్నారు.
✍️ ఆయనకు కూడా ఏదో మెడికల్ హబ్ పెడతారని చెప్పి అమరావతిలో వంద ఎకరాల భూమిని తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు మిత్రులు ఇద్దరూ అవినీతి , హవాలా కేసులలో చిక్కుకోవడం. ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి సింగపూర్ లో అరెస్టు అవడం తదుపరి మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. బిడి శెట్టిని దుబాయి జైలులో అక్కడి ప్రభుత్వం పెట్టింది. మరో ఆసక్తికరపరిణామం ఏమిటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, రాజదాని కేసులు మొదలైనవాటిలో ఇరుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు మిత్రులు అవినీతి ఊబిలో ఉన్నారన్నమాట. సింగపూర్ లో ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలు వచ్చాయి.
✍️చంద్రబాబుకు సన్నిహితులైన ఈశ్వరన్ ,బిడి శెట్టి వంటివారు అరెస్టు అవడంంతో తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. వీరి అరెస్టుపై చంద్రబాబు స్పందించలేదు. కనీసం ఈశ్వరన్ కు సానుభూతి కూడా తెలపలేదు. అదే వైసిపికి సంబంధించినవారికి తెలిసినవారెవరైనా ఇతర దేశాలలో కేసులలో చిక్కితే ఇదే చంద్రబాబు కొండెక్కి అరిచేవారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ కేసులలో కొందరు అధికారులను పెడితే అదంతా జగన్ తో సంబంధాల వల్లే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన మిత్రుల అరెస్టుపై కిక్కురుమనలేకపోతున్నారు. ఈశ్వరన్, శెట్టిల పై వచ్చిన అవినీతి కేసుల గురించి ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కుక్కిన పేల మాదిరి నోరు మెదపలేదు. సింగపూర్ దేశ ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తున్నారని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు.
✍️తీరా చూస్తే అది అసత్యమని ఆ తర్వాత తేలింది. సింగపూర్ కు చెందిన కొన్ని ప్రైవేటు కంపెనీలతో కన్సార్టియమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ తయారు చేయాలని సంకల్పించారు. మామూలుగా అయితే దానిని తప్పు పట్టనక్కర్లేదు. కాని అవేదో సింగపూర్ దేశ ప్రభుత్వ కంపెనీలే వచ్చి ఈ వెంచర్ ను ఆరంభిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుండేవారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు బాకాలు ఊదుతుండేవి. తీరా చూస్తే అవి ప్రైవేటు కంపెనీలని తదుపరి వెల్లడైంది. సింగపూర్ ప్రభుత్వంతో ఆ సందర్భంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరిని విస్తుపరచింది. సింగపూర్ కంపెనీలు 300 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడితే, ఏపీ ప్రభుత్వం సుమారు 5600 కోట్ల రూపాయల మేర వ్యయం చేసి ఆ వెంచర్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించింది.
✍️ కంపెనీతో ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలన్న కండిషన్ పెట్టారు. స్విస్ చాలెంజ్ పద్దతిన ఈ వెంచర్ కు భూమి కేటాయించినట్లు అప్పట్లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో హైకోర్టు తప్పుపడితే, మళ్లీ చట్టాన్ని మార్చి మరీ తాము అనుకున్న స్కీమును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. విశేషం ఏమిటంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీకి 56 శాతం వాటా ఇచ్చి, ఏపీ ప్రభుత్వం మాత్రం మైనర్ వాటాదారుగా ఒప్పుకోవడం. ఈ వ్యవహారంపై ఎందరు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఏకంగా 1600 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు.
✍️నిజానికి ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ముందుగా వాస్తవ పరిస్థితిని సర్వే చేసి డిమాడ్ నిర్ణయించుకుంటారు. అవేవి లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయడం అంటే, చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలను పెంచుకోవడానికే అన్నది బహిరంగ రహస్యం. ఈ వివాదాస్పద నిర్ణయం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే టైమ్ కి చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది. కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించడంతో ,తమ లొసుగులు బయటపడుతున్నాయని భావించిన సింగపూర్ కంపెనీల కన్సార్షియం తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోతామని ప్రభుత్వానికి తెలియచేసింది.దాంతో ఆ కధ ముగిసింది. చంద్రబాబు,ఈశ్వరన్ కలిసి చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ భాగోతం అంతా బట్టబయలైంది. ఆ తర్వాత కాలంలో ఈశ్వరన్ పై అవినీతి కేసులు వచ్చాయి.
✍️సింగపూర్ దేశం ఇలాంటి అవినీతి వ్యవహారాలను అసలు అంగీకరించదు.అందువల్లే ఆయనను పదవినుంచి తప్పించడమే కాకుండా ఆ కేసుల విచారణకుఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు సింగపూర్ లో కూడా బినామీ లావాదేవీలు ఉన్నాయని, వాటికి ఈశ్వరన్ సహకారం ఉండి ఉంటుందని, అందువల్లే ఆయనకు ఏపీలో లాభం చేకూర్చే యత్నం చేశారని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈశ్వరన్ కు సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలిస్తే ఇలాంటి స్కామ్ లు ఏవైనా ఉంటే బయటపడవచ్చన్న భావన కూడా ఉంది. అమరావతి రాజధానిని ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ గా చంద్రబాబు మార్చారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం ఉండదు.
✍️ అవసరం లేకపోయినా 34 వేల ఎకరాల భూమి సేకరించడం, వారికి ఏటా సుమారు 250 కోట్ల రూపాయల కౌలు చెల్లించవలసి రావడం, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉండడం ..ఇవన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాని ఫలితంగానే అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భోగి మంటలు వేసుకుని, మళ్లీ అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. తద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలకు నష్టం చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు.
✍️రాష్ట్ర ప్రజల సొత్తు అంతటిని ఒక్క అమరావతిలోనే ఖర్చు చేస్తామని చంద్రబాబు, పవన్ లు చెబితే మళ్లీ ఇతర ప్రాంతాలలో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కుల రాజధాని అని, ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినవారెవరైనా నివసించే పరిస్థితి ఉందా అని అడిగేవారు.కాని ఆశ్చర్యంగా ఏ రకమైన ఒప్పందం కుదిరిందో తెలియదు కాని చంద్రబాబు తో ఆయన కూడా మిలాఖత్ అయిపోయారు.
✍️ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అస్సైన్డ్ భూముల స్కామ్ మొదలైనవి ఉండనే ఉన్నాయి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు అమరావతి అవినీతితో కూడా ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబుకు, ఆయనకు మద్య ఉన్న లావాదేవీలు ఏమిటి? అన్నవాటిపై విచారణ జరగలేదు. మొత్తం మీద అమరావతి అంటే అదొక అవినీతి కేంద్రం అన్న భావన ఏర్పడిన నేపధ్యంలో ఈశ్వరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే శెట్టి గోల్ మాల్ వెల్లడైంది. వీటిపై చంద్రబాబు వివరణ ఇచ్చి, ఆ తర్వాత అమరావతి గురించి మాట్లాడితే జనం అప్పుడు ఆయన చెప్పిన మాటలలోని విశ్వసనీయత గురించి ఆలోచిస్తారు. లేకుంటే కచ్చితంగా ఈ అవినీతి ఊబిలో చంద్రబాబు బృందానికి కూడా ఏదో లింక్ ఉందని అనుమానిస్తారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment