నరసన్నపేట : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆరంభశూరత్వంగానే మిలుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే కోవలో స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు కూడా చేరింది. ఈ కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. దీన్ని ప్రభుత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా ఆశించినంతగా దాతలు ముందుకు రాలేదు. వివరాల్లోకి వెళితే.. దాతల సహకారంతో గ్రామాలను స్మార్ట్ విలేజిలుగా, మున్సిపాల్టీల్లో వార్డులను స్మార్ట్ వార్డులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. అవసరమైన గైడ్ లైన్లు కూడా మండల కేంద్రాలకు పంపింది. ఇంటర్ నెట్‌లో ఉంచింది. మారుమూల గ్రామాల్లో రోడ్ల నుంచి ఇంటర్ నెట్ వరకూ అన్ని రకాల కల్పించేందుకు స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని గత నెల 18న ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి జిల్లా అధికారులు, అధికార పార్టీ ప్రతినిధులు, మంత్రులు కసరత్తు చేసినప్పటికీ దాతలు మాత్రం ముందుకు రావడం లేదు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే మొత్తం 1098 పంచాతీలు ఉన్నాయి. వీటిలో కేవలం 304 పంచాయతీలనే దాతలు దత్తత తీసుకున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో 187 వార్డులు ఉండగా కేవలం 37 వార్డులనే దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారు. ఇంకా 794 పంచాయతీలు, 150 వార్డుల్లో దాతలు కావాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు. మంత్రులు, అధికారులు వత్తిడి చేస్తున్నా దాతల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో జిల్లా యంత్రాంగం కలవర పడుతోంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు నరసన్నపేట బహిరంగ సభలో అతని పక్కనే కూర్చున్న కలెక్టర్ లక్ష్మీనరసింహాన్ని స్మార్ట్ గ్రామాలపై ప్రస్తావించినట్లు సమాచారం.
మరింతగా దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో రాజకీయ ప్రముఖులు కొందరు గ్రామాల దత్తత ప్రకటించినా మండలస్థాయిలో ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇతర గజిటెడ్ అధికారులు అంతగా స్పందించడలేదు. దీనికి నరసన్నపేట మండలంలోని పరిస్థతితే ఉదాహరణ. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నరసన్నపేటను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మిగిలిన ప్రజా ప్రతినిధులు స్పందించడలేదు. ఇతర మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. దీని అమలుకు కమిటీలు వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ముందుగా మండలాల్లో కమిటీలు వేసిన అనంతరం జిల్లాస్థాయి కమిటీలు వేస్తారు. జిల్లా కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీలతో పాటు మరో ముగ్గురు జిల్లా అధికారులు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్లలో సంబంధిత ఆర్డీవో సమన్వయ అధికారిగా పనిచేయాల్సి ఉంది.
దాతల ఎంపిక ఇలా..
సాయం చేస్తామని ముందుకొచ్చిన దాతల దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించి సమగ్రంగా పరిశీలిస్తారు.
దాతల ఆసక్తి ఏమిటి, గ్రామానికి ఏమి చేయాలనుకుంటున్నారు, అతని గత అనుభవం ఏమిటనే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
దత్తత గ్రామాల్లో 20 ప్రామాణికాలను ప్రభుత్వం నిర్దేశించింది. వాటిలో ప్రధానమైనవి ప్రతీ కుటుంబానికి జీవనోపాధి అవకాశాలు పెంచుట.
అందరికీ గృహం, మరుగుదొడ్డి, రక్షత నీరు, విద్యుత్ సరఫరా.
నూరు శాతం ఆస్పత్రి కాన్పులు
పోషకాహార లోపాన్ని నివారించుట
శత శాతం అక్షరాస్యత, రోడ్లు , మురుగు కాల్వలు నిర్మించుట, నూతన సాంకేతిక పద్ధతులు.
సౌరశక్తి వినియోగం, ఎల్‌ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం
ప్రతీ కుటుంబానికి బ్యాంకు అకౌంట్, కనీసం జన్‌ధన్ ఎకౌంట్ ఉండేలా చూడటం.
గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు
ఒక వైపు స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డుల కోసం ప్రభుత్వం కృషి చేస్తూ దాతల కోసం వెతుకుతుంటే.. మరో వైపు గ్రామాల్లో సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఏ ఒక్క సమస్య అయినా పరిష్కాం అవుతుందా అనే అనుమానం సర్వాత్రా వ్యక్తం అవుతుంది. మురుగు కాలువలు, రోడ్లు, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ దశలో స్మార్టు విలేజిల అభివృద్ధికి కోట్లాది రూపాయలు అవసరం. ఇటీవల నరసన్నపేట మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాదయాత్ర ద్వారా పలు సమస్యలు తెలుసుకున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కనీసం రూ. 5 కోట్లు కావాలి. ఒక్క నరసన్నపేటలోనే ఈ పరిస్థతి ఉంటే మిగిలిన గ్రామాలు, పట్టణాలు పరిస్థితి ఏమిటీ అనే సందేహం వ్యక్తమవుతోంది.
స్మార్ట్‌వైపు చూడని దాతలు!
Published Sat, Feb 28 2015 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement